ముఖేశ్-నీతా అంబానీల పెద్ద కొడుకు ఆకాష్ అంబానీకి నిశ్చితార్థం జరిగింది. శనివారం గోవాలో కుటుంబ సభ్యుల మధ్య రస్సెల్-మోనా మెహతా కుమార్తె అయిన శ్లోకా మెహతాతో నిశ్చితార్థం జరిగిందని మీడియా వర్గాలు తెలిపాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆకాష్, శ్లోకా ముంబైలోని ధీరుభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ (డీఏఐఎస్) యొక్క పూర్వ విద్యార్థులు. అదీగాక ప్రపంచంలోని అతి పెద్ద వజ్రాల వ్యాపార సంస్థల్లో ఒకటైన రోసీ బ్లూ డైమండ్స్‌కు డైరెక్టర్‌గా ఉన్న మెహతా, అంబానీల కుటుంబాల మధ్య దశాబ్ధాల కాలం నుంచి స్నేహం వుంది. అలా కుదిరిన ఆ స్నేహమే ఇప్పుడు ఈ ఇద్దరినీ ఒక్కటి చేసేందుకు కారణమైందని తెలుస్తోంది. శ్లోకా, రోసీ బ్లూ ఫౌండేషన్ డైరెక్టర్. ఆమె 'కనెక్ట్ ఫర్' అని పిలవబడే సంస్థకు సహ వ్యవస్థాపకురాలు. ఈ సంస్థ ఎన్జీవోల స్వచ్ఛంద సేవలకై సహాయపడుతుంది.



 



 


ఆకాష్ అంబాని, శ్లోకా ఇద్దరు ధీరూభాయ్ అంబాని ఇంటర్నేషనల్ స్కూల్‌లోనే కలిసి చదువుకున్నారు. ఆకాష్ బ్రౌన్ యూనివర్సిటీకి చెందిన యూఎస్ ఐవీ లీగ్ కళాశాలలో చదవగా.. న్యూజెర్సీలోని ప్రిన్స్‌టన్ యూనివర్శిటీ నుంచి ఆంత్రపాలజీ విద్యను అభ్యసించిన శ్లోకా ఆ తర్వాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ అండ్ పొలిటికల్ సైన్సెస్ నుంచి న్యాయవిద్యలో మాస్టర్స్ డిగ్రీ పట్టా పుచ్చుకుంది.


ఇటీవలే ఆకాష్, శ్లోకాల వివాహం, నిశ్చితార్థం గురించి చాలా వార్తలు, కథనాలు వచ్చాయి. అయితే ఆ సమయంలో ఇరు కుటుంబసభ్యులు దీనిపై స్పందించలేదు. డిసెంబర్‌లో వీరి వివాహం జరగవచ్చని సమాచారం. పిటిఐ నివేదిక ప్రకారం, రెండు కుటుంబాలు వివాహంపై వ్యాఖ్యానించడానికి నిరాకరించాయి.