తెలుగులో ఐపీఎల్.. ఆ మజానే వేరు : జూనియర్ ఎన్టీఆర్
ఈసారి ఐపీఎల్ మ్యాచ్‌లని తెలుగులో వీక్షించే అవకాశం అందుబాటులోకి వచ్చిందంటూ ఐపీఎల్‌ని తనదైన స్టైల్లో ప్రమోట్ చేస్తున్నాడు టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.
ఈసారి ఐపీఎల్ మ్యాచ్‌లని తెలుగులో వీక్షించే అవకాశం అందుబాటులోకి వచ్చిందంటూ ఐపీఎల్‌ని తనదైన స్టైల్లో ప్రమోట్ చేస్తున్నాడు టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. ఐపీఎల్ మ్యాచ్‌ల తెలుగు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న జూనియర్ ఎన్టీఆర్.. మంగళవారం పార్క్ హయత్‌లో జరిగిన ఐపీఎల్ ఈవెంట్‌లో పాల్గొని సందడి చేశాడు. ఐపీఎల్ మ్యాచ్‌లని తెలుగులో వీక్షించడంలో వున్న మజా ఏంటో తన స్నేహితులకు ఎన్టీఆర్ వివరిస్తోన్న ఓ వీడియో సైతం ప్రస్తుతం ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది . " కారం లేని కోడి, ఉల్లిపాయ లేని పకోడి, పెట్రోల్ లేని గాడీ, మీసాలు లేని రౌడీ.. పరిగెత్తడం రాని కేడీ, ఆవకాయ లేని జాడీ, ఆటల్లేని బడి, అమ్మ ప్రేమ లేని ఒడి" అంటూ ఎన్టీఆర్ ఎప్పటిలాగే గుక్క తిప్పుకోకుండా డైలాగ్ చెప్పడంతోపాటు "అసలు మజా తెలుగురా" అని చెప్పిన తీరు తారక్ అభిమానులని ఆకట్టుకుంటోంది.
ఈ ఈవెంట్‌లో పాల్గొన్న సందర్భంగా క్రికెట్ గురించి, క్రికెట్ స్టార్స్ గురించి తారక్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. సచిన్ టెండూల్కర్‌కి తాను వీరాభిమానినని చెప్పిన తారక్.. సింహాద్రి సినిమాతో హిట్ కొట్టినప్పుడు తొలిసారి సిక్స్ కొట్టినంత ఆనందం ఇచ్చిందన్నాడు. కొంతమంది క్రికెటర్ల బయోపిక్స్ సినిమాల రూపంలో వస్తుండటంపై ఆనందం వ్యక్తంచేసిన తారక్.. తాను క్రికెటర్ల బయోపిక్స్ చేసే సాహసం చేయలేనన్నాడు.