150 కోట్ల మార్క్ క్రాస్ చేసిన `స్పైడర్`
ప్రిన్స్ మహేశ్‌బాబు హీరోగా నటించిన ‘స్పైడర్’ చిత్రం మిశ్రమ స్పందనల మధ్య ఎట్టకేలకు బాక్సాఫీసు వద్ద తడబడుతూ, ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల మైలురాయిని దాటింది. సెప్టెంబరు 27న రిలీజైన ఈ చిత్రంపై ఇప్పటికే భిన్నాభిప్రాయాలు వచ్చిన సందర్భంలో కలెక్షన్ల గురించి మొన్నటి వరకూ అనేక పాజిటివ్, నెగటివ్ వార్తలు వచ్చాయి. ‘స్పైడర్’ విడుదలైన తొలి రోజునే రూ.51 కోట్లు వసూలు చేసింది. అదేవిధంగా అమెరికాలో ప్రీమియర్ షో ద్వారా మిలియన్ డాలర్లు వసూలు చేసి మరో రికార్డు సాధించింది. అక్కడ ప్రీమియర్ షో ద్వారా అత్యధిక కలెక్షన్లు రాబట్టిన తొలి ఐదు చిత్రాలు ‘బాహుబలి 2’, ‘కబాలి’, ‘బాహుబలి’, ‘ఖైదీ నెం.150’లు కాగా.. ఆ తర్వాతి స్థానంలో ప్రిన్స్ చిత్రం ఉండడం గమనార్హం. ఈ క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా మొత్తం రూ.150 కోట్లు రాబట్టినట్లు నిర్మాతలు ప్రకటించారు. చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు కూడా తెలిపారు.