Sir Movie Review: ఈ మధ్యకాలంలో తమిళ హీరోలు, తెలుగు డైరెక్టర్ల కాంబినేషన్లు చాలా తెరమీదకు వచ్చాయి. అలాంటి కాంబినేషన్లో సార్ సినిమా కూడా తెరకెక్కింది. తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి తమిళ స్టార్ హీరో ధనుష్ కాంబినేషన్ లో వాతి అనే తమిళ సినిమా, సార్ అనే తెలుగు సినిమాలను ఏకకాలంలో తెరకెక్కించారు.  ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాని ఫిబ్రవరి 17వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. అయితే ఒకరోజు ముందుగానే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియాస్ షోస్ పడ్డాయి. ఈ క్రమంలోనే ఈ సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో చూద్దాం


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కథ ఏమిటంటే:
కథ అంతా అన్నవరం సత్యనారాయణమూర్తి (సుమంత్) కోణంలో సాగుతూ ఉంటుంది. ఐఏఎస్ అధికారి అయిన సత్యనారాయణమూర్తి దగ్గరకు ఒక వ్యక్తిని వెతుక్కుంటూ వస్తారు కొందరు కుర్రాళ్ళు. ఆ వ్యక్తి ఎవరో కాదని తాను ఇంత స్థాయికి రావడానికి కారణమైన లెక్చరర్ బాలగంగాధర్ తిలక్ అని తెలుసుకుని అతని గురించి చెప్పడం ప్రారంభిస్తాడు మూర్తి. తన జీవితంలో సీనియర్ లెక్చరర్ అయితే చాలు ఎంతోమందికి చదువు చెప్పవచ్చు అని భావించే ఒక  ప్రైవేటు కాలేజీ జూనియర్ లెక్చరర్ బాలగంగాధర్ తిలక్(ధనుష్). 2000 సంవత్సరంలో అప్పుడప్పుడే పుట్టుకొస్తున్న ప్రైవేటు జూనియర్ కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీల ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఒక బిల్లు తీసుకురాబోతే ప్రైవేట్ కాలేజీలు అన్నీ కలిసి గవర్నమెంట్ కాలేజీలను దత్తత తీసుకుని తమ వద్ద జూనియర్ లెక్చరర్లుగా పని చేస్తున్న కొందరిని తీసుకువెళ్లి లెక్చరర్లుగా నియమిస్తారు. వాళ్లంతా చదువు సరిగా చెప్పరనే ఉద్దేశంతో అలా చేస్తే అనూహ్యంగా బాలగంగాధర్ తిలక్ దెబ్బకు సిరిపురం అనే గ్రామంలో 45 మంది విద్యార్థులు మొదటి సంవత్సరం అత్యద్భుతమైన మార్కులతో పాస్ అవుతారు. దీంతో ప్రైవేటు కాలేజీల యజమాని త్రిపాఠి(సముద్రఖని) ఎలా అయినా బాలు చదువు చెప్పకుండా అడ్డుకోవాలని ప్రయత్నిస్తాడు. అనేక ఇబ్బందులకు సైతం గురిచేస్తాడు, అలాంటి సమయంలో బాలు సార్ ఆ పిల్లలందరికీ ఎలా చదువు చెప్పాడు? గ్రామం నుంచి బహిష్కరించినా పిల్లలందరూ బాలగంగాధర్ తిలక్ చెప్పిన పాఠాలతో ఎలా చదువుకున్నారు? ఈ పరిణామాలలో మీనాక్షి(సంయుక్త మీనన్) పాత్ర ఏమిటి? అనేది ఈ సినిమా కథ.


విశ్లేషణ:.
సినిమా ప్రారంభమే కాస్త బోల్డ్ మూవీలా ఓపెన్ చేసిన డైరెక్టర్ వెంకీ అట్లూరి తర్వాత మాత్రం సినిమా మీద ప్రేక్షకులలో అంచనాలు కలిగించే విధంగా ముందుకు తీసుకువెళ్లాడు. ముందుగా ఏఎస్ మూర్తి ఎవరు అని ప్రేక్షకులలో ఆసక్తి రేకెత్తించి అతను ఒక ఐఏఎస్ అధికారి అని చెప్పడమే కాక వెంటనే బాలగంగాధర్ తిలక్ అలియాస్ బాలు ఎవరనే ఆసక్తి రేకెత్తిస్తాడు. బాలగంగాధర్ తిలక్ క్యారెక్టర్ తో ప్రతి ఒక్కరూ ప్రేమలో పడేలా కథలోకి తీసుకువెళ్లాడు. ఫస్ట్ ఆఫ్ మొత్తం బాలగంగాధర్ తిలక్ క్యారెక్టర్ , పిల్లలకు చదువు మీద ఆసక్తి కలిగించేందుకు అతను చేసిన ప్రయత్నాలు చూపిస్తారు. అదేవిధంగా ప్రేక్షకులను ఎంగేజ్ చేసేందుకు హైపర్ ఆది మరో తమిళనటుడితో పెట్టిన కామెడీ ట్రాక్స్ ఆకట్టుకుంటాయి. ఇంటర్వెల్ సమయానికి సినిమా మీద ప్రేక్షకులు అందరిలో ఆసక్తి కలిగించే విధంగా రాసుకున్న వెంకీ అట్లూరి ఇంటర్వెల్ తరువాత కూడా గ్రిప్పింగ్ వేలో సినిమాను తీసుకువెళ్లాడు. ధనుష్ ఎలా అయినా పిల్లలకు చదువు చెప్పకూడదని సముద్రనిఖని ఎంత దూరమైనా వెళ్లడం, అనేక ప్రయత్నాలు చేయడం చూపించాడు. ఇక తర్వాత సెకండ్ హాఫ్ లో ఎలా అయినా వారికి చదువు చెప్పాలని ధనుష్ చేసిన ప్రయత్నం, అందుకు పడిన కష్టం కూడా చూపించారు. ఇక మధ్యలో హీరోయిన్ తో ప్రేమాయణం ఉన్నా కూడా ఎక్కడా అశ్లీలతకు, అసభ్యతకు తావు లేకుండా చక్కగా హృద్యంగా మలిచాడు. ఇక క్లైమాక్స్ కూడా ప్రేక్షకులందరూ ఆలోచిస్తూ బయటకు వచ్చే విధంగా డీల్ చేయగలిగాడు వెంకీ అట్లూరి.


నటీనటులు: 
నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమాలో బాలగంగాధర్ తిలక్ అలియాస్ బాలు పాత్రలో నటించిన ధనుష్ ఒకరకంగా వన్ మాన్ షో నడిపాడు. సినిమాలో అనేక పాత్రలు ఉంటాయి కానీ బాలు పాత్రతో ప్రేక్షకులు ప్రేమలో పడిపోతారు. ఆ పాత్రలో తనదైన సహజ నటనతో ధనుష్ ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. మీనాక్షి పాత్రలో సంయుక్త మీనన్ కూడా తన పరిధి మీద నటించే ప్రయత్నం చేసింది. ఇక కొన్ని సీన్స్ లో అలాగే సాంగ్స్లో ఆమె కళ్ళతోనే నటించింది అంటే అతిశయోక్తి కాదు. మలయాళ నటుడు హరీష్ పేరడీ, తమిళనటుడు ఆడుకాలం నరేన్, సముద్రఖని, తనికెళ్ల భరణి, సాయి కుమార్, హైపర్ ఆది అలాగే అనేకమంది టీనేజ్ నటీనటులు సినిమాలో తమ పరిధి మేర నటించారు. ఏ ఒక్కరి పాత్ర కూడా తెచ్చి తగిలించినట్లు కాకుండా చాలా సహజంగా తీర్చిదిద్దినట్లు కుదిరాయి.


టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే: 
టెక్నికల్ విషయానికి వస్తే సినిమా దర్శకుడు వెంకీ అట్లూరి మార్క్ ఆద్యంతం కనిపించింది. ఎక్కడా అసభ్యతకు అశ్లీలతకు తావు లేకుండా చెప్పాలనుకున్న పాయింట్ నేరుగా చెప్పడంలో దర్శకుడు సఫలమయ్యాడు. ఆయన కొన్ని సీన్స్ లో చూపించిన ఇంటెలిజెన్స్ అబ్బా భలేగా చెప్పాడుగా అనిపించేలా ఉంది. ఇక ఆయన రాసుకున్న మాటలు ఆలోచింపజేసే విధంగా సాగాయి. కుల వివక్ష గురించి, చదువు ప్రాముఖ్యత గురించి వెంకీ అట్లూరి పలికించిన డైలాగులు త్రివిక్రమ్ రైటింగ్ స్టైల్ ని గుర్తు చేయక మానవు. ఇక జీవి ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం సినిమాకి అదనపు ఆకర్షణ అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ముఖ్యంగా మాస్టారు మాస్టారు అనే సాంగ్ వినడానికి ఎంత బాగుందో తెరమీద చూడడానికి కూడా అంతే అందంగా అనిపించింది. ఎడిటింగ్ కూడా ఎక్కడా వంక పెట్టలేని విధంగా క్రిస్పీగా ఉంది,  చిన్న చిన్న లాజిక్స్ పక్కన పెడితే సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా సాగింది. సినిమాటోగ్రఫీ సినిమాకు అదనపు అందాన్ని జోడించింది, ఇక హారికా హాసిని-సితార సంస్థల ప్రొడక్షన్ వాల్యూస్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా?


ఫైనల్ గా ఒక్కమాటలో చెప్పాలంటే ఈ ధనుష్ ‘సార్’ ఒక ఫీల్ గుడ్ ఎమోషనల్ థ్రిల్లర్. ఎలాంటి అసభ్యతకు, అశ్లీలతకు తావు లేని, ఫ్యామిలీ మొత్తం కలిసి చూడాల్సిన సినిమా. 
Rating: 3/5



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook