Organic Mama Hybrid Alludu Review: ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు రివ్యూ.. మామా అల్లుళ్లు హిట్ కొట్టారా?
Organic Mama Hybrid Alludu Movie Review: సీనియర్ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి సోహైల్ హీరోగా రాజేంద్రప్రసాద్, మీనా ప్రధాన పాత్రల్లో ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు సినిమా ఎట్టకేలకు విడుదలైంది. ఆ వివరాలు
Organic Mama Hybrid Alludu Movie Review: సీనియర్ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి చాలా కాలం నుంచి ఎలాంటి సినిమాలు చేయడం లేదు. ఆయన సోహైల్ హీరోగా రాజేంద్రప్రసాద్, మీనా ప్రధాన పాత్రల్లో ఒక సినిమా అనౌన్స్ చేయగా ఆ సినిమా మీద ఆసక్తి ఏర్పడింది. దానికి తోడు సీనియర్ నిర్మాత శ్రీ కళ్యాణ్ భార్య కల్పన ఈ సినిమాతో నిర్మాతగా లాంచ్ అవడం మరో ఆసక్తికర అంశం. చాలాకాలం క్రితమే ప్రకటించిన ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు సినిమా ఎట్టకేలకు మార్చి మూడో తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి ఈ సినిమా ఎలా ఉంది అనేది సమీక్షలో తెలుసుకుందాం.
కథ:
విజయ్(సోహైల్)కి పెద్ద డైరెక్టర్ అవ్వాలని కల ఉంటుంది. అయితే రెండు సినిమాలు తీసినా, అవి రెండూ డిజాస్టర్లు కావడంతో ఆయనకు మరో సినిమా అవకాశం దొరకడం గగనంగా మారింది. ఇంతలో ఇంట్లో తండ్రి పోరు భరించలేక ఆయన చేసే కొండపల్లి బొమ్మలను అమ్మడం కోసం ఒక స్కెచ్ వేస్తాడు. ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో స్టాల్ పెట్టిన సమయంలో అతని మొదటి చూపులోనే చూసి ప్రేమిస్తుంది. హాసిని(మృణాళిని రవి) ఆమె పై చదువులు చదవడం కోసం తన తండ్రి ఆర్గానిక్ వెంకటరమణ(రాజేంద్ర ప్రసాద్), తల్లి శకుంతల(మీనా)తో పట్టుబట్టి పీజీ జాయిన్ అవుతుంది. ఇక విజయ్, హాసిని ప్రేమలో ఉన్నారనే విషయం తెలుసుకున్న ఆర్గానిక్ వెంకటరమణ ముందు వారి పెళ్లికి ససేమిరా ఒప్పుకోడు. విజయ్ తల్లిదండ్రులను ఇంటికి పిలిచి తన కుమార్తె మీద ఉన్నప్రేమ బయట పెట్టగా వారు ఆమె మనకు కరెక్ట్ కాదని వెళ్ళిపోతారు. అయితే ప్రాణానికి ప్రేమగా ప్రేమించుకున్న హాసిని, విజయ్ చివరికి కలుస్తారా? ఆర్గానిక్ మామ తన హైబ్రిడ్ అల్లుడిని తన కూతురిని ఇచ్చి వివాహం చేస్తాడా అనేదే ఈ సినిమా కథ.
విశ్లేషణ:
సినిమా ప్రారంభమే విజయ పాత్ర పరిచయంతో మొదలవుతుంది. తర్వాత హాసిని పాత్ర పరిచయం చేసిన దర్శకుడు ఆర్గానిక్ వెంకటరమణ నేపథ్యం ఏమిటి? ఆయన ఎలాంటి వారు అనే విషయాలు చూపించేందుకు ఆసక్తి చూపించారు. తర్వాత విజయ్, హాసిని ప్రేమలో పడటం, తమ ప్రేమను పెద్దలను ఒప్పించేందుకు వారు ప్రయత్నించడం చూపించారు. ఫస్ట్ అఫ్ మొత్తం విజయ్, హాసిని ప్రేమ కథతో సాగిపోగా సెకండ్ హాఫ్ మాత్రం అల్లరి చిల్లరగా తిరుగుతూ సినిమాల డైరెక్షన్ పేరుతో రెండు అవకాశాలను వృధా చేసుకున్న వ్యక్తి తన కూతుర్ని ఎలా చూసుకోగలడు అంటూ రాజేంద్రప్రసాద్ చెప్పిన డైలాగులతో కొత్త కోణంలోకి ఎంట్రీ ఇస్తుంది. ఇంతలో తన స్నేహితుడు తండ్రిని మోసం చేసిన గాజుల గంగారత్నం(అజయ్ ఘోష్)తో సోహైల్ ఎలాంటి గేమ్ ఆడాడు. చివరికి సోహైల్ దర్శకుడిగా మారాడా? సోహైల్ కి మూడో సినిమా అవకాశానికి వచ్చిన మునికొండ(సునీల్) ఏమయ్యాడు? ఇలా సినిమా మొత్తాన్ని ఆసక్తికరంగా మలిచేందుకు దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి కష్టపడ్డాడు. కానీ సినిమాల్లో కొన్ని లాజిక్స్ మిస్ అయ్యాయి. మొదటి చూపులోనే ప్రేమలో పడటం అనేది ఎందుకో కాస్త నమ్మశక్యంగా అనిపించదు అదే విధంగా విజయ్ చేసే పనులన్నీ మాయాజాలంలా అనిపిస్తాయి తప్ప రియాలిటీకి దగ్గరగా ఏమాత్రం ఉండవు. అయితే లాజిక్స్ పక్కన పెట్టి చూస్తే కుటుంబ కథా చిత్రాలు దర్శకుడిగా ఎస్వీ కృష్ణారెడ్డి పేరుకు ఈ సినిమా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గా నిలుస్తుంది. అసభ్యతకు తావు లేకుండా పూర్తిస్థాయి కుటుంబ కథా చిత్రంగా ఈ సినిమా ఉంటుంది.
నటీనటులు
నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమాలో హీరోగా నటించిన సోహైల్ తన గత చిత్రాల కంటే నటుడిగా ఇంప్రూవ్ అయ్యాడు. నటనలో చాలా ఈజ్ కనిపించింది. మృణాళిని రవి కూడా తనదైన పాత్రలో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది, రాజేంద్రప్రసాద్, మీనా వంటి వారి అనుభవం వారి నటనలో కనిపించింది. సూర్య, హేమ, హర్ష జెముడు, ప్రవీణ్, అజయ్ ఘోష్, సునీల్, కృష్ణ భగవాన్, సప్తగిరి వంటి వారు చేసింది చిన్న చిన్న పాత్రలు అయినా తమదైన శైలిలో కామెడీ పండించే ప్రయత్నం చేశారు. ఇక మిగతా నటీనటులు తమ పరిధి మీద నటించి ఆకట్టుకున్నారు.
టెక్నికల్ టీమ్ విషయానికి
టెక్నికల్ విషయానికొస్తే ఈ సినిమాకి దర్శకుడిగా కాదు డైలాగ్ రైటర్ గా కూడా తన 100% ఎఫర్ట్స్ పెట్టారు ఎస్వీ కృష్ణారెడ్డి. అయితే కథ కొంత రోటీన్ అనిపించినా తనదైన మార్క్ చూపించే ప్రయత్నం చేశారాయన. డైలాగ్స్ లో డెప్త్ మాత్రం అందరినీ ఆలోచింపజేసే విధంగా ఉంటాయి. ఇక ఈ సినిమాకు సంగీతం బాగా ప్లస్ అయింది, పాటలన్నీ అంత క్యాచీగా లేకపోయినా విజువల్ గా చూస్తున్నప్పుడు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఇక చిత్ర నిర్మాత కోనేరు కల్పన నిర్మాణ విలువలు బాగా ప్లస్ అయ్యాయి. సినిమాటోగ్రఫీ కొన్నిచోట్ల అబ్బురపరుస్తుంది.
ఫైనల్ గా ఒక్కమాటలో చెప్పాలంటే
కుటుంబ కథా చిత్రాలు నచ్చేవారికి ఈ ‘’ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు’’ సినిమా నచ్చుతుంది. లాజిక్స్ పక్కన పెట్టి చూస్తే సినిమా మొదలు నుంచి చివరి వరకు కామెడీతో ఎంజాయ్ చేయిస్తూనే ఆలోచింప చేస్తుంది.
Also Read: Shruti Haasan Photos: వర్కౌట్లలో చిలిపి పనులు చేస్తున్న శృతి హాసన్.. సెగలు రేపుతున్న హాట్ మూమెంట్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి