ఇటీవల మా అసొషియేషన్‌లో తలెత్తిన వివాదాలు పరిశ్రమలోని పెద్దలు కలగజేసుకోవడంతో సమసిపోయినట్టుగా తెలుస్తోంది. అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీరాజా, అసోసియేషన్‌ కార్యదర్శి సీనియర్ నటుడు నరేష్‌లు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో చేసుకున్న ఆరోపణలు మా అసోసియేషన్‌ని రోడ్డున పడేలా చేశాయి. చిరంజీవి ముఖ్య అతిధిగా మా అసోసియేషన్ అమెరికాలో తలపెట్టిన  కార్యక్రమంతో సేకరించిన నిధులలో రూ. 1 కోటి దుర్వినియోగం అయ్యాయని నరేష్ ఆరోపించగా.. అందులోంచి ఒక్క రూపాయి దుర్వినియోగం అయ్యిందని నిరూపించినా తన యావదాస్తిని రాసిచ్చేస్తానని శివాజీ రాజా సవాల్ విసిరాడు. దీంతో మా అసోసియేషన్ వివాదం కాస్తా మీడియాకెక్కింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఈ వివాదం ఇలాగే కొనసాగితే పరిశ్రమ పరువు గంగలో కలిసిపోతుందని భావించిన పరిశ్రమ పెద్దలు వెంటనే రంగంలోకి దిగి ఇరువర్గాలతో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దారు. మా అసోసియేషన్ లో వివాదంపై దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వజ మాట్లాడుతూ.. "అన్ని చోట్లా ఇటువంటి సమస్యలు రావడం సర్వసాధారణమేనని, ఇక నుండి అన్ని విషయాలను తెలుగు ఫిలిం ఇండస్ట్రీనే చూసుకుంటుందని" అన్నారు. పరిశ్రమలోని పెద్దలు ఏర్పాటు చేసిన కలెక్టివ్‌ కమిటీ జరిపిన విచారణలో మా అసోసియేషన్‌లో ఎలాంటి అవకతవకలు జరగలేదని నిగ్గు తేలింది. ఇకపై మా అధ్యుక్షుడు శివాజీ రాజా, సెక్రటరీ నరేష్‌లు కలిసే పనిచేస్తారు అని తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టంచేశారు. 


ఇరు వర్గాలు ప్రెస్‌మీట్‌ పెట్టి తప్పు చేశాయని... లేదంటే విషయం ఇంత పెద్దది అయ్యుండేది కాదనే అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తూ ఇకపై భవిష్యత్తులో అసోసియేషన్‌కి సంబంధించిన విషయం ఏదైనా కలెక్టివ్‌ కమిటీనే మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతుందని తెలిపారు.