కంటికి శాశ్వత గాయంతో బాధపడుతున్న జాక్వెలిన్ ఫెర్నాండెజ్
బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కంటికి గాయం
బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కంటికి గాయమైంది. ఈ నెల 15న విడుదలవనున్న రేస్ 3 సినిమాలో సల్మాన్ ఖాన్ సరసన జంటగా కనిపించనున్న ఈ లంక బ్యూటీ ప్రస్తుతం కంటికి గాయంతో బాధపడుతోంది. ఈ విషయాన్ని స్వయంగా తానే వెల్లడించింది. అబు ధాబిలో రేస్ 3 సినిమా షూటింగ్‌లో భాగంగా స్క్వాష్ ఆట ఆడుతుండగా తన కంటికి గాయమైనట్టు జాక్వెలిన్ తెలిపింది. తన కంటి పాప ఇకపై ఎప్పుడూ వలయాకారంలో ఉండబోదని, ఆ గాయం శాశ్వతంగా అలాగే ఉండిపోతుందని జాక్వెలిన్ స్పష్టంచేసింది. అయితే, అదృష్టవశాత్తుగా తాను ఇంకా చూడగలుగుతున్నానని ఆనందం వ్యక్తంచేసిందామె.
లంక నుంచి వచ్చి బాలీవుడ్‌లో అవకాశాలు అందిపుచ్చుకుంటోన్న జాక్వెలిన్ ఫెర్నాండెజ్ అనతికాలంలోనే టాప్ హీరోయిన్స్ సరసన నిలిచింది. సల్మాన్ ఖాన్ సరసన జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటించడం ఇది రెండోసారి. గతంలో కిక్ సినిమాలో ఈ ఇద్దరూ కలిసి జంటగా నటించారు. రేస్ 2 మూవీలో నటించిన జాక్వెలిన్ ఫెర్నాండెజ్ రేస్ 3 సీక్వెల్‌లోనూ నటించే ఛాన్స్ కొట్టేయడానికి మరో కారణం కిక్ సినిమాలో సల్మాన్ ఖాన్-జాక్వెలిన్‌ల కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవడమే.