24 కిస్సెస్ మూవీ రివ్యూ
24 కిస్సెస్ మూవీ రివ్యూ
నటీనటులు : అదిత్ అరుణ్, హెబ్బాపటేల్, నరేష్, రావు రమేష్, అదితి మైఖెల్, శ్రీని కాపా, మధు నెక్కంటి తదితరులు
ఛాయాగ్రహణం : ఉదయ్ గుర్రాల
సంగీతం: జోయ్ బరువా
నిర్మాతలు: సంజయ్ రెడ్డి, అనిల్ పల్లాల, అయోధ్యకుమార్ కృష్ణంసెట్టి
రచన – దర్శకుడు: అయోధ్యకుమార్ క్రిష్ణంసెట్టి
విడుదల తేది : 23 నవంబర్ 2018
40 మంది అంధులతో ‘మిణుగురులు’ సినిమా తీసి దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న అయోధ్య కుమార్ కాస్త గ్యాప్ తీసుకొని ’24 కిస్సెస్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అదిత్, హెబ్బా పటేల్ జంటగా తెరకెక్కిన ఈ సినిమా ఈరోజే థియేటర్స్‌లోకొచ్చింది. మరి టీజర్, ట్రైలర్‌తో ఆడియన్స్‌ని ఎట్రాక్ట్ చేసిన ఈ సినిమా థియేటర్లో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిందా ? దర్శకుడు అయోధ్య కుమార్ ఈ సినిమాతో ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకున్నాడు అనే వివరాలు ఈ రివ్యూలో చూద్దాం.
కథ :
కోదాడ పక్కన మార్కాపురం అనే పల్లెటూరికి చెందిన ఆనంద్(అదిత్) తన కుటుంబానికి దూరంగా ఉంటూ హైదరాబాద్‌లో ఫిలిం మేకర్‌గా స్థిరపడతాడు. కొన్ని సినిమాలతో చిల్డ్రన్స్ ఫిలిం మేకర్‌గా పేరొందిన ఆనంద్‌కి అనుకోకుండా ఓ కాలేజ్ వర్క్ షాప్‌లో శ్రీ లక్ష్మి (హెబ్బా పటేల్) అనే అమ్మాయి పరిచయం అవుతుంది. ఆనంద్ మంచితనం, చిల్ల పిల్లల ఆరోగ్యం పట్ల అతడు చూపించే ఆసక్తి చూసి ఆనంద్‌తో శ్రీలక్ష్మి ప్రేమలో పడుతుంది. తన లైఫ్‌లో పెళ్లి , పిల్లలు అనే చాప్టర్స్ ఉండకూడదని డిసైడ్ అయిన ఆనంద్ కూడా ఒకానొక సందర్భంలో శ్రీ లక్ష్మి ప్రేమలో పడతాడు. తన జీవితంలో కొందరు అమ్మాయిలతో శారీరక సంబంధం పెట్టుకున్న ఆనంద్‌కి పెళ్ళన్నా, పుట్టే పిల్లలన్నా ఇష్టం లేకపోవడానికి రీజన్ ఏంటి ? అప్పుడప్పుడు సైకియార్టిస్ట్ మూర్తిని సంప్రదిస్తూ తన ప్రేమకథలో జరుగుతున్న సంఘటనలు చెప్పుకునే ఆనంద్‌కి సైకలాజికల్ ప్రాబ్లెం ఉందా ? తన కుటుంబానికి ఆనంద్ ఎందుకు దూరంగా ఉంటాడు ? అసలు పెళ్ళంటే ఇష్టంలేని ఆనంద్‌ని శ్రీలక్ష్మి చివరికి మార్చగలిగిందా ? లేదా అనేదే 24 కిస్సెస్ కథ.
నటీనటుల పనితీరు :
‘కథ’ సినిమాతో హీరోగా పరిచయమై ఆ తర్వాత హీరోగా రెండు మూడు సినిమాలు చేసిన అదిత్ తన పెర్ఫార్మెన్స్‌తో పరవాలేదనిపించుకున్నాడు. ముఖ్యంగా కొన్ని సన్నివేశాల్లో అతని నటన ఆకట్టుకుంటుంది. ఇక హెబ్బా ఎప్పటిలాగే క్లాస్ టచ్ ఉన్న గ్లామర్ క్యారెక్టర్‌లో మెప్పించి సినిమాకు హైలైట్‌గా నిలిచింది. రొమాంటిక్ సన్నివేశాల్లో అదిత్, హెబ్బా మధ్య కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ అయింది. రావు రమేష్ మరోసారి డిఫరెంట్ క్యారెక్టర్‌తో అలరించాడు. అదిత్ మైకల్ గ్లామర్ రోల్‌లో ఆకట్టుకుంది. నరేష్, శ్రీని కాపా, మధు నెక్కంటి వారి పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతికవర్గం పనితీరు :
రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమాకి మంచి మ్యూజిక్ పడాల్సిందే… పాటలు, ఆర్.ఆర్ ప్రేక్షకుడికి రొమాంటిక్ ఫీల్ కలిగించాలి. అప్పుడే ప్రేక్షకుడు సినిమాకి కనెక్ట్ అవుతాడు. ఈ సినిమాకు జోయ్ బరువా అందించిన పాటలు మైనస్ అనిపిస్తాయి. 123 అంటూ 24 కౌంట్ పాట మినహా మిగతా పాటలేవి ఆకట్టుకోలేదు. ఆర్.ఆర్ కూడా జస్ట్ పరవాలేదనిపించింది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ కుదరలేదు. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో ఎడిటింగ్‌పై శ్రద్ధ పెట్టాల్సింది. అయోధ్య కుమార్ కథ , కథనంతో పాటు డైరెక్షన్ కూడా వీక్ అనిపించాయి. ప్రొడక్షన్ వాల్యూస్ పరవాలేదు.
తెలుగులో అడల్ట్ కంటెంట్‌తో ఓ సినిమా వస్తుందంటే అందరి దృష్టి దానిమీదే పడుతుంది. అలాంటి అడల్ట్ కంటెంట్‌తో అందరినీ ఎట్రాక్ట్ చేసిన సినిమా 24 కిస్సెస్.. అయితే ఇది బూతు సినిమా కాదని , సినిమా అందరూ చూసే విధంగా ఉంటుందని దర్శకుడు ముందే ఓ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. నిజానికి దర్శకుడు ఈ సినిమాలో పేద పిల్లలకు పోషకాహారం అందడం లేదని, కొందరు ప్రభుత్వ అధికారులు అందనివ్వడం లేదనే పాయింట్ రైజ్ చేసాడు. కానీ ముద్దుల మధ్య హీరో కన్ఫ్యూజన్ క్యారెక్టర్ , ఆకట్టుకోని సన్నివేశాల వల్ల ఆ పాయింట్ ప్రేక్షకులకు పెద్దగా ఆనదు.
సినిమా ప్రారంభంలో తన జీవితంలో ఎదురైన సంఘటనలు, తన మిణుగురులు సినిమా తాలుకు సంగతులను హీరో క్యారెక్టర్ ద్వారా చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఆ సీన్స్ ఆకట్టుకోలేదు. ఏదో చెప్పాలని అందులో మరేదో ఆడ్ చేసి అటు ఇటు కాకుండా సినిమాను తెరకెక్కించాడు అయోధ్య కుమార్.. ఓ సందర్భంలో అసలు ఈ సినిమాతో దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడు… అనే ప్రశ్న ప్రేక్షకుడిలో మొదలవుతుంది. చాలా సన్నివేశాలు డాక్యుమెంటరీ సినిమాని తలపించేలా ఉన్నాయి. అసలే కథేంటో అర్థం కానీ పరిస్థితుల్లో ప్రేక్షుడుంటే తన స్లో నేరేషన్‌తో దర్శకుడు మరింత విసుగు తెప్పించాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో వచ్చే చాలా సన్నివేశాలు ఆడియెన్స్‌కి బాగా బోర్ కొట్టిస్తాయి.
మిణుగురులు దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న అయోధ్య కుమార్ కాస్త గ్యాప్ తీసుకొని ఈ సినిమా చేసాడంటే అంతో.. ఇంతో విషయం ఉంటుందనుకున్న ప్రేక్షకులకు తన ఎక్స్‌పిరియన్స్‌తో కలగలిపిన ఓ విసుగు పుట్టించే ప్రేమకథతో ఎంటర్‌టైన్ చేయాలని చూసాడు. ఇలా కాకుండా ఏదైనా మంచి కథ తీసుకొని దానికి తన స్టైల్ స్క్రీన్ ప్లే రాసుకుంటే బాగుండేది. ముఖ్యంగా దర్శకుడు తను స్ట్రాంగ్ అనిపించుకున్న జోనర్‌లో సినిమా చేస్తే బెటర్ రిజల్ట్ ఉండేది. హీరో పెళ్లి , పిల్లలకి ఎందుకు దూరంగా ఉంటాడో చెప్పే రీజన్స్ కూడా సిల్లీగా అనిపిస్తాయి. ఫైనల్‌గా 24 కిస్సెస్ అంటూ అయోధ్య కుమార్ రూపొందించిన ఈ సినిమాలో ఆ ముద్దులు తప్ప ఆసక్తి కలిగించే కథ కానీ అలరించే కథనం కానీ కనపడదు.
బాటం లైన్ : 24 ముద్దులు మాత్రమే..
రేటింగ్ : 1.5/5