ఆ హీరోల కెరీర్‌లో ఉంది.. ఒక `సూపర్ హిట్` చిత్రం మాత్రమే..!
ఆ హీరోల కెరీర్‌లో ఉంది కేవలం ఒకే ఒక్క సూపర్ హిట్ సినిమా. తమ కెరీర్‌లో ఒక చిత్రం సూపర్ హిట్టయ్యాక .. ఆ తర్వాత మిగతా సినిమాలు అనుకున్నంత స్థాయిలో ఆడకపోవడమో లేదా అనుకున్న కలెక్షన్లు పొందకపోవడమో అన్నది వారికి ఒకింత మైనస్ అనే చెప్పవచ్చు.
ఆ హీరోల కెరీర్‌లో ఉంది కేవలం ఒకే ఒక్క సూపర్ హిట్ సినిమా. తమ కెరీర్‌లో ఒక చిత్రం సూపర్ హిట్టయ్యాక .. ఆ తర్వాత మిగతా సినిమాలు అనుకున్నంత స్థాయిలో ఆడకపోవడమో లేదా అనుకున్న కలెక్షన్లు పొందకపోవడమో అన్నది వారికి ఒకింత మైనస్ అనే చెప్పవచ్చు. అయినా తమ వంతు ప్రయత్నంగా తమ కెరీర్‌లో మరో సూపర్ డూపర్ హిట్ చిత్రం కోసం ఎదురుచూస్తూ అప్పుడప్పుడు తమ లక్ పరీక్షించుకొనే ఆ హీరోల గురించి, వారి కెరీర్‌లో హిట్ చిత్రంగా నిలిచిన ఆ ఒక్క సినిమా గురించి మనం కూడా తెలుసుకుందామా..!
తారకరత్న (ఒకటో నెంబర్ కుర్రాడు): నందమూరి వారసుల్లో తారకరత్న ఒకరన్న సంగతి మనకు తెలిసిందే. ఈ కథానాయకుడు తన కెరీర్‌లో ఎన్ని ఫ్లాపులు సొంతం చేసుకున్నా.. ఆయన నటించిన మొదటి చిత్రం మాత్రం సూపర్ హిట్ అయ్యింది. అదే "ఒకటో నెంబర్ కుర్రాడు". 2002లో విడుదలైన ఈ చిత్రానికి రాఘవేంద్రరావు నిర్మాతగా వ్యవహరించగా.. కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు. ఆ తర్వాత తారకరత్నకి సరైన హిట్ దొరకలేదన్నది మాత్రం వాస్తవమే. అయితే "అమరావతి" చిత్రానికి బెస్ట్ విలన్‌గా తారకరత్న నంది అవార్డు మాత్రం గెలుచుకున్నారు.
నవదీప్ (గౌతమ్ ఎస్‌ఎస్‌సీ): "జై" చిత్రం ద్వారా తేజ దర్శకత్వంలో హీరోగా తెలుగు తెరకు పరిచయమైన నవదీప్ కెరీర్‌లో ఒకే ఒక హిట్ చిత్రం "గౌతమ్ ఎస్‌ఎస్‌సీ" అని చెప్పుకోవచ్చు. ఈ చిత్రం తర్వాత క్రిష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన "చందమామ" చిత్రం హిట్ అయినా దాంట్లో ఆయన సెకండ్ హీరో కాబట్టి, దానిని కన్సిడర్ చేయలేం. తర్వాత సహాయ నటుడిగానే నటిస్తూ.. అప్పుడప్పుడు హీరోగా కూడా తన లక్ పరీక్షించుకుంటున్నారు నవదీప్.
మనోజ్ నందం (ఒక రొమాంటిక్ క్రైం కథ): ఛత్రపతి సినిమాతో బాలనటుడిగా బాగా పేరు తెచ్చుకున్న మనోజ్ నందం హీరోగా నటించి హిట్ కొట్టిన చిత్రం "ఒక రొమాంటిక్ క్రైం కథ". ఈ చిత్రం తర్వాత మనోజ్ అనేక చిత్రాలు చేసినా అవేవీ అతనికి అంతగా పేరు తీసుకురాలేదు. ప్రస్తుతం మరో హిట్ చిత్రం కోసం వెయిట్ చేస్తున్నాడు మనోజ్.
తనీష్ (నచ్చావులే): నచ్చావులే చిత్రం ఎంత పెద్ద హిట్ చిత్రమో మనకు తెలియంది కాదు. ఈ చిత్రంతో హీరోగా పరిచయమైన తనీష్‌కు అది ఒక్కటే సోలోగా హిట్ చిత్రం. ఆ తర్వాత ఆయన చేసిన "రైడ్" చిత్రం కూడా హిట్ చిత్రమైనా.. అందులో ఆయన సెకండ్ హీరోగా నటించాడు. ఆ తర్వాత తనీష్ నటించిన "మేం వయసుకు వచ్చాం" చిత్రం ఓ మాదిరిగా ఆడినా.. అది "నచ్చావులే" స్థాయి హిట్ ఇవ్వలేకపోయింది. ప్రస్తుతం మరో హిట్ కోసం వేచి చూస్తున్నాడు తనీష్.
శశాంక్ (అనుకోకుండా ఒక రోజు): "ఐతే" లాంటి హిట్ చిత్రంతో తన కెరీర్ ప్రారంభించినా.. సోలో హీరోగా శశాంక్, సూపర్ హిట్ నమోదు చేసిన చిత్రం "అనుకోకుండా ఒక రోజు". ఈ చిత్రం తర్వాత ఆయనకు ఆ స్థాయి హిట్ లభించలేదు. "సై" చిత్రానికి మాత్రం సహాయ నటుడిగా నంది అవార్డు అందుకున్నాడు శశాంక్.
గౌతమ్ (పల్లకిలో పెళ్లికూతురు): బ్రహ్మానందం కుమారుడు గౌతమ్ హీరోగా 2004లో నటించిన "పల్లకిలో పెళ్లికూతురు" చిత్రం హిట్ చిత్రంగా నిలిచింది. కానీ ఆ తర్వాత ఆయన నటించిన పలు చిత్రాలు ఫ్లాప్ అవ్వడంతో.. గౌతమ్‌కి మరో హిట్ కోసం వెయిట్ చేయడం తప్పలేదు.
బాలాదిత్య (చంటిగాడు): బాలనటుడిగా సక్సెస్ అయ్యి.. ఆ తర్వాత జయ దర్శకత్వంలో "చంటిగాడు" లాంటి హిట్ చిత్రంలో నటించిన బాలాదిత్య, గ్యాప్ తీసుకొని "1940 ఒక గ్రామం" లాంటి అవార్డు విన్నింగ్ మూవీలో నటించినా అది వసూళ్ల పరంగా పెద్దగా సక్సెస్ కాలేదు. ఆ తర్వాత బాలాదిత్య నటించిన పలు చిత్రాలు ఫ్లాప్ కావడంతో.. ఆయన అడపా దడపా మాత్రమే సినిమాలు చేస్తున్నారు.
ప్రిన్స్ (బస్ స్టాప్) - తేజ దర్శకత్వంలో హీరోగా "నీకు నాకు డాష్ డాష్" చిత్రం ద్వారా హీరోగా ప్రిన్స్ పరిచయమైనా.. అది తనకు హిట్ చిత్రంగా నిలవలేదు. కానీ ఆ తర్వాత నటించిన "బస్ స్టాప్" చిత్రం మాత్రం సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత రిలీజైన చిత్రాలు పెద్దగా ఆడకపోవడంతో మరో హిట్ చిత్రం కోసం ప్రిన్స్ వెయిట్ చేస్తున్నాడని చెప్పుకోవచ్చు.
వరుణ్ సందేశ్ (కొత్త బంగారులోకం) - శేఖర్ కమ్ముల దర్శకత్వంలో "హ్యాపీడేస్"తో తెలుగు తెరకి పరిచయమైనా.. అందులో నలుగురు హీరోల్లా ఒకరిగా నటించారు వరుణ్ సందేశ్. ఆయన హీరోగా సోలోగా నటించిన తొలిచిత్రం "కొత్త బంగారులోకం". ఈ చిత్రం తర్వాత అదే స్థాయి హిట్ వరుణ్‌కి దక్కలేదన్నది నిజం. ఎవరైనా ఎప్పుడైనా, ఏమైందీ ఈ వేళ లాంటి యావరేజ్ సినిమాలు చేసినా.. వరుణ్ ఖాతాలో పెద్ద హిట్ చిత్రాలేవీ పడలేదు.
సుమంత్ ఆశ్విన్ (అంతకు ముందు ఆ తర్వాత) - ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు తనయుడు సుమంత్ ఆశ్విన్ కెరీర్‌లో అతి పెద్ద హిట్ చిత్రంగా "అంతకు ముందు ఆ తర్వాత" చిత్రాన్ని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఆయన నటించిన కేరింత, కొలంబస్, ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్ చిత్రాలు ఆయనకు అనుకున్నంత విజయాన్ని అందివ్వలేదు. ప్రస్తుతం సుమంత్ ఆశ్విన్ నటిస్తున్న "హ్యాపీ వెడ్డింగ్" రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.