Chiranjeevi on K Vishwanath's Death: కళాతపస్వి కె.విశ్వనాథ్ మృతి తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. కే విశ్వనాథ్ ఇక లేరని తెలిసి తీవ్ర షాక్‌కి గురయ్యాను. విశ్వనాథ్ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే ఒక రకంగా తన తెలుగు సినిమాల స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన గొప్ప దర్శకులు ఆయన. అటువంటి కే విశ్వనాథ్ ఇక లేరనే వార్త తనను తీవ్రంగా కలచి వేసింది అని ఆవేదన వ్యక్తంచేశారు. విశ్వనాథ్ లాంటి డైరెక్టర్ కన్నుమూయటం వ్యక్తిగతంగా నాకే కాదు.. యావత్ తెలుగు సినీ పరిశ్రమకే తీరని లోటు అని తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. ఈ కష్టకాలంలో కుటుంబ సభ్యులకు ఈ బాధను తట్టుకునే శక్తిని ప్రసాదించాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను " అని అన్నారు.
 
కె.విశ్వనాథ్‌ కుటుంబంతో చిరంజీవి కుటుంబానికి ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఆయన్ను తన గురువులా, సొంత కుటుంబ సభ్యుడిలా భావించే చిరంజీవి.. ఎప్పటికప్పుడు తన భార్య సురేఖతో కలిసి కె.విశ్వనాథ్ ఇంటికి వెళ్లి విశ్వనాథ్ దంపతులను మర్యాదపూర్వకంగా కలిసి చూసి వస్తుండే వారు. కే విశ్వనాథ్ దాదా సాహేబ్ ఫాల్కె అవార్డు అందుకున్న సమయంలోనూ చిరంజీవి దంపతులు ఇద్దరూ వెళ్లి తమ ఆనందాన్ని వారితో కలిసి పంచుకున్నారు. 


నటన విషయంలోనూ మెగాస్టార్ లాంచి చిరంజీవికే ఎన్నో మెలకువలు నేర్పించిన గురువు ఆయన. అందుకే వీళ్లిద్దరూ కలిసి చేసిన 'శుభలేఖ', 'స్వయంకృషి', 'ఆపద్బాంధవుడు' వంటి సినిమాలు అప్పట్లో సూపర్ హిట్‌గా నిలిచాయి. తనకు కెరీర్లో చెప్పుకోదగిన సినిమాలు అందించి, తన ఉన్నతకి కారణమైన దర్శకుడు కే విశ్వనాథ్ మృతి నిజంగానే చిరంజీవికి తీరని లోటు అనే చెప్పుకోవచ్చు.