Mahanati movie review : మహానటి మూవీ రివ్యూ
అలనాటి మేటి నటి సావిత్రి బయోపిక్‌గా ఈరోజు థియేటర్లలోకి వచ్చిన మహానటి మూవీ రివ్యూ
నటీనటులు : కీర్తి సురేష్, దుల్కర్ సల్మాన్, సమంత, విజయ్ దేవరకొండ, డా. మోహన్ బాబు, డా.రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్, మాళవిక నాయర్, భాను ప్రియ, షాలిని పాండే, దివ్య వాణి, క్రిష్, తరుణ్ భాస్కర్, సందీప్ రెడ్డి వంగ, శ్రీనివాస్ అవసరాల, మహేష్ ఆచంట తదితరులు..
సంగీతం : మిక్కీ జె.మేయర్
ప్రొడక్షన్ డిజైన్ : శివం
ఆర్ట్ : అవినాష్
కాస్ట్యూమ్స్ : గౌరాంగ్, అర్చన
స్టైలిస్ట్: ఇంద్రాక్షి
కెమెరా: డాని
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర్రావు
దర్శకత్వం: నాగ్ అశ్విన్
నిర్మాత : ప్రియాంక దత్
నిర్మాణం : వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్
నిడివి : 2 గంటల 56 నిమిషాలు
సెన్సార్ : U
కొన్ని సినిమాలు తీయాలంటే ఎంతో ధైర్యం కావాలి. అంతకుమించి మరెంతో రీసెర్చ్ చేయాలి. ఈ రెండింటితో పాటు భారీగా ఖర్చు పెట్టాలి. ‘మహానటి’ సినిమాకు ఇవన్నీ చక్కగా సెట్ అయ్యాయి. అలనాటి మేటి నటి సావిత్రి బయోపిక్‌గా ఈరోజు థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా అంచనాల్ని అందుకుందా..? అందర్నీ మెప్పించిందా..? అనేది తెలియాలంటే జీ సినిమాలు ఎక్స్‌క్లూజివ్ రివ్యూలోకి వెళ్లాల్సిందే.
కథ :
ప్రజావాణి పత్రికలో జూనియర్ రిపోర్టర్‌గా పనిచేసే మధురవాణి (సమంత)కి మహానటి సావిత్రి (కీర్తి సురేష్) కోమాలో ఉందని.. ఆ వార్తను ప్రత్యేకంగా కవర్ చేయమని ఆ పత్రిక అధినేత పురమాయిస్తారు. అయితే సావిత్రి జీవితానికి సంబంధించి అప్పటికే చాలా వార్తలు రావాడంతో మధురవాణికి ఆ వార్త పెద్ద ఆసక్తిగా అనిపించదు. అలా అయిష్టంగానే ఆ వార్తను కవర్ చేసే భాద్యతను స్వీకరించిన మధురవాణి పత్రిక ఫోటో జర్నలిస్ట్ విజయ్ అంటోనీ (విజయ్ దేవరకొండ)తో కలిసి సావిత్రి జీవితాన్ని ప్రజలకు తెలిపే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో సావిత్రి నటిగా ఎలా మారింది.. అలా సినీ నటిగా మారే క్రమంలో జెమినీ గణేషన్(దుల్కర్ సల్మాన్)కి ఎలా దగ్గరైంది.. మహానటిగా ఎవరికీ సాధ్యపడని వైభవం అందుకున్నాక ఆమె జీవితంలో ఎలాంటి విషాదఛాయలు అలుముకున్నాయి. చివరికి సావిత్రి జీవితం ఎలా ముగిసింది.. అనేది మిగతా కథ.
నటీనటుల పనితీరు :
మహానటిలో భారీ స్టార్ కాస్టింగ్ ఉంది. మోహన్ బాబు, రాజేంద్ర ప్రసాద్ లాంటి మహామహుల నుంచి షాలినీపాండే, విజయ్ దేవరకొండ లాంటి యూత్ స్టార్స్ వరకు చాలామంది ఈ సినిమాలో ఉన్నారు. కానీ ఎవ్వరూ ఎక్కువ కాదు. ఎవరూ తక్కువ కాదు. అంతా మహానటి మూవీలో అలా ఒదిగిపోయారు. ముందుగా చెప్పుకోవాల్సింది టైటిల్ రోల్ పోషించిన కీర్తిసురేష్ గురించే. సావిత్రి పాత్రకు జీవంపోసింది కీర్తిసురేష్. ఇకపై ఈమెను చూస్తే సావిత్రి గుర్తుకొచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కేవలం లుక్‌లోనే కాకుండా.. సావిత్రిలా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం, ఆ కళ్లు తిప్పడం, మూతి ముడవడం, వయ్యారంగా నడవడం.. చీర చెంగు చుట్టుకోవడం.. ఇలా ఒకటేంటి.. అచ్చుగుద్దినట్టు సావిత్రిలా మారిపోయింది కీర్తిసురేష్.
జెమినీ గణేశన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ యాప్ట్ అనిపించుకున్నాడు. ఫస్టాఫ్‌లో కీర్తి-దుల్కర్ మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా పండింది. సెకెండాఫ్‌లో వీళ్లిద్దరి మధ్య ఎమోషన్స్ కూడా అదే రేంజ్లో ఉన్నాయి. ఇక మాయాబజార్ ఎపిసోడ్లో ఎస్వీఆర్ పాత్రలో మోహన్ బాబు నటవిశ్వరూపాన్ని చూడొచ్చు. కేవీ రెడ్డిలా క్రిష్, ఎల్వీప్రసాద్‌గా అవసరాల, కేవీ చౌదరిగా రాజేంద్రప్రసాద్, చక్రపాణిగా ప్రకాష్ రాజ్, సుశీలగా షాలినీ పాండే.. సింగీతం శ్రీనివాస్‌గా తరుణ్ భాస్కర్, సత్యంగా మహేష్ చేసినవి చిన్నచిన్న పాత్రలే అయినప్పటికీ.. మరపురాని పాత్రల్లో మనకు తెలిసిన స్టార్లు అలా కనిపిస్తుంటే ఆ కిక్కే వేరు.
ఈ మొత్తం ఎపిసోడ్లో సమంత, విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సావిత్రి బయోపిక్‌తో ఎలాంటి సంబంధం లేనప్పటికీ.. కథను నడిపించింది వీళ్లిద్దరే. ఇంతమంది నటీనటుల మధ్య నాగచైతన్య భలే హైలెట్ అయ్యాడు. యంగ్ ఏఎన్నార్‌లా మెస్మరైజ్ చేశాడు. 2 రోజుల కాల్షీట్లలోనే కీర్తి-చైతూ మధ్య అన్ని సీన్లు ఎలా తీశారో అనిపిస్తుంది.
టెక్నీషియన్స్ పనితీరు :
టెక్నికల్‌గా ఈ సినిమాను టాప్ క్లాస్‌గా చెప్పుకోవాలి. పద్మశ్రీ తోట తరణి పర్యవేక్షణలో అదిరిపోయే సెట్స్‌తో అవినాష్ ఇరగదీస్తే, డానీ తన సినిమాటోగ్రఫీతో 60, 70ల నాటి ఫీల్ తీసుకొచ్చాడు. ఇక గౌరంగ్, అర్చన తమ కాస్ట్యూమ్ డిజైనింగ్‌తో సినిమా మొత్తం తమ మార్క్ చూపించారు.
ఇవన్నీ ఒకెత్తయితే మిక్కీ జే మేయర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరో ఎత్తు. కొన్ని సందర్భాల్లో ఈ సంగీత దర్శకుడు సినిమాటిక్ ఫ్రీడమ్ తీసుకున్నప్పటికీ ఎక్కడా ఫీల్ చెడకుండా బ్రహ్మాండమైన ఔట్పుట్ ఇచ్చాడు. కొన్ని సందర్భాల్లో సాయి మాధవ్ బుర్రా అందించిన మాటలు సన్నివేశాలకు ప్రాణం పోశాయి. ఇలాంటి బయోపిక్‌ను వెండి తెరపై తీసుకొచ్చే ప్రయత్నమే ఎంతో గొప్పది.
కేవలం ఒక కథలా కాకుండా సావిత్రి జీవితాన్ని వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించాడు దర్శకుడు నాగ్ అశ్విన్. ఇక వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్‌గా ఉన్నాయి. సెట్స్, మేకింగ్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. ఈ సినిమాకు అవార్డులు వస్తే అందులో కచ్చితంగా ఎక్కువ అవార్డులు టెక్నికల్ టీమ్‌కే వస్తాయి.
కొన్ని సినిమా ఆలోచనలు ఎందుకు, ఎలా పుడతాయో తెలీదు. సావిత్రి జీవితాన్ని సినిమాగా తీయాలనే ఆలోచన రావడమే గొప్ప. అలాంటి ఆలోచనను నిజాయితీగా తెరపైకి తీసుకురావడం మరో పెద్ద విశేషం. అలాంటి సినిమాలో భారీ స్టార్ కాస్టింగ్‌ను పెట్టడం, ఖర్చుకు వెనకాడకుండా తీయడం మరో పెద్ద సాహసం. అందుకే మహానటి అందరికీ నచ్చింది. ఓ అద్భుత దృశ్యకావ్యంగా, మేటినటి సావిత్రికి సిసలైన ట్రిబ్యూట్ మూవీగా నిలిచింది.
ఈ బయోపిక్ ఆలోచన నాగ్ అశ్విన్‌దే అయినప్పటికీ.. కీర్తిసురేష్ ఆ ఆలోచనకు ప్రాణం పోసింది. వెండితెరపై నిండైన కీర్తిని చూస్తుంటే, సావిత్రి మళ్లీ పుట్టిందా అనే ఫీలింగ్ కలుగుతుంది. టెక్నికల్‌గా చేసిన కలర్ కరెక్షన్లు, కెమెరా యాంగిల్స్, వేసిన సెట్స్, వాడిన కాస్ట్యూమ్స్, మేకప్ ఇవన్నీ మనకు సావిత్రిని కళ్లముందు కనిపించేలా చేశాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే సినిమా సక్సెస్‌లో 50 శాతం వాటా దర్శకుడిదైతే, మిగతా క్రెడిట్ అంతా కీర్తిదే.
పేరుకు ఇది బయోపిక్ అయినప్పటికీ… సినిమా ఫస్టాఫ్ మొత్తం కమర్షియల్ ఫార్మాట్లోనే సాగుతుంది. సావిత్రి, జెమినీ గణేశన్ మధ్య లవ్ లైఫ్‌ను చక్కగా చూపించారు. ఈ విషయంలో దుల్కర్ నుంచి కీర్తికి ఫుల్ సపోర్ట్ దక్కింది. ఇక సెకెండాఫ్‌కు వచ్చేసరికి సావిత్రి జీవితంలోని విషాదకరమైన ఘటనల్ని చెప్పాల్సి రావడంతో ఫ్లో కాస్త నెమ్మదించింది. కానీ ఇది కంప్లయింట్ కాదు. ఓ మహానటి జీవితాన్ని నిజాయితీగా తెరకెక్కించే క్రమంలో ఇలాంటివి తప్పవు. ఈ విషయంలో తప్పు పట్టాల్సిన అవసరమే లేదు. ఇక క్లైమాక్స్‌లో సమంత యాక్టింగ్ ఆమె సీనియారిటీని, సినిమాలంటే ఆమె ప్యాషన్‌ను గుర్తుకుతెస్తుంది.
సినిమాలో నటీనటులంతా దాదాపు తమ సొంత గొంతునే వినిపించారు. మైనస్ అవుతుందేమో అని చాలామంది భయపడినప్పటికీ, మూవీకి అది కూడా ప్లస్ అయింది. పైగా మోహన్ బాబు, రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్ లాంటి సీనియర్ల స్టార్డమ్ ఈ సినిమాలో కనిపించకుండా కేవలం క్యారెక్టర్స్ మాత్రమే కనిపించాయంటే.. మహానటిలో పాత్రలు ఎంత పవర్‌ఫుల్‌గా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇక యంగ్ ఏఎన్నార్‌లా నాగచైతన్య, డిజిటల్ రూపంలో వచ్చిన ఎన్టీఆర్ మహానటికి స్పెషల్ ఎట్రాక్షన్స్‌గా నిలిచారు. ఏఎన్నార్‌లా చైతూ తెరపైకి రాగానే థియేటర్ ఈలలు, చప్పట్లతో మారుమోగిపోయింది.
ఈ సినిమా చూశాకా దర్శకుడిగా నాగ్ అశ్విన్‌కి ఇది రెండో సినిమానేనా అనే సందేహం కలగకమానదు. అంతలా అనుభవం ఉన్న దర్శకుడిగా ఈ సినిమాలో సీన్స్‌ను డీల్ చేసాడు నాగ్ అశ్విన్. ఇక ముఖ్యంగా క్యారెక్టర్స్ పర్ఫెక్ట్ అనిపించే నటీ నటులను అలాగే సినిమాను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళే సాంకేతిక నిపుణులను ఎంచుకొని అక్కడే విజయం సాదించాడు దర్శకుడు. సినిమా ప్రారంభం నుండి ఎక్కడా తగ్గకుండా చూసుకున్నాడు. ముఖ్యంగా నాగ్ అశ్విన్ క్లైమాక్స్ ఎలా డీల్ చేస్తాడా.. అన్న ప్రశ్నకి పర్ఫెక్ట్ క్లైమాక్స్‌తో సమాధానం చెప్పాడు.
ఓవరాల్‌గా ‘మహానటి’ సినిమా ఓ సరికొత్త అనుభూతిని ప్రేక్షకులకు అందిస్తుంది. ఈ తరం ఓ మహానటి జీవితాన్ని తెలుసుకోవడంతో పాటు.. 60ల నాటి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేస్తుంది.
బాటమ్ లైన్ – సావిత్రి మళ్లీ పుట్టింది
రేటింగ్ – 3.5 /5
జీ సినిమాలు సౌజన్యంతో...