Actor Chandramohan Death: సీనియన్ కథానాయకులు చంద్రమోహన్ మరణంతో సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. శనివారం హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తన 55 ఏళ్ల సినీ ప్రస్థానంలో 900 పైగా చిత్రాల్లో నటించిన చంద్రమోహన్.. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించారు. ఆయన మృతిపై సినీ లోకం నివాళి అర్పిస్తోంది. సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్ర‌ముఖ న‌టుడు చంద్ర‌మోహ‌న్ అనారోగ్యంతో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ క‌న్ను మూయ‌డం బాధాక‌రం అని సీఎం జగన్ అన్నారు. తొలి సినిమాకే నంది అవార్డును గెలుచుకున్న ఆయ‌న తెలుగు, త‌మిళ భాషల్లో వంద‌లాది సినిమాల్లో న‌టించి తెలుగు ప్ర‌జ‌ల హృద‌యాల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నారని కొనియాడారు. చంద్ర‌మోహ‌న్ కుటుంబ స‌భ్యుల‌కు తన ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తూ.. ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నానని సీఎం జగన్ ట్వీట్ చేశారు.


 




"'సిరిసిరిమువ్వ', 'శంకరాభరణం', 'రాధాకళ్యాణం', 'నాకూ పెళ్ళాం కావాలి' లాంటి అనేక  ఆణిముత్యాల్లాంటి  చిత్రాల్లో తన వైవిధ్య నటనా కౌశలం ద్వారా  తెలుగు  వారి  మనస్సులో చెరగని ముద్ర  వేసిన సీనియర్ నటులు, కథనాయకులు చంద్రమోహన్ గారు ఇక లేరని  తెలవడం ఎంతో  విషాదకరం. 



నా తొలి చిత్రం 'ప్రాణం ఖరీదు' లో  ఒక మూగవాడి పాత్రలో అత్యద్భుతమైన నటన ప్రదర్శించారాయన. ఆ సందర్భంగా ఏర్పడిన మా తొలి పరిచయం, ఆ తర్వాత మంచి స్నేహంగా, మరింత గొప్ప  అనుబంధంగా మారింది. ఆయన సాన్నిహిత్యం ఇక లేకపోవటం నాకు వ్యక్తిగతంగా తీరని లోటు. ఆయన ఆత్మకి  శాంతి చేకూరాలని కోరుకుంటూ , ఆయన కుటుంబ  సభ్యులకు , అభిమానులకు నా  ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాను.." అని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు.


 




"తెలుగు సినీ కళామాతల్లి ముద్దుబిడ్డ, సంపూర్ణ  నటుడు చంద్రమోహన్‌ గారు పరమవీదించడం ఎంతో విషాదకరం. చంద్రమోహన్‌ గారు ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులపై చెరగని ముద్రవేశారు. సాంఘిక, పౌరాణిక పాత్రల పోషణలో ఆయన మేటి. చంద్రమోహన్‌ గారు, నాన్నగారితో కలసి యుగపురుషుడు, నిండుదంపతులు, ధనమా? దైవమా? ఇలా ఎన్నో చిత్రాలలో చక్కని పాత్రలు పోషించారు. ఆయనతో కలసి ఎన్నో చిత్రాలలో పని చేయడం గొప్ఫ అనుభూతి.


'ఆదిత్య 369' చిత్రంలో చంద్రమోహన్‌ గారు తెనాలి రామకృష్ణ కవిగా పోషించిన పాత్ర మరపురానిది. సినీ పరిశ్రమకు ఆయన అందించిన సేవలు మరువలేనివి. పరిశ్రమకు ఆయన లేని లోటు తీరనిది. ఆయన ఎప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో ఉంటారు. చంద్రమోహన్‌ గారి కుటుంబ నభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. చంద్రమోహన్‌ గారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాను.." అని నందమూరి బాలకృష్ట ఓ ప్రకటనలో తెలిపారు. 


చంద్రమోహన్ కన్ను మూశారని తెలిసి ఆవేదన చెందానని నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. ఆయనను తెరపై చూడగానే మనకు ఎంతో పరిచయం ఉన్న వ్యక్తినో.. మన బంధువునో చూస్తున్నట్లు అనిపించేదన్నారు. కథానాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనదైన నటనను చూపించారని.. పదహారేళ్ళ వయసు, సిరిసిరి మువ్వ, సీతామాలక్ష్మి, రాధా కళ్యాణం లాంటి చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించారని గుర్తు చేసుకున్నారు. చంద్ర మోహన్‌తో తమ కుటుంబానికి స్నేహ సంబంధాలు ఉన్నాయన్నారు. తెలుగు ప్రేక్షకులలో అన్ని తరాలవారికి చంద్రమోహన్ చేరువయ్యారని.. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని అన్నారు.