Writer Padmabhushan Review : గుండెను మెలిపెట్టే మదర్ సెంటిమెంట్ తో సుహాస్ హిట్ కొట్టాడా?
Writer Padmabhushan Review: కలర్ ఫోటో సినిమాతో హీరోగా మారి మొదటి సినిమాతోనే హిట్ అందుకున్న సుహాస్ హీరోగా రైటర్ పద్మభూషణ్ అనే సినిమా తెరకెక్కింది. ఆ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం
Writer Padmabhushan Review: కలర్ ఫోటో సినిమాతో హీరోగా మారి మొదటి సినిమాతోనే హిట్ అందుకున్నాడు సుహాస్. అలాంటి సుహాస్ హీరోగా రైటర్ పద్మభూషణ్ అనే సినిమా తెరకెక్కింది. సుహాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా మీద పెద్ద పెద్ద స్టార్లు ఆసక్తి చూపించడంతో సినిమా మీద ఒక్కసారిగా అందరిలోనూ అంచనాలు పెరిగాయి. పైగా గతంలో చాయ్ బిస్కెట్ సంస్థ చేసిన సినిమాలు హిట్ అవ్వడంతో ఈ సినిమా మీద కూడా ప్రేక్షకులలో కాస్త ఆసక్తి ఏర్పడింది. మరి రైటర్ పద్మభూషణ్ ప్రేక్షకులను ఏమేరకు అలరించాడు అనేది సినిమా రివ్యూ లో చూద్దాం.
కధ:
విజయవాడలో నివసించే పద్మభూషణ్ వృత్తిరీత్యా లైబ్రరీలో పనిచేస్తూ ఉంటాడు. అసిస్టెంట్ లైబ్రరియన్ కావడంతో నిత్యం పుస్తకాల మధ్యనే గడుపుతూ ఉంటాడు. అయితే పద్మభూషణ్ కు రైటర్ పద్మభూషణ్ అనిపించుకోవాలనే కోరిక ఉంటుంది. దీంతో ఇంట్లో వారికి తెలియకుండా నాలుగు లక్షల రూపాయలు అప్పు చేసి మరీ తాను స్వయంగా రాసిన ఒక పుస్తకాన్ని అచ్చేసి దాన్ని అమ్మే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. పుస్తకాలు ఎవరూ కొనరు సరి కదా ఫ్రీగా అంట కట్టినా కూడా అవి తిరిగి తర్వాత తనకే వస్తూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఒకరోజు అనూహ్యంగా బంధువుల వివాహానికి వెళ్ళిన సమయంలో తాను రాయని పుస్తకాన్ని తానే రాసినట్లుగా బంధువులు ఫీల్ అయ్యి పెళ్లి సంబంధం కూడా కుదిర్చేస్తారు.
తన మరదలు సారికను వివాహం చేసుకుంటున్నానని ఆనందపడాలో తాను రాయని పుస్తకాన్ని చూసి తన పెళ్లి ఫిక్స్ అయిందని ఆనందపడాలో తెలియని పద్మభూషణ్ ప్రస్తుతానికైతే మరదలిని వివాహం చేసుకోవడానికి ముందడుగు వేస్తాడు. అయితే ఆ పుస్తకానికి కొనసాగింపు రాయాల్సి రావడంతో అది అసలు రాసింది ఎవరు అని వెతుకులాటలో పడతారు. అలా కాకినాడ వెళ్లి ఒక అమ్మాయి ఈ పుస్తకం రాసినట్లుగా తెలుసుకుని ఆమెను తీసుకొచ్చి ఇంట్లో పెట్టి పుస్తకం రాయమని అడుగుతాడు. ఆ అమ్మాయి రాసేందుకు వస్తుంది కానీ అసలు మొదటి పుస్తకం రాసింది ఆమె కాదని తేలుతుంది. అయితే మరి పద్మభూషణ్ పేరుతో మొదటి పుస్తకాన్ని రాసింది ఎవరు? పద్మభూషణ్ పెళ్లి పుస్తకంతో ముడిపడి ఉండడంతో పద్మభూషణ్ పెళ్లయిందా? సారిక, పద్మభూషణ్ ఏడడుగులు వేశారా అనేది ఈ సినిమా కథ.
విశ్లేషణ:
సాధారణంగా తమిళ, మలయాళ భాషల్లో కొన్ని సినిమాలను చూసి ఎగ్జిట్ అయిన తెలుగువారు కొందరు ఇలాంటి సినిమాలు మన దగ్గర ఎందుకు రావు అని పెదవిరుస్తూ ఉంటారు. అలా ఇతర భాషలలో చూసి ఎగ్జిట్ అయ్యేలాంటి సినిమాలానే ఉంటుంది ఈ సినిమా కూడా. పూర్తిస్థాయి తెలుగు వారందరూ కలిసి తెరకెక్కించిన ఈ సినిమా మొదలైన సెకండ్ నుంచి చివరి పేర్లు వచ్చేవరకు ఆసక్తికరంగా సాగిపోతుంది. ఎలా అయినా మంచి రైటర్ గా పేరు తెచ్చుకోవాలని పరితపించే రైటర్ పద్మభూషణ్ అతని రచనలు చూసి ప్రేమలో పడిన మరదలు సారిక వీరిద్దరి మధ్య ప్రేమ, గిల్లికజ్జాలు , పద్మ భూషణ్ తల్లిదండ్రుల మిడిల్ క్లాస్ మాటామంతీ, పద్మభూషణ్ కోసం ఏమైనా చేయడానికి సిద్ధమయ్యే ఓకే స్నేహితుడు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి సీన్ ఏదో ఒకచోట లింక్ అయ్యే విధంగా ప్రతి సీన్ ప్రేక్షకుడు ఎంజాయ్ చేసే విధంగా దర్శకుడు తెరకెక్కించాడు. కథ పరంగా ఇదేదో అద్భుతమైన కథ ఏమీ కాదు చిన్న పాయింట్ తీసుకుని ప్రేక్షకులందరూ ఔరా అనిపించే విధంగా తెరకెక్కించాడు దర్శకుడు.
నటీనటులు:
నటీనటుల విషయానికి వస్తే కలర్ ఫోటోతో ఇప్పటికే హీరోగా ప్రూవ్ చేసుకున్న సుహాస్ మరోసారి తనలో ఉన్న నటనని బయట పెట్టాడు. ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిగా నేటి యూత్ అంతా వీడెవడో మనలాగే ఉన్నాడే అనుకునే విధంగా సుహాస్ నటన ఉంది. ఇక టీనా శిల్ప రాజ్ తన పాత్ర పరిధిలో నటించింది. అయితే కన్నా అనే పాత్రలో నటించిన గౌరీ ప్రియ మాత్రం అదరగొట్టేసింది. ఇక ఎప్పటిలాగే రోహిణి. ఆశిష్ విద్యార్థి తమ అనుభవాన్ని రంగరించి నటించారు. గోపరాజు రమణ అశోక్ కుమార్ సౌమ్యత్రి అనే పాత్రలో నటించిన కుర్రాడు, ఇలా ఒక్కరు కాదు ఎవరికి వారు తమ పాత్రల పరిధి మేర నటించి తమ పాత్రలకు న్యాయం చేశారు.
టెక్నికల్ టీం
టెక్నికల్ టీం విషయానికి వస్తే షణ్ముఖ ప్రశాంత్ కు ఇది మొదటి సినిమా అయినా ఎక్కడా కూడా ఆ ఫీలింగ్ కలగకుండా ఒక ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్టైనర్ గా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు. కామెడీ అనుకుంటున్నారు కదా అని ఎమోషన్స్ లేవు అనుకుంటున్నారేమో చివరి పది నిమిషాల వరకు కడుపుబ్బ నవ్వించి చివరి పది నిమిషాలు కంటి నిండా కన్నీరు పెట్టించేసాశాడు. ఈ సినిమా చూసిన తరువాత ఇంటికి వెళ్లిన ప్రతి ఒక్కరూ తన ఇంట్లో ఉన్న తల్లిని చెల్లిని అక్కను భార్యను ఒక ప్రశ్న అడగడం మానరు. ఇక ఈ సినిమాకి సంగీతం కూడా బాగా కుదిరింది. డైలాగ్స్ కూడా ఏదో ఇరికించినట్లు కాకుండా రోజువారి మనం ఇళ్లలో మాట్లాడుకునే మాటలనే ఉంటాయి. సినిమాటోగ్రఫీ కూడా సినిమాకి తగినట్లుగా ఉంది ఎడిటింగ్ విషయంలో అసలు వంక పెట్టాల్సిన అవసరమే లేదు.
ఫైనల్ గా
ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రైటర్ పద్మభూషణ్ మిమ్మల్ని కడుపుబ్బ నవ్విస్తాడు, కంటినిండా ఏడిపిస్తాడు.. ఎలాంటి అసభ్యతకు తావు లేకుండా థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులు అందరినీ పైసా వసూల్ అన్నట్లుగా ఇంటికి పంపే సినిమా ఇది.
రేటింగ్: 3/5