కౌశల్.. ఇప్పుడు ఈ పేరు ఆంధ్రదేశంలో మారుమోగుతోంది. హైదరాబాద్ నగరంలో నేడు కౌశల్ కోసం 2కే వాక్ నిర్వహించగా.. వేలాది మంది అతని అభిమానులు పాల్గొన్నారు. ఈ జన ప్రభంజనాన్ని చూసి కౌశల్ ఫాలోయింగ్ మామూలుగా లేదబ్బా! అన్నవారూ లేకపోలేదు. ఆగమన్నా ఆగదు.. ఈ అభిమానం అంటున్నారు. కౌశల్ అభిమానులను చూసి అందరూ ముక్కునవేలేసుకుంటున్నారు. ఇంతకీ కౌశల్ ఎవరు? రాజకీయ నాయకుడా? లేదా సినిమా నటుడా?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కౌశల్ అంటే ఎవరో నిన్న మొన్నటి వరకు పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ ఒక్కసారిగా సోషల్ మీడియాలో ప్రభంజనంగా మారాడు. కౌశల్ ఓ తెలుగు ఛానల్‌లో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 2లో ఓ పాటిసిపెంట్. బిగ్‌బాస్‌ సీజన్ 2 ప్రారంభం నుంచి హౌస్‌లో అందరూ ఒకటైతే.. ఇతనొక్కడు ఒక వైపు. ముక్కుసూటి మనిషి. అవునన్నా కాదన్నా.. అనుకున్నది చేసేస్తాడు. అతని శైలి అలా ఉంది కాబట్టి బిగ్‌బాస్‌ హౌస్‌లో అతను ఒంటరిగా మారాడు. హౌస్ మేట్స్ వెంట లేకపోతేనేం.. వేలాది మంది అభిమానుల్ని గెల్చుకున్నారు కౌశల్. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇప్పుడు కౌశల్ ఆర్మీ పోస్టులే దర్శనం ఇస్తున్నాయి. ముఖ్యంగా ఎలిమినేష‌న్ స‌మ‌యంలో భారీగా ఓట్లు వేస్తూ కౌశ‌ల్‌ని సేఫ్ జోన్‌లో ప‌డేస్తున్నారు అతని పేరుతో ఏర్పడిన అభిమాన సంఘాలు,అతని అభిమానులు.


కౌశల్ ఆర్మీపై పెయిడ్ ఆర్మీ అంటూ బిగ్ బాస్‌లో ఉన్న మిగిలిన పాటిసిపెంట్ల ఫ్యాన్స్ కొందరు విమర్శలు చేయడంతో.. కౌశల్ ఆర్మీ స్పందించింది. తమది పెయిడ్ ఆర్మీ కాదని నిరూపించాలనే ఉద్దేశంతో ఆదివారం 2కే వాక్‌నిర్వహించింది. మాదాపూర్‌లోని కాకతీయ హిల్స్ నుంచి 100 ఫీట్ రోడ్ దాకా సాగిన ఈ వాక్‌లో వేల మంది నగరవాసులు పాల్గొన్నారు. ఈ వాక్‌లో అమ్మాయిలు, అబ్బాయిలే కాకుండా పిల్ల త‌ల్లులు కూడా పాల్గొన్నారు. కౌశల్ క్రేజ్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.


త్వరలో బిగ్ బాస్ సీజ‌న్ 2 తుదిదశకు చేరుకోనుంది. విజేత ఎవ‌ర‌నే దానిపై హోరా హోరీగా చ‌ర్చ ఓవైపు జ‌రుగుతుండగా.. తమ స్టార్ కౌశ‌లే సీజ‌న్2 విజేత అని అభిమానులు చెబుతున్నారు.