కృష్ణజింకలను వేటాడిన కేసులో రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ కోర్టు సల్మాన్ ఖాన్‌కి ఐదేళ్ల జైలు శిక్ష విధించడంపై బాలీవుడ్ ప్రముఖులు కొంతమంది సల్మాన్ పట్ల సానుభూతి వ్యక్తంచేశారు. సల్మాన్ ఖాన్‌కి జైలు శిక్ష పడటంపై సన్నిహితమిత్రులు అతడికి మానసిక స్థైర్యం అందించే ప్రయత్నం చేశారు. అందులో బిగ్ బాస్ షో కంటెస్టెంట్స్ కూడా వున్నారు. అయితే, అదే బిగ్ బాస్ కంటెస్టెంట్ కూడా అయిన బాలీవుడ్ నటి సోఫియా హయత్ మాత్రం జోధ్‌పూర్ కోర్టు తీర్పుపై హర్షం వ్యక్తంచేయడమేకాకుండా సల్మాన్ ఖాన్‌కి వ్యతిరేకంగా పలు సంచలన వ్యాఖ్యలు చేసింది. సల్మాన్ ఖాన్ జైలుకి వెళ్లడం తనకు ఎంతో ఆనందం కలిగించింది అని సోఫియా పేర్కొంది. అంతేకాకుండా సల్మాన్ ఖాన్‌కి వ్యతిరేకంగా మాట్లాడాలంటే ధైర్యం చేయలేకే చాలామంది కోర్టు తీర్పుపై హర్షం వ్యక్తంచేయలేకపోతున్నారని సోఫియా సంచలన వ్యాఖ్యలు చేసింది. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 

సల్మాన్ ఖాన్, జోధ్‌పూర్ కోర్టు తీర్పు, చట్టం గురించి సోఫియా హయత్ తన ఇన్‌స్టాగ్రామ్ ఎకౌంట్ ద్వారా అనేక అంశాలను అభిమానులతో పంచుకుంది. అంతిమంగా కర్మ ముందు ఎవరైనా తల వంచాల్సిందే. సల్మాన్ ఖాన్ బాలీవుడ్‌ని శాసిస్తున్నాడని చాలామంది భయపడుతున్నారు. అందుకే కోర్టు తీర్పుకి అనుకూలంగా మాట్లాడలేకపోతున్నారు. కానీ తనకు ఆ భయం ఏం లేదు. చట్టాన్ని అతిక్రమిస్తే, ఎవ్వరైనా శిక్ష అనుభవించి తీరాల్సిందే. చట్టం ముందు ఎవరైనా ఒక్కటేనని తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో పేర్కొంది. దేశంలో చాలామంది యువత పోలీసులని ఆశ్రయించాలంటే జంకుతున్నారని.. అందుకు కారణం అడుగడుగునా లంచాలు పెట్టి న్యాయాన్ని కొనుక్కుంటుండమేనన్న సోఫియా.. అర్మాన్ కోహ్లీతో వివాదం విషయంలో తాను వ్యక్తిగతంగా ఆ బాధను ఎదుర్కున్నానని ఆ పోస్టులో స్పష్టంచేసింది.