COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Megastar Chiranjeevi Birthday Special Story: కొణిదెల శివశంకర వరప్రసాద్ అంటే అంత త్వరగా గుర్తుపట్టాలేము కానీ మెగాస్టార్ చిరంజీవి అంటే తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. ఎక్కడో పశ్చిమగోదావరి జిల్లాలోని ఒక మారుమూల మొగల్తూరు అనే గ్రామానికి చెందిన కొణిదెల వెంకట్రావు - అంజనాదేవి దంపతులకు మొదటి సంతానంగా జన్మించిన శివశంకర వరప్రసాద్ యుక్త వయసు నుంచి సినిమాల మీద విపరీతమైన ఆసక్తి పెంచుకుని ఆ ఆసక్తితో మద్రాసు రైలు ఎక్కి ఫిలిం ఇన్స్టిట్యూట్లో చేరారు. అయితే ఆయన జీవితం ఏమీ పూల పాన్పు కాదు, స్వయంకృషితో ఒక్కో మెట్టు ఎక్కుతూ అనేక కష్టాలు పడి సినిమా అవకాశాలు దక్కించుకున్నారు. నరసాపురంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి మద్రాస్ ఫిలిం ఇన్స్టిట్యూట్లో నటన నేర్చుకునేందుకు చేరారు.


పునాదిరాళ్లు :


చిరంజీవి కెరీర్లో దక్కించుకున్న మొట్టమొదటి సినీ అవకాశం పునాదిరాళ్లు అయితే ఆ సినిమా ఆలస్యంగా విడుదలవడంతో అంతకంటే ముందే మరిన్ని సినిమాలు విడుదలయ్యాయి. అలా ప్రాణం ఖరీదు అనే సినిమాతో మొట్టమొదటిసారిగా చిరంజీవి తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆ తర్వాత మన ఊరి పాండవులు, తాయారమ్మ బంగారయ్య, కుక్క కాటుకు చెప్పు దెబ్బ, కొత్త అల్లుడు, ఐ లవ్ యు వంటి సినిమాలు చేశారు. అయితే ఇలా వరుస సినిమాలు చేస్తూ వెళ్లినా సరే ఆయనకు బ్రేక్ దక్కింది మాత్రం ఖైదీ అనే సినిమాతోనే. అయితే ఆయన కెరీర్ ఇంకా ఊపందుకోని రోజుల్లోనే ఆయన సురేఖ అంటే అల్లు రామలింగయ్య కుమార్తెను వివాహం చేసుకున్నారు. ఇద్దరూ ఒకే కులం వారు కావడం, మెగాస్టార్ చిరంజీవి నడవడిక నచ్చడంతో అల్లు రామలింగయ్య తన కుమార్తెను ఆయనకు ఇచ్చి వివాహం జరిపించారు. ఇక వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వారిలో సుస్మిత, శ్రీజ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. రామ్ చరణ్ గురించి ఇంకోసారి చెప్పాల్సిన అవసరం లేదు.


ఖైదీ సినిమాతో:


ఇక చిరంజీవి కెరీర్ కాస్త కుదుట పడింది అనుకున్న తర్వాత ఆయన రెండో సోదరుడు నాగబాబుతో కూడా సినీరంగ ప్రవేశం చేయించారు. అయితే నాగబాబుకి సినీ రంగ ప్రవేశం అంత బాగా కలిసి రాలేదు. ఆయన నిర్మాతగానే ఎక్కువగా రాణించారు అని చెప్పవచ్చు. మెగాస్టార్ చిరంజీవి తర్వాత ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా చిరంజీవి కంటే ఎక్కువ ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. ఖైదీ సినిమాతో ఒక్కసారిగా మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ పెరిగిపోయింది. ఖైదీ సినిమా కంటే ముందే ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య అనే సినిమాలో ఆయన హీరోగా నటించారు, ఆ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది కానీ ఖైదీ సినిమా మాత్రం ప్రేక్షకులకు ఒక రకమైన పూనకాలు తెప్పించింది. ఇక ఆ తర్వాత మంత్రిగారి వియ్యంకుడు, సంఘర్షణ, గూండా, చాలెంజ్, హీరో, దొంగ, జ్వాలా, అడవి దొంగ, కొండవీటి రాజా, రాక్షసుడు వంటి సినిమాలు చేసి మరింత పేరు తెచ్చుకున్నారు.


అవార్డులు:


ఇక స్వయంకృషి అనే సినిమాకు గాను మెగాస్టార్ చిరంజీవి మొట్టమొదటిసారి నంది అవార్డు సాధించారు. ఇక ఆయన నటించిన పసివాడి ప్రాణం, యముడికి మొగుడు, మంచి దొంగ కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్స్ గా నిలిచాయి. మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో అనేక ప్రయోగాత్మక చిత్రాల్లో కూడా నటించారు. ఆ సినిమాల్లో జగదేకవీరుడు అతిలోకసుందరి, కొండవీటి దొంగ వంటి సినిమాలు ఉన్నాయి. అలాగే కొదమ సింహం, గ్యాంగ్ లీడర్ వంటి సినిమాలతో కూడా ఆమె మంచి పేరు తెచ్చుకున్నారు. తెలుగులో మంచి క్రేజ్ వచ్చిందనుకున్న తర్వాత తన బావమరిది అల్లు అరవింద్ నిర్మించగా ఆయన హిందీలో ప్రతి బంద్, ఆజ్ కా గూండారాజ్ వంటి సినిమాలు చేశారు. ఆ సినిమాలు అక్కడ హిట్ అయ్యాయి కానీ ఎందుకో అక్కడ నిలబడలేకపోయారని చెప్పొచ్చు. తర్వాత ఆయన చేసిన మెకానిక్ అల్లుడు, ఎస్పీ పరశురామ్, బిగ్ బాస్, రిక్షావోడు, ముఠామేస్త్రి, ముగ్గురు మొనగాళ్లు, అల్లుడా మజాకా, కన్నడలో సిపాయి వంటి సినిమాలు ఆయనకు మరింత పేరు తీసుకొచ్చాయి. హిట్లర్, మాస్టర్, బావగారు బాగున్నారా, చూడాలని ఉంది, స్నేహం కోసం వంటి సినిమాలతో ఆయన క్రేజ్ ఇంకెక్కడికో వెళ్ళిపోయింది. ఆ తర్వాత అప్పుడే వస్తున్న అప్ కమింగ్ హీరోలతో కలిసి ఆయన చేసిన అన్నయ్య సినిమా కూడా సూపర్ హిట్ అయింది. తరువాత ఇంద్ర సినిమా విడుదలవడం అప్పటి వరకు టాలీవుడ్ లో ఉన్న అనేక రికార్డులను బద్దలు కొట్టడం ఇప్పటికీ ఒక పెను సంచలనం.


పొలిటికల్ ఎంట్రీ:


ఆ తర్వాత ఆయన ఠాగూర్, శంకర్ దాదా ఎంబిబిఎస్ లాంటి సినిమాల్లో కూడా నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. ఇక శంకర్ దాదా జిందాబాద్ సినిమా తర్వాత దాదాపు 10 ఏళ్లపాటు సినిమాలకు దూరమైన మెగాస్టార్ చిరంజీవి రాజకీయ ఎంట్రీ ఇచ్చారు. ప్రజారాజ్యం పార్టీ పేరుతో ప్రజలకు ఏదైనా సేవ చేయాలనుకున్నారు కానీ తనకు రాజకీయాలు అచ్చిరావు అనే విషయం తెలుసుకుని మళ్లీ సినీరంగ ప్రవేశం చేసి ఖైదీ నెంబర్ 150, సైరా వంటి సినిమాలు చేశారు. ఇక చివరిగా ఆయన ఆచార్య అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇప్పుడు ఆయన చేస్తున్న నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాయి. వాటిలో మూడు సెట్స్ మీదకు వెళ్ళగా మరో సినిమా సెట్స్ మీదకు వెళ్లాల్సి ఉంది.


సేవలోనూ స్టారే!


మెగాస్టార్ చిరంజీవి కేవలం సినీ నటుడిగానే కాక సామాజిక సేవ చేసే మంచి మనసున్న వ్యక్తిగా కూడా చాలా ఫేమస్. తన బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్  తో అనేక మంది ప్రాణాలను కాపాడిన మెగాస్టార్ చిరంజీవి కరోనా సమయంలో సినీ పరిశ్రమకు చెందిన అనేకమందిని కరోనా క్రైసిస్ చారిటీ పేరుతో ఆదుకున్నారు. అలాగే ఆక్సిజన్ బ్యాంకులు కూడా ఏర్పాటు చేసి కరోనాలో తన వంతు సాయం తాను చేశారు. తన అభిమానులతో మెగాస్టార్ అనిపించుకునే మెగాస్టార్ చిరంజీవి భారతదేశ అత్యుత్తమ పద్మభూషణ్ అవార్డు కూడా సంపాదించారు. అలాగే ఆంధ్ర యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ కూడా పొందారు. ఆయన పది సార్లు సౌత్ ఫిలింఫేర్ అవార్డ్స్, నాలుగుసార్లు నంది అవార్డ్స్ దక్కించుకున్నారు. అంతే కాదండోయ్ ఆస్కార్ అవార్డ్స్ సెర్మనీకి ఆహ్వానం అందుకున్న మొట్టమొదటి దక్షిణాది వ్యక్తిగా కూడా ఆయన నిలిచారు. ఇవండీ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు విశేషాలు.


Also Read: Chiranjeevi: సొంతూరి అభిమానికి మెగా సాయం.. దటీజ్ మెగాస్టార్ అంటూ ప్రసంశలు!


Also Read: Top Pan India Heros List: టాప్ పాన్ ఇండియా హీరోల లిస్టులో ఐదుగురు తెలుగు హీరోలు!