హిందీ టీవీ పరిశ్రమ నుంచి తెలుగు నాట ఎంట్రీ ఇచ్చిన బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోను హోస్ట్ చేసిన యంగ్ టైగర్ తారక్.. ఆ షోను ఎంత హిట్ చేశాడో అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో అంత హిట్ అవడానికి కారణం తారక్ హోస్టింగ్ స్టైల్ ఒక కారణమైతే, అతడికి వున్న ఫ్యాన్ ఫాలోయింగ్ మరో కారణం అని షో నిర్వాహకులు సైతం అభినందించారు. అయితే, అంతటి సూపర్ హిట్ రియాలిటీ షోకు స్వాగతం చెప్పిన తారక్ ఇక రెండో సీజన్‌లో హోస్టింగ్ చేయడం కష్టమేననే టాక్ వినిపిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టాలీవుడ్ అప్‌డేట్స్ ప్రకారం తారక్ ఈ ఏడాది రెండు సినిమాలు చేయనున్నాడని తెలుస్తోంది. తారక్ చేయనున్న రెండు సినిమాల్లో ఒకటి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో కాగా మరొకటి దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో అని సమాచారం. ఈ రెండు సినిమాలకు డేట్స్ కేటాయించిన తారక్‌కి ఇక బిగ్ బాస్ 2 సీజన్ షూటింగ్‌కి హాజరవడానికి తీరిక ఎక్కడ దొరుకుతుందనే సందేహాలు వినిపిస్తున్నాయి. అందులోనూ జక్కన్న సినిమా సెట్స్‌పైకి వెళ్లడానికన్నా ముందే జక్కన్న నిర్వహించే వర్క్ షాప్‌కి తారక్ హాజరు కావాల్సి వుంటుంది. జక్కన్న సినిమా కోసం తారక్ ఫిట్‌నెస్ మార్పుపై సైతం దృష్టిపెట్టనున్నాడట. ఇన్ని బిజీ షెడ్యూల్స్ మధ్య ముంబై వెళ్లి బిగ్ బాస్ 2 షూట్ చేయడానికి తారక్‌కి ఇక తీరిక ఎక్కడిది అంటున్నాయి ట్రేడ్ సర్కిల్స్.


అయితే, కేవలం ఈ బిజీ షెడ్యూల్ కారణంగానే తారక్ బిగ్ బాస్ రెండో సీజన్ చేయకపోవచ్చనే ప్రచారాన్ని నమ్మడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే. గతేడాది తారక్ బిగ్ బాస్ షో చేసినప్పుడు అదే సమయంలో జై లవ కుశ సినిమా షూటింగ్‌కి హాజరయ్యాడు. జై లవ కుశ సినిమాలో త్రిపాత్రాభినయం చేసిన ఎన్టీఆర్‌కి ఒకేసారి ఆ సినిమా షూటింగ్‌కి బిగ్ బాస్ షూటింగ్‌కి హాజరవడం ఎంత పెద్ద సవాలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ అప్పట్లోనే ఆ ఒత్తిడిని అధిగమించి బిగ్ బాస్ పూర్తిచేసిన తారక్ రెండో సీజన్ మాత్రం ఎందుకు వదులుకుంటాడు ?