తొలి ఇండియన్ స్పేస్ చిత్రం ట్రైలర్ విడుదల
తొలిసారిగా భారతదేశంలో స్పేస్ షిప్ కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రంగా నిర్మాతలు ఈ సినిమాని పేర్కొంటున్నారు.
అంతరిక్ష శాస్త్రవేత్తల పరిశోధనలు, వ్యోమగాముల సంచారం, స్పేస్ షిప్‌లో అలజడులు.. ఇలాంటి కథనాలతో వచ్చిన హాలీవుడ్ సినిమాలు లెక్కలేనన్ని ఉన్నాయి. అయితే భారతదేశంలో తొలిసారిగా ఇలాంటి కథాంశంతో ఓ చిత్రం తెరకెక్కబోతుంది. పూర్తి సాంకేతికతతో, భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు వినికిడి. ఆ చిత్రం పేరే "టిక్ టిక్ టిక్". ఇటీవలే ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. జయం రవి ప్రధాన పాత్రలో శక్తి సౌందర్ రాజన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తొలి స్పేస్ చిత్రంగా నిర్మాతలు ప్రచారం చేస్తున్నారు. అయితే గతంలో ఇలాంటి ప్రయోగాలు మన దేశంలో కూడా కొందరు చేశారు.
1995 ప్రాంతాల్లో దూరదర్శన్‌లో వచ్చిన "కెప్టెన్ వ్యోమ్" అనే సీరియల్ ఒక వ్యోమగామి కథనం. అలాగే సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన ఆదిత్య 369 చిత్రంలో కూడా కథానాయకుడు టైమ్ మెషీన్ సహాయంతో భవిష్యత్ కాలానికి వెళ్లి స్పేస్ షిప్ ఎక్కుతాడు. గంగరాజు గుణ్ణం దర్శకత్వంలో వచ్చిన "చందమామలో అమృతం" కూడా చంద్రుడి మీదకు వెళ్లే సాధారణ వ్యక్తుల జీవితాన్ని హాస్యంతో ముడిపెడుతుంది. అయితే ఈ ప్రయోగం బెడిసికొట్టింది. నిజం చెప్పాలంటే సైన్స్ ఫిక్షన్లు భారతీయ సినిమా చరిత్రలో చాలా తక్కువగానే ఉన్నాయని చెప్పాలి. ఇలాంటి సందర్భంలో సౌందర్ రాజన్ ప్రయోగాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందించడం హర్షణీయమని పలువురు అభిప్రాయపడుతున్నారు.