కోల్‌కతాకి చెందిన రవీంద్ర భారతి విశ్వవిద్యాలయం ఇటీవలే బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌కి తమ యూనివర్సిటీ తరఫున డాక్టరేటు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయనకు డాక్టరేటు ఇవ్వడం కుదరదని ఆ యూనివర్సీటీ వైస్ ఛాన్సలర్ చెప్పారు. అందుకు కారణం కూడా ఉంది. వివరాల్లోకి వెళితే.. మే 8, 2018 తేదిన రవీంద్ర భారతి విశ్వవిద్యాలయానికి చెందిన కాన్వకేషన్ కార్యక్రమం కోల్‌కతా‌లో జరగనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరుకావాలని డాక్టరేటు పురస్కారాన్ని ప్రకటించిన వారందరికీ సమాచారాన్ని అందించారు. అయితే తాను అదే సమయంలో షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉందని.. కనుక తాను హాజరుకాలేనని అమితాబ్ తెలిపారు. అయితే విశ్వవిద్యాలయం నిబంధనల మేరకు డాక్టరేటు పొందడానికి ఎంపికైనవారు.. కాన్వకేషన్ కార్యక్రమానికి తప్పక హాజరవ్వాల్సిందేనని.. లేకపోతే వారి డాక్టరేటు రద్దు చేయబడుతుందని వారి రూల్ బుక్‌లో ఉండడంతో డాక్టరేటు పురస్కారగ్రహీతల జాబితా నుండి అమితాబ్ పేరు తొలిగించమని వైస్ ఛాన్సలర్ తెలిపారు.


ఈ సంవత్సరం రవీంద్రభారతి విశ్వవిద్యాలయం వివిధ రంగాల్లో సేవలందించిన వారికి డాక్టరేట్లు ప్రకటించింది. వారిలో రబిన్ మండల్ (చిత్రకారుడు), నవనీత దేవసేన్ (రచయిత), జతిన్ దాస్ (చిత్రకారుడు), పండిట్ అమియా రంజన్ భందోపాధ్యాయ (సంగీత కళాకారుడు), నిరంజన్ ప్రధాన్ (శిల్పి), రుమా గుహ థాకుర్తా (గాయని), పంకజ్ కుమార్ మున్షి (నాటకకర్త), పూర్ణిమా ఘోష్ (నాట్యకారిణి) మొదలైన వారందరికీ ఈ సంవత్సరం విశ్వవిద్యాలయం రవీంద్రుని పూర్వీకులు ఇల్లైన జొరసంకో క్యాంపస్‌లో ఈ డాక్టరేట్లను అందిస్తోంది