పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన కొమరం పులి సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సోగకళ్ల సొగసరి నికిషా పటేల్ గుర్తుంది కదా! ఆ బ్యూటీ కళ్లు ఇప్పుడు ప్రముఖ కొరియోగ్రాఫర్, మల్టీటాలెంటెడ్ ఆర్టిస్ట్ ప్రభుదేవాపై పడ్డాయండోయ్. అవును, ప్రభుదేవాను పెళ్లి చేసుకోవడానికి తాను రెడీ అంటూ ప్రకటించేసిందీ గుజరాతీ భామ. కొమరం పులి తర్వాత అడపాదడపా పలు సినిమాలు చేసినప్పటికీ.. తెలుగు పరిశ్రమలో హీరోయిన్‌గా మాత్రం నిలదొక్కుకోలేకపోయింది. దీంతో ఆ తర్వాత తమిళం, కన్నడ భాషా చిత్రాల్లో అప్పుడొక సినిమా అప్పుడొక సినిమా చేస్తోన్న ఈ బ్యూటీ తాజాగా చెన్నైలో ఓ తమిళ సినిమా ప్రెస్‌మీట్‌లో పాల్గొంది. తమిళంలో పాండిముని అనే సినిమాకు సైన్ చేసిన నికిషా పటేల్.. ఆ సినిమా ప్రెస్‌మీట్‌లో అనేక సంగతులు చెప్పుకొచ్చింది. మొదటగా పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ వుందన్న వివాదంపై స్పందించిన నికిషా.. ఆ విషయాన్ని తాను ఎప్పుడో చెప్పానని స్పష్టంచేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"హీరోయిన్స్‌కి అవకాశం ఇవ్వాలంటే, వారిని తమ పడక గదికి రమ్మనే వాళ్లు సినీ పరిశ్రమలో వున్నారు. అయితే, క్యాస్టింగ్ కౌచ్ అనేది కేవలం సినీ పరిశ్రమలోనే కాకుండా అన్ని రంగాల్లోనూ వుంది. కాకపోతే సినీ పరిశ్రమ కనుక ఇక్కడే ఎక్కువ హైలైట్ అవుతోంది" అని చెప్పుకొచ్చింది నికిషా. అనంతరం తనకు ఇష్టమైన నటుడు గురించి మాట్లాడుతూ.. ప్రభుదేవా అంటే తనకు ఇష్టమని, అతడితో తమ కుటుంబానికి సైతం సన్నిహిత సంబంధాలు వున్నాయని వ్యాఖ్యానించింది. ప్రభుదేవాతో కలిసి నటిస్తారా అనే ప్రశ్నకు స్పందిస్తూ.. ఆయనతో కలిసి నటించడమే కాదు... ఆయన్ని పెళ్లి చేసుకోవడానికైనా తాను సిద్ధమేనని కుండబద్ధలు కొట్టింది నికిషా పటేల్.


ఇప్పటికే పెళ్లయి ఇద్దరు పిల్లలు వున్న ప్రభుదేవా ఆ తర్వాత నయనతారతో ప్రేమలో పడటం, ఆ ప్రేమ పెళ్లి వరకు వచ్చి ఆగిపోవడం సంగతి తెలిసిందే. ఇదిలావుండగా ఇప్పుడు నికిషా పటేల్ కంట్లో పడ్డాడు ప్రభుదేవా. అమ్మడు పబ్లిగ్గానే చేసిన ప్రపోజల్‌కి ప్రభుదేవా ఏమని సమాధానం ఇస్తాడో వేచిచూడాల్సిందే మరి!!