నందమూరి హరికృష్ణ మృతిపై స్పందించిన చిరంజీవి
నందమూరి హరికృష్ణ పార్థివదేహానికి నివాళి అర్పించిన చిరంజీవి, రామ్ చరణ్
రోడ్డు ప్రమాదంలో ప్రముఖ సినీనటుడు. మాజీ మంత్రి నందమూరి హరికృష్ణ ప్రాణాలు కోల్పోయారనే దుర్వార్తను తెలుగు సినీ పరిశ్రమ ఇంకా జీర్ణించుకోలేకపోతోంది. బుధవారం ఉదయం నల్గొండ జిల్లాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై మృతిచెందిన నందమూరి హరికృష్ణను కడసారి చూసుకుని నివాళి అర్పించేందుకు సినీ పరిశ్రమ తరలివస్తోంది. దశాబ్ధాల తరబడి సినీ పరిశ్రమతో అనుబంధం పెనవేసుకుని ఉన్న నందమూరి హరికృష్ణ కుటుంబంతో ఎంతోమంది సినీ ప్రముఖులు సత్సంబంధాలు కలిగి ఉన్నారు. అలాగే నందమూరి హరికృష్ణ దుర్మరణం చెందడం మెగాస్టార్ చిరంజీవిని సైతం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మిత్రుడు హరికృష్ణను కడసారి చూసేందుకు తనయుడు రామ్ చరణ్ తో కలిసి నందమూరి హరికృష్ణ నివాసానికి వచ్చిన చిరంజీవి అక్కడ నందమూరి హరికృష్ణ పార్థివదేహం ముందు పుష్పగుచ్చాన్ని ఉంచి నివాళి అర్పించారు. నందమూరి హరికృష్ణ వారసులు కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణ సోదరుడు బాలకృష్ణలను పరామర్శించి తన సంతాపం ప్రకటించారు.
నందమూరి హరికృష్ణ పార్థివదేహానికి నివాళి అర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నందమూరి హరికృష్ణ హఠాన్మరణం తనను షాక్ కి గురిచేసిందన్నారు. తమ మధ్య మంచి అనుబంధం ఉండేదని, ఎప్పుడు, ఎక్కడ కలుసుకున్నా.. సరదాగా నవ్విస్తూ కనిపించే వారని నందమూరి హరికృష్ణతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.