నానిపై శ్రీరెడ్డి ఆరోపణలు.. విశాల్ని పట్టుకున్న శ్రీరెడ్డి భయం !!
నానిపై శ్రీరెడ్డి చేస్తోన్న ఆరోపణల వివాదంపై స్పందించిన విశాల్
తెలుగు సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ తీవ్ర రూపం దాల్చుతోందని పలువురు సినీ ప్రముఖులపై నటి శ్రీరెడ్డి నిరాధారమైన ఆరోపణలు చేయడాన్ని నటుడు విశాల్ తీవ్రంగా తప్పుపట్టారు. ముఖ్యంగా టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నానిపై శ్రీరెడ్డి చేసిన ఆరోపణల గురించి ప్రస్తావిస్తూ "నాని నాకు చాలా కాలంగా తెలుసు. అతను నాకు మంచి స్నేహితుడు. అలాగని అతడిని వెనకేసుకురావడం లేదు కానీ అతడిపై శ్రీరెడ్డి చేసిన ఆరోపణలు మాత్రం వివాదాస్పదంగానే ఉన్నాయని విశాల్ అభ్యంతరం వ్యక్తంచేశారు. నాకే కాకుండా నాని గురించి తెలిసిన వాళ్లందరికీ అతడి వ్యవహారశైలి, ప్రవర్తన తీరు ఎలా ఉంటుందో తెలుసని నాని పట్ల తనకు ఉన్న సదభిప్రాయాన్ని వెల్లడించాడు. విశాల్, సమంత జంటగా నటించిన అభిమన్యుడు సినిమా విజయోత్సవ యాత్రలో భాగంగా విశాల్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
ఏదో పబ్లిసిటీ కోసం ప్రముఖులను ఎంచుకుని వారిపై ఆరోపణలు చేయడం కాకుండా, శ్రీరెడ్డి వద్ద ఏమైనా ఆధారాలు ఉంటే వాటిని బయటపెట్టాలి. అలా చేయకుండా కేవలం ఆరోపణలు చేస్తూ పోవడంలో అర్థమే లేదు అంటూ శ్రీరెడ్డి వ్యవహరిస్తున్న తీరును విశాల్ తప్పుపట్టారు. శ్రీరెడ్డి ఒకరి తర్వాత మరొకరిపై సంచలన ఆరోపణలు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే, ఎప్పుడో ఓ అప్పుడు ఆమె నన్ను కూడా టార్గెట్ చేయకపోదేమో అనే భయం వేస్తోంది అని విశాల్ ఆందోళన వ్యక్తంచేశారు.
"సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉందనేది కొట్టిపారేయలేని వాస్తవం. అయితే, అలాగని క్యాస్టింగ్ కౌచ్ పేరుతో ప్రముఖులపై నిరాధారమైన ఆరోపణలు చేయడం సరైన పద్దతి కాదు" అని శ్రీరెడ్డికి విశాల్ హితవు పలికారు.