జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లకు ఎంత కష్టమొచ్చింది !
కన్న తండ్రి మృతి విషాదం నుంచి ఇంకా తేరుకోకముందే..
జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇద్దరూ తమ కన్న తండ్రిని కోల్పోయిన బాధలో ఉన్నారు కనుక కొన్నాళ్లపాటు షూటింగ్ కి సెలవు తీసుకుంటారనే అందరూ భావించారు. అయితే, ఆ ఇద్దరు అన్నాదమ్ముళ్లు మాత్రం అలా కాకుండా అప్పుడే షూటింగ్ కి రెడీ అయిపోయారు. తమని నమ్ముకున్న నిర్మాతలకు తమ వల్ల ఏ ఇబ్బందీ కలగకూడదనే ఉద్దేశంతో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇద్దరూ షూటింగ్ కి హాజరవడానికి రెడీ అయ్యారు. ప్రస్తుతం ఎన్టీఆర్ అరవింద సమేత సినిమాలో నటిస్తుండగా కళ్యాణ్ రామ్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కెవీ గుహన్ దర్శకత్వంలో ఓ థ్రిల్లర్ సినిమా చేస్తున్నాడు. ఎన్టీఆర్ శనివారం నుంచే అరవింద సమేత షూటింగ్ కి హాజరవుతుండగా కళ్యాణ్ రామ్ సోమవారం నుంచి తన సినిమా షూటింగ్ కి వెళ్లనున్నాడు.
ఎన్టీఆర్ నటిస్తున్న అరవింద సమేత సినిమా ముందస్తుగా ప్లాన్ చేసుకున్న షెడ్యూల్ ప్రకారం దసరా సందర్భంగా రిలీజ్ కావాల్సి ఉంది. పండగ సెలవుల సీజన్ కావడంతో దసరా సీజన్ లో సినిమా రిలీజైతే కలెక్షన్స్ భారీగా రాబట్టుకోవచ్చనేది నిర్మాతల ప్లాన్. అందుకే నిర్మాతలను ఇబ్బంది పెట్టకుండా, వారి షెడ్యూల్ డిస్టర్బ్ కాకుండా ఎన్టీఆర్ అరవింద సమేత సినిమా షూటింగ్‌కి హాజరవుతున్నాడు. తండ్రిని కోల్పోయిన బాధలోంచి ఇంకా తేరుకోకముందే అప్పుడే కెమెరా ముందు నవ్వుతూ నటించాలంటే ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో ఊహించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. అందుకే తమ అభిమాననటుడికి వచ్చిన కష్టం ఇంకెవ్వరికీ రాకూడదు అని అనుకుంటున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్.