వంశీ పైడిపల్లి సినిమాకు పారితోషికం తగ్గించిన మహేష్ బాబు !
పారితోషికం తగ్గించిన మహేష్ బాబు !
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన తర్వాతి సినిమాకు పారితోషికం తగ్గించినట్టు తెలుస్తోంది. అదేంటి, మొన్నే భరత్ అనే నేను సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు కదా మరి అతడికి పారితోషికం తగ్గించాల్సిన అవసరం ఏమొచ్చిందనే సందేహం రావొచ్చేమో!! అయితే, హిట్స్, ఫట్స్‌తో సంబంధం లేకుండా మహేష్ బాబు పారితోషికం తగ్గించడానికి దారితీసిన పరిస్థితులు వేరే ఉన్నట్టు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అవును, ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా ఓ సినిమా సెట్స్‌పై ఉంది. ఇది మహేష్ బాబు కెరీర్‌లో 25వ సినిమా.
మొదట్లో ఈ సినిమా నిర్మాణం విషయంలో ప్రముఖ నిర్మాత పీవీపీకి పలు అభ్యంతరాలు ఉండటంతో అతడు సినిమాకు అడ్డంపడుతూ ఓ కేసు పెట్టాడని వార్తలొచ్చాయి. అయితే, ఆ తర్వాత చిత్ర నిర్మాతలైన దిల్ రాజు, అశ్వినీదత్‌లతో విభేదాలు లేకుండా చేసుకున్న పీవీపీ... ఆ సినిమా నిర్మాణంలో మూడో నిర్మాతగా భాగస్వామ్యాన్ని చేజిక్కించుకున్నాడు. అంటే ఇప్పుడు ఆ సినిమాను ముగ్గురు నిర్మాతలు నిర్మిస్తున్నారన్న మాట. సరిగ్గా ఇక్కడే సినిమా బడ్జెట్ లెక్కలు కూడా మారిపోయాయి.
ముగ్గురు నిర్మాతలు లాభాలు పంచుకోవాలంటే ముందుగా ఖర్చు తగ్గించుకుని ఆ తర్వాత లాభాలు పెంచుకోవాలని అనుకున్నారట. అందులో భాగంగానే బడ్జెట్‌ని తగ్గించుకోవడంతో, ఆ బడ్జెట్‌కి అనుగుణంగా మహేష్ బాబు కూడా కొంత పారితోషికాన్ని తగ్గించుకున్నట్టు టాక్ వినబడుతోంది. అయితే, మహేష్ బాబు తీసుకుంటున్న పారితోషికం ఎంత, తగ్గించిన పారితోషికం ఎంత అనే వివరాల్లో ప్రస్తుతానికి స్పష్టత లేదు.
ఇదిలాఉంటే, అసలు ముగ్గురు నిర్మాతలు ఒక్క చోట చేరినంత మాత్రాన్నే ముందు అనుకున్న బడ్జెట్‌ని తగ్గించుకోవాల్సిన అవసరం ఏముంది ? ఒకవేళ అలా తగ్గించుకోవాల్సి వస్తే, వారి పెట్టుబడితో ఏ సంబంధం లేని మహేష్ బాబు ఎందుకు స్వచ్ఛందంగా పారితోషికం తగ్గించుకుంటాడు అనే సందేహాలు వ్యక్తం చేస్తోన్న వాళ్లూ లేకపోలేదు.