టాలీవుడ్‌లో టాప్ డైరెక్టర్స్‌లో ఒకరిగా పేరు తెచ్చుకున్న పూరి జగన్నాథ్... సినిమాల్లోకి రాకముందు సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న క్రమంలో ఎంతోమందిలాగే తాను కూడా ఎన్నో కష్టాలు పడినవాడే. ఈ విషయాన్ని తానే స్వయంగా అంగీకరించాడు. ఇటీవల జరిగిన ఈ మాయ పేరేమిటో ఆడియో లాంచ్ ఫంక్షన్‌కి ముఖ్య అతిథి ఎన్టీఆర్‌తో కలిసి హాజరైన పూరి జగన్నాథ్ ఈ సందర్భంగా ఈ సినిమా హీరో రాహుల్ విజయ్ తండ్రి స్టంట్ మాస్టర్ విజయ్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాను సినిమాల్లోకి రాకముందు క్రిష్ణానగర్‌లో ఓ హోటల్లో సర్వర్‌గా పనిచేస్తోన్న రోజుల్లో అక్కడికొచ్చే సినిమావాళ్లు కొంతమంది తనని చిన్నచూపుచూసే వాళ్లు. కానీ స్టంట్ మాస్టర్ విజయ్ మాత్రం తన పట్ల ఎంతో హుందాగా ప్రవర్తించే వారు అని పూరి తన పాత రోజులను నెమరేసుకున్నాడు. 


తాను దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టిన తర్వాత బద్రి సినిమాకు విజయ్‌ని స్టంట్ మాస్టర్‌గా తీసుకోవడమే కాకుండా ఆ తర్వాత ఎన్నో సినిమాలకు తాము ఇద్దరం కలిసి పనిచేశాం అని అన్నాడు పూరి. అందుకే స్టంట్ మాస్టర్ విజయ్ తనయుడు రాహుల్ విజయ్ ఈ మాయ పేరేమిటో సినిమాతో హీరోగా పరిచయం అవుతుండటం తనకెంతో సంతోషాన్ని ఇచ్చింది అని పూరి ఆనందం వ్యక్తంచేశాడు. రాము కొప్పుల డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు ప్రముఖ కంపోజర్ మణిశర్మ మ్యూజిక్ అందించాడు.