VK Naresh: సినిమాల్లో నటించేందుకు టెన్త్ ఫెయిల్ అయ్యా.. ఆ సీక్రెట్ బయటపెట్టిన వీకే నరేష్
VK Naresh 50 Years Career: బాల నటుడిగా నట జీవితంలోకి ప్రవేశించిన ఆయన వందల చిత్రాల్లో నటించారు. ఇంకా నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. పండంటి కాపురంతో మొదలైన ఆయన నట ప్రస్థానం నేటికీ విజయవంతంగా కొనసాగుతోంది. నటుడిగా ప్రయాణం మొదలుపెట్టి యాభై ఏళ్లు పూర్తి చేసుకుని ఇంకా కుర్రాళ్లతో పోటీ పడి నటిస్తున్నారు. ఆయనే విజయకృష్ణ నరేశ్ అలియాస్ వీకే నరేశ్. నట జీవితంలో 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నరేశ్ తన మనసులోని మాటలను పంచుకున్నారు.
Naresh Movie Life Story: తన నటనతో ప్రేక్షకులకు వినోదం అందిస్తున్న సీనియర్ నటుడు వీకే నరేశ్ కెరీర్‌లో కీలక మైలురాయి చేరుకున్నారు. సినీ రంగం ప్రవేశం చేసి 50 వసంతాలు పూర్తి చేసుకున్నారు. పండంటి కాపురంలో బాలనటుడిగా మొదలైన సినీ ప్రస్థానంలో హీరోగా, విలన్‌గా ఇలా ఎన్నో విభిన్న పాత్రలో మెరుస్తున్నారు. తల్లి విజయనిర్మలకు తగ్గట్టు నటనలో రాణిస్తూ ప్రేక్షకాభిమానం పొందుతున్న నరేశ్ జనవరి 20న పుట్టినరోజు కూడా చేసుకుంటున్నారు. సినీ ప్రస్థానం యాభై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నరేశ్ శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా తన నట జీవితాన్ని ఒకసారి నెమరువేసుకున్నారు.
సమావేశంలో విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా తన తల్లితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. బాల్యం నుంచి నేటి వరకు సినీ పరిశ్రమలో కొనసాగిన జీవితంపై సవివరంగా చెప్పారు. నటుడిగా ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని 50 ఏళ్లు సినీ ప్రయాణం పూర్తి చేసుకోవడం తాను అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఇదంతా ప్రేక్షకుల ప్రేమాభిమానాలతోనే సాధ్యమైందని పేర్కొన్నారు. చివరి శ్వాస వరకు సినీ పరిశ్రమకు సేవ చేస్తానని ప్రకటించారు. ఊహ తెలిసినప్పటి నుంచి తనకు తెలిసిందల్లా సూపర్ స్టార్ కృష్ణ, కన్నతల్లి విజయనిర్మల మేకప్ రూమ్, స్టూడియో వాతావణం చుట్టూనే పెరిగినట్లు గుర్తు చేసుకున్నారు. నాటి తరం నేటి తరంతో పోటీ పడి నటిస్తున్నట్లు చెప్పుకున్నారు. అప్పటి దర్శకులు నేటి యువ దర్శకులతో కలిసి పని చేయడం ఆనందంగా ఉందని చెప్పారు.
సినీ రంగ ప్రవేశం గుర్తు చేసుకుంటూ నరేశ్ ఇలా మాట్లాడారు. 'తొమ్మిదేళ్ల వయసులో 'పండంటి కాపురం' వంటి అద్భుతమైన చిత్రంతో ఆరంగేట్రం చేశాను. బాల నటులుగా వచ్చిన వాళ్లు హీరోలుగా విజయవంతం కాలేరని చెబుతుంటారు. ఈ భయం నాకు ఉండేది. కానీ దాని గురించి పెద్దగా అలోచించలేదు. ఒక్క సినిమా హీరోగా నటిస్తే చాలని అనుకున్నా అంతే. అసలు సినిమాల్లోకి ఎలా వచ్చానో మీకో రహాస్యం చెప్పాలి. సినిమాలో నటించాలనే కోరికతో పదో తరగతి ఫెయిల్ అయ్యా' అని చెప్పారు. 'ఆ తర్వాత రెండు, మూడు సినిమాలు చేశాను. కానీ జంధ్యాల దర్శకత్వంలో చేసిన 'నాలుగు స్తంభాలాట'తో అద్భుతమైన కెరీర్ నాకు ప్రారంభమైంది' అని తెలిపారు.
తన తొలి దశలో జంధ్యాల, అమ్మ (విజయనిర్మల), విశ్వనాథ్, బాపురమణ, ఈవీవీ సత్యనారాయణ, వంశీ, రేలంగి నరసింహరావు వంటి మహానీయులతో కలసి పని చేసే అదృష్టం దొరికిందని నరేశ్ చెప్పారు. ప్రతి సినిమాలో కొత్తదనం ప్రయత్నిస్తూ ఎన్నో విజయవంతమైన చిత్రాలు చేసినట్లు వెల్లడించారు. రాజీపడి సినిమాలు చేయడం తనకు ఇష్టం లేదని.. అనుకున్న సినిమాలు చేయలేకపోతున్నాననే ఒక చిన్న నిరాశ ఇంకా ఉందని పేర్కొన్నారు. వృత్తి, వ్యక్తిగత జీవితంలో సాహసాలు తీసుకుంటానని, మనసుకి నచ్చింది చేస్తాను. 'మీ శ్రేయోభిలాషి', 'గుంటూరు టాకీస్', 'దృశ్యం' సినిమాలతో రెండోసారి నట జీవితం ప్రారంభమైందని వివరించారు.
నటుడిగా పదేళ్లు ఉండటమే గొప్ప అయిన ఈ రోజుల్లో 50 ఏళ్లు గడపడం ఆనందంగా ఉందని నరేశ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సూపర్‌స్టార్ కృష్ణ, విజయనిర్మలను కోల్పోవడంపై నరేశ్ భావోద్వేగంతో మాట్లాడారు. వారిద్దరూ ఉంటే ఇల్లు ఒక పండగలా ఉండేది. వారు వెళ్లిపోవడం అనేది దాదాపుగా ఒక డిప్రెషన్‌కి తీసుకెళ్లిందని వివరించారు. తెలుగు రాష్ట్రాలు సినీ పరిశ్రమకు గౌరవం, ప్రాధాన్యం ఇవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. నంది అవార్డులను మళ్లీ ఇవ్వాలని కోరుతున్నట్లు చెప్పారు. తన కుమారుడి నవీన్ భవిష్యత్‌పై మాట్లాడుతూ.. 'పరిశ్రమలోకి వాడికి వాడే వచ్చాడు. హీరోగా సినిమా చేశాడు. నవీన్‌కి దర్శకుడిగా మంచి భవిష్యత్ ఉంటుందని నమ్ముతున్నా' అని తెలిపారు. తనకు విలన్ పాత్రలు చేయాలని ఉందని, విజయ కృష్ణ గ్రీన్ స్టూడియోస్ ఆధ్వర్యంలో త్వరలోనే ఓ సినిమా చేయబోతున్నట్లు నరేశ్ ప్రకటించారు.
Also Read Hacking తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు
Also Read: Boat Accident: గుజరాత్‌లో ఘోర పడవ ప్రమాదం 16 మంది మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter