నిర్మాత బండ్ల గణేష్ పై 68 చెక్ బౌన్స్ కేసులు.. ప్రొద్దుటూరులో విచారణ
ప్రముఖ తెలుగు చలనచిత్ర నిర్మాత బండ్ల గణేష్ పై గతంలో 68 చెక్ బౌన్స్ కేసులు నమోదయ్యాయి.
ప్రముఖ తెలుగు చలనచిత్ర నిర్మాత బండ్ల గణేష్ పై గతంలో 68 చెక్ బౌన్స్ కేసులు నమోదయ్యాయి. అందులో ఈ శుక్రవారం 21 కేసులు కడప జిల్లా ప్రొద్దుటూరు జిల్లా రెండో అదనపు కోర్టులో విచారణకు వచ్చిన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కేసులలో కొన్ని లోక్ అదాలత్ ద్వారా పరిష్కారమైనట్లు సమాచారం. అలాగే మరికొన్ని కేసులను వచ్చే నెలకు వాయిదా వేసినట్లు కూడా పలు పత్రికలు వార్తలు రాయడం జరిగింది. అయితే కొన్ని కేసులపై ఫిర్యాదుదారుల సమక్షంలోనే న్యాయమూర్తి బండ్ల గణేష్‌ను వివరణ కోరారని వార్తలు వచ్చాయి.
అయితే అలాంటి కేసుల పరిష్కారానికి సంబంధించి కొంత కాలం వ్యవధిని కూడా బండ్ల గణేష్ న్యాయమూర్తిని అడిగినట్లు సమాచారం. అయితే ఈ కేసుల గురించి మీడియాకి బండ్ల గణేష్ నుండి ఎలాంటి అధికారిక సమాచారం కూడా అందలేదు. బండ్ల గణేష్ కోర్టులోకి వెళ్తున్నప్పుడు కూడా.. తన మొహం మీడియాకు కనిపించకుండా మాస్క్ ధరించే లోపలికి వెళ్లారు. అలాగే మీడియా వారితో మాట్లాడడానికి కూడా నిరాకరించారు.
2009లో రవితేజ నటించిన "ఆంజనేయులు" చిత్రంతో నిర్మాతగా మారిన బండ్ల గణేష్.. ఆ తర్వాత గబ్బర్ సింగ్, ఇద్దరమ్మాయిలతో, టెంపర్ లాంటి హిట్ సినిమాలు కూడా తీశారు. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బేనరుపై ఆయన చిత్రాలను నిర్మించారు. సచిన్ జోషి నటించిన "నీ జతగా నేనుండాలి" చిత్రానికి కూడా గణేష్ నిర్మాణ సారథ్యం వహించారు. హైదరాబాద్ షాద్ నగర్ ప్రాంతంలో గణేష్ అనేక సంవత్సరాలుగా పౌల్ట్రీ బిజినెస్ కూడా చేస్తున్నారు.