ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ మృతి చెందారని తెలిసి తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. వేణుమాధవ్ తనతో కలిసి మొదటిసారి మాస్టర్ సినిమాలో నటించాడు. ఆ తర్వాత పలు సినిమాల్లో ఇద్దరం కలిసి పనిచేశాం. వేణుమాధవ్ ఏ పాత్ర వేసినా ఆ పాత్రకే వన్నె తీసుకొచ్చే నటుడు. కొన్ని పాత్రలైతే తనకోసమే పుట్టాయా అన్నంత గొప్పగా నటించేవాడు. అలా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఇవాళ మన మధ్యలో లేరని తెలిసి చాలా బాధగా ఉందని చిరంజీవి ఆవేదన వ్యక్తంచేశారు. వేణు మాధవ్‌ని చూసినప్పుడల్లా.. చిన్నవయసైన వేణుకు సినీ పరిశ్రమలో గొప్ప భవిష్యత్ ఉందనుకునేవాడిని. కానీ దేవుడు అతన్ని చిన్న చూపు చూసి ముందే తీసుకెళ్లాడు. వేణుమాధవ్ ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నానన్న చిరంజీవి... ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని అన్నారు.


వేణు మాధవ్ మృతిపట్ల ఎవరిని కదిలించినా.. అందరిలోనూ ఆవేదనే వ్యక్తమవుతోంది. అందరితో కలిసిపోయి.. అందరినీ కలుపుకునిపోయే గొప్పనటుడు వేణు మాధవ్. అంతేకాకుండా తనలాగే పేదరికం నుంచి పరిశ్రమలోకి వచ్చిన వారికి అవకాశాలు ఇప్పించి తనకు ఉన్నంతలో ఆర్థికంగా చేయూతనందించే మనసున్న మనిషి ఇవాళ మనమధ్యలో లేకపోవడం చాలా బాధాకరం అంటూ పలువురు సినీ ప్రముఖులు, తోటి ఆర్టిస్టులు ఆవేదన వ్యక్తంచేశారు.