తమ అభిమాన తార శ్రీదేవి ఇక లేదనే విషయం జీర్ణించుకోలేని అభిమానులు కనీసం ఆమెను కడచూపు అయినా చూసుకుందాం అని వేయికళ్లతో వేచిచూస్తున్నారు. శ్రీదేవి భౌతికకాయానికి నివాళి అర్పించి కడసారి వీడ్కోలు పలికేందుకు కేవలం బాలీవుడ్ నుంచే కాకుండా యావత్ దేశవ్యాప్తంగా ఎంతోమంది సినీ, వ్యాపార, రాజకీయ ప్రముఖులు ముంబైకి తరలివచ్చారు. సోమవారం ఉదయానికే శ్రీదేవి భౌతికకాయం ముంబైకి చేరుకుంటుందనే వార్తల నేపథ్యంలో ఎంతోమంది ప్రముఖులు సోమవారమే ముంబైలో వున్న అనిల్ కపూర్ నివాసానికి చేరుకున్నారు. అయితే, అందరి ఆశించినట్టుగా శ్రీదేవి భౌతికకాయం సోమవారంనాడు అర్ధరాత్రికి కూడా ముంబైకి రాలేదు సరికదా కనీసం దుబాయ్ లోనూ శ్రీదేవి శవాన్ని ఇంకా ఆమె కుటుంబసభ్యులకు అప్పగించలేదు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శ్రీదేవి భౌతికకాయాన్ని భోనీకపూర్ కి అప్పగించడంలో చట్టరీత్యా జరుగుతున్న ప్రాథమిక దర్యాప్తు కారణంగానే సోమవారం ఆలస్యమైందని తెలిసింది. అయితే, చివరకు చేయాల్సిన ప్రక్రియ అంతా పూర్తయినప్పటికీ చివరిగా చేయాల్సి వున్న ఎంబాల్మింగ్ ప్రక్రియ ఒక్కటి మిగిలిపోయిన కారణంగానే ఆమె భౌతికకాయం అప్పగింతలో ఇంకొంత జాప్యం జరుగుతోందని దుబాయ్ మీడియా వర్గాల ద్వారా తెలుస్తోంది. 


ఎంబాల్మింగ్ అంటే ఏంటి ?
మనిషి చనిపోయిన తర్వాత కొన్ని గంటలు గడిచినా ఆ శవానికి అంత్యక్రియలు నిర్వహించనట్టయితే, శవం నుంచి కుళ్లిపోయిన వాసన రావడం అనేది అత్యంత సహజం. అయితే, అలా దుర్వాసన రాకుండా వుండేందుకు నిపుణుల సమక్షంలో మృతదేహంలోకి రసాయనాలు ఎక్కించే ప్రక్రియనే ఎంబాల్మింగ్ అంటారు. 


ఇదిలావుంటే, ఇప్పటికే శ్రీదేవి శనివారం అర్థరాత్రి చనిపోగా, దర్యాప్తు నిమిత్తం ఆదివారం, సోమవారం ఆమె శవాన్ని దుబాయ్ లోని పోలీసు ప్రధాన కార్యాలయంలోనే వుంచారు. మంగళవారం తెల్లవారేటప్పటికి కూడా పరిస్థితిలో మార్పు వుండే అవకాశాలు కనిపించడం లేదు. ఒకవేళ మంగళవారం ఉదయం శ్రీదేవి భౌతిక కాయం ముంబైకి చేరుకున్నా... ఆ తర్వాత కొన్ని గంటలపాటైనా అభిమానులు, ప్రముఖుల సందర్శనార్ధం వేచిచూడాల్సి వుంటుంది. ఈ నేపథ్యంలోనే శ్రీదేవి భౌతికకాయానికి కుళ్లిన వాసన రాకుండా అక్కడే రసాయనాలను మృతదేహంలోకి ఎక్కించే ప్రయత్నం జరుగుతోందని దుబాయ్ మీడియా వర్గాలు స్పష్టంచేశాయి.