ఇవాంకా పాల్గొనే సదస్సులో `రామ్ చరణ్` స్పీచ్
ప్రపంచ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సులో రామ్ చరణ్ తేజ బ్రేక్ అవుట్ సెషన్‌లో ప్రత్యేక ప్రసంగం చేయనున్నారు.
టాలీవుడ్ నటుడు రామ్ చరణ్ తేజకు ఓ అరుదైన అవకాశం దక్కింది. ఈ నెల 28 నుండి 30వ తేదీ వరకు హైదరాబాద్ నగరంలో జరిగే ప్రపంచ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సులో ఆయన బ్రేక్‌అవుట్ సెషన్‌లో ప్రత్యేక ప్రసంగం చేయనున్నారు. ‘సినిమా భవిష్యత్’ అనే అంశంపై మాట్లాడనున్నారు. ఇదే సదస్సుకి డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంక ట్రంప్ ముఖ్య అతిథిగా విచ్చేయడం విశేషం. ఇదే సెషన్‌లో ఎస్సెల్ గ్రూప్ ఛైర్మన్ సుభాష్ చంద్ర, నైజీరియన్ నటి ఓనీకేచి స్టెఫానీ లినస్ కూడా పాల్గొని మాట్లాడనున్నారు.
అదే రోజు జరగనున్న ద బిజినెస్ ఆఫ్ విన్నింగ్ స్పోర్ట్స్ ఎంటర్‌ప్రెన్యూర్ షిప్ మాస్టర్ క్లాస్ సెషన్‌లో టెన్నిస్ క్రీడాకారిణి సానియామీర్జా, మహిళా క్రికెటర్ మిథాలీరాజ్ పాల్గొని ప్రసంగించనున్నారు. అదే విధంగా 30వ తేదీన మీడియా రంగంలో "మహిళలకు అవకాశాల పెరుగుదల" అనే అంశంపై జరగనున్న మాస్టర్ క్లాస్ సెషన్‌లో ప్రపంచసుందరి మానుషి చిల్లార్ ప్రసంగించనున్నారు.