ఒకరేమో భారతీయ చలనచిత్ర పరిశ్రమను తన దర్శకత్వ ప్రతిభతో అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి. మరొకరేమో.. సినీ సంగీత లోకాన్ని తన రాగాలతో పావనం చేసిన "మ్యూజిక్ మేస్ట్రో". వారే దిగ్దర్శకుడు మణిరత్నం మరియు సంగీత దర్శకుడు ఇళయరాజా. వీరిద్దరూ కూడా జూన్ 2వ తేదినే జన్మించడం విశేషం. అలాగే ఒకరు పద్మశ్రీ అయితే.. మరొకరు పద్మవిభూషణ్. పైగా వీరిద్దరూ కలిసి చేసిన సినిమాలు కూడా ప్రేక్షకుల మనసులో ఒక విధమైన ఆర్ద్రతను, అనుభూతిని కలిగించాయనడంలో సందేహం లేదు. గీతాంజలి, అంజలి, పల్లవి అనుపల్లవి, మౌనరాగం, నాయకుడు, దళపతి.. ఇలా వీరిద్దరూ కలిసి చేసిన ప్రతీ సినిమా కూడా సూపర్ హిట్టే.. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారతీయ దర్శకుల్లో ఆయనదో విభిన్నమైన శైలి
2 జూన్ 1956 తేదిన మద్రాసులో గోపాలరత్నం దంపతులకు జన్మించిన మణిరత్నానికి చిన్నప్పటి నుండే సినిమాలతో సంబంధం ఉంది. ఆయన తండ్రి వీనస్ సంస్థలో ఫిల్మ్ డిస్ట్రిబ్యూటరుగా పనిచేసేవారు. మణిరత్నం మామయ్య వీనస్ క్రిష్ణమూర్తి నిర్మాత కూడా. చిన్నప్పటి నుండీ బాలచందర్ సినిమాలంటే చెవికోసుకొనే మణిరత్నం ఎంబీఏ చేసి ఉన్నతోద్యోగం చేసినా కూడా చలనచిత్రాలపై మక్కువతో తొలుత బి.ఆర్.పంతులు దర్శకత్వంలో తెరకెక్కిన ఓ కన్నడ సినిమాకి పనిచేశారు. ఆ తర్వాత పలు తమిళ సినిమాలకు కూడా పనిచేశారు. కానీ మూస ధోరణిలో వస్తున్న చిత్రాలంటే ఆయనకు అంత ఇష్టం ఉండేది కాదు. ఈ క్రమంలోనే భారతీరాజా చిత్రాలు, బాలచందర్ చిత్రాల నుండి ఎంతో ప్రేరణ పొందేవారు మణిరత్నం. 


1991లో మణిరత్నం తీసిన దళపతి చిత్రం ఆయన కెరీర్‌ను మలుపు తిప్పింది. ఆ తర్వాత వచ్చిన రోజా, బొంబాయి, యువ, గురు, సఖి చిత్రాలతో వైవిధ్యమైన చిత్రాల దర్శకుడిగా మణిరత్నం పేరు తెచ్చుకున్నారు. గీతాంజలి చిత్రానికి ఉత్తమ కథా రచయితగా నంది అవార్డు గెలుచుకున్న మణిరత్నం "మౌనరాగం" చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా కూడా ఫిల్మ్ ఫేర్ అందుకున్నారు. మణిరత్నం చిత్రాలు ఎన్నో అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో కూడా ప్రదర్శనలకు నోచుకున్నాయి. "బొంబాయి" చిత్రం ఎడిన్ బర్గ్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో అవార్డును కూడా కైవసం చేసుకుంది. అలాగే బెల్ గ్రేడ్ చిత్రోత్సవంలో "ఇరువర్" ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. ప్రస్తుతం అరవింద స్వామి, శిలంబరసన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్న "చెక్క చివంత వానం" చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు మణిరత్నం. "నవాబ్" పేరుతో ఈ చిత్రం తెలుగులో డబ్ అవుతోంది. 


సినీ సంగీతానికి స్వరబ్రహ్మ
1943 సంవత్సరంలో తమిళనాడులోని తేని జిల్లాలో జన్మించిన ఇళయరాజా అసలు పేరు "రాసయ్య". సంగీత గురువు ధనరాజు వద్ద శిష్యరికరం చేయడానికి వెళ్లినప్పుడు మాస్టారు పెట్టిన పేరే "రాజా". చిన్నప్పటి నుండి జానపద సంగీతంపై మక్కువ పెంచుకున్న రాజా, తమిళ చిత్రం "అన్నాకిలి"తో తన కెరీర్ మొదలుపెట్టారు. ఆ చిత్రంతోనే ఆయన ఇళయరాజాగా పేరు మార్చుకున్నారు. అంతకు ముందు ఆయన గిటారిస్టుగా, కీబోర్డు ప్లేయరుగా కూడా పనిచేశారు. ఆ తర్వాత సంగీత దర్శకుడిగా మారాక తెలుగులో సాగర సంగమం, స్వాతి ముత్యం, రుద్రవీణ, అన్వేషణ, సితార, శ్రీరామరాజ్యం లాంటి చిత్రాలకు మ్యూజిక్ అందించారు. భారత ప్రభుత్వం పద్మ భూషణ్ (2010)తో పాటు పద్మ విభూషణ్ (2018) బిరుదుతో కూడా ఇళయరాజాని సత్కరించింది. అలాగే ఎన్టీఆర్ జాతీయ అవార్డు, తమిళనాడు నుండి కళైమామణి, సంగీత నాటక అకాడమీ అవార్డు కూడా ఇళయరాజా అందుకున్నారు. 


భారతీయ సినీ పరిశ్రమలోనే గొప్ప లెజెండ్స్‌గా పేరుగాంచిన ఈ ఇద్దరు సినీ మేధావులకూ జన్మదిన శుభాకాంక్షలు