నేను ఆత్మహత్య చేసుకుంటా: కేఆర్‌కే
బాలీవుడ్ నటుడు మరియు చిత్ర విమర్శకుడు కమల్ ఆర్ ఖాన్ అలియాన్ కేఆర్‌కే తాను ఆత్మహత్య చేసుకోనున్నట్లు ప్రకటించారు. ఇటీవలే సినిమాలపై, ప్రముఖులపై వివాదాస్పదమైన కామెంట్లు చేస్తున్న కేఆర్‌కే ట్విటర్ ఖాతాని స్తంభింపజేస్తున్నట్లు ట్విటర్ యాజమాన్యం ప్రకటించింది. అయితే తన ట్విటర్ ఖాతాను నిలిపివేయడం వెనుక అమీర్ ఖాన్ హస్తముందని, తనపై లీగల్ యాక్షన్ తీసుకుంటానని ప్రకటించాడు కేఆర్‌కే. ఇప్పుడు తన ట్విటర్ ఖాతాను వెంటనే పునరుద్ధరించాలని, లేకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానని ప్రకటించాడు. ఈ ప్రకటన వెలువడిన వెంటనే పోలీసులు, ముంబయి వెర్సోవా ప్రాంతంలో ఉన్న కేఆర్‌కే బంగ్లాకి హుటాహుటిన చేరుకున్నారు.
కేఆర్‌కే ట్విటర్‌లో పోస్టు చేసిన వ్యాఖ్యలు అనేకసార్లు వివాదాస్పదంగా మారాయి. మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, టాలీవుడ్ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి, నటుడు రామ్‌చరణ్ లాంటి వారి మీద కూడా గతంలో ట్విటర్ వేదికగా నోరు పారేసుకున్నాడు కేఆర్‌కే . పలుమార్లు నటీమణులపై కూడా సెక్సీ కామెంట్లు చేశాడు. ఇప్పుడు తన ట్విటర్ ఖాతాను నిలిపివేసినందుకు స్పందిస్తూ, ఆ ఖాతాను పునరుద్ధరించడానికి మిలియన్ రూపాయలను చెల్లించమన్నారని.. ఆ విధంగా తనను మోసం చేశారని, వెంటనే ఖాతాను పునరుద్ధరించపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానని ప్రకటించాడు కేఆర్‌కే.