గూగుల్ డూడుల్ మే 22, 2018న భారత పునరుజ్జీవన పితామహుడైన రాజా రామ్మోహన్ రాయ్ 246వ జయంతిని జరుపుకుంటున్నది. ఈయనొక సుప్రసిద్ధ భారతీయ సంఘ సంస్కర్త. 1828లో బ్రహ్మ సమాజంను స్థాపించారు. ఆ కాలంలో బ్రహ్మణేతరులతో కలిసి భోజనం చేశారు. ఉపనిషత్తుల్లోని నిరాకార తత్వాన్ని అంగీకరించి, మనవ సమాజంలో ఐక్యతను ఆకాంక్షించారు. అస్పృశ్యత, కులజాడ్యంపై చైతన్యం కలిగించారు. బ్రిటీష్ ప్రభుత్వం ద్వారా సతీసహగమనాన్ని నిషేధించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


 


బ్రహ్మ సమాజ స్థాపకుడైన రాజా రామ్మోహన్ రాయ్ 1772లో బెంగాల్‌లోని బర్డ్వాన్ జిల్లా రాధానగర్‌లో జన్మించారు. 1815లో ఆత్మీయసభ అనే సంస్థను స్థాపించారు. భగవంతుడు ఒక్కడే అన్న సిద్ధాంతాన్ని ప్రచారం చేయడమే దీని ఉద్దేశం.


హిందూ మతంలోని అనేక దురాచారాలను రూపుమాపడానికి, సంస్కరించడానికి 1828లో రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజాన్ని స్థాపించారు. భారతీయ సామాజిక, మత సంస్కరణోద్యమానికి ఇది వెన్నుదన్నుగా నిలిచింది. ఆధునిక విద్యావ్యాప్తి, స్త్రీ జనోద్ధరణ కోసం విశేషంగా కృషి చేశారు. బహు భార్యత్వం, సతీసహగమనం లాంటి దురాచారాలను ఖండించారు. ఆయన కృషి ఫలితంగానే అప్పటి గవర్నర్ జనరల్ విలియం బెంటింక్ 1829లో రెగ్యులేషన్ XVII ద్వారా సతీ సహగమనం చట్టవిరుద్ధమని ప్రకటించాడు. బాల్య వివాహాలు, కులవ్యవస్థలోని లోపాలపై పోరాడారు. అంటరానితనాన్ని అప్రజాస్వామ్యం, అమానుషమని పేర్కొన్నారు. వితంతు పునర్వివాహాల కోసం కృషి చేశారు. స్త్రీ, పురుషులకు సమాన హక్కులుండాలని ఆయన గట్టిగా కోరారు.


దేవుడికి, ప్రజలకు మధ్యవర్తులుగా ప్రత్యేక సౌకర్యాలు పొందుతున్న పురోహితుల తరగతిని రాజా రామ్మోహన్ రాయ్ నిరసించారు. రంగు, జాతి, కులాలకు అతీతంగా మానవులందర్నీ ఏకం చేయడానికి ఆయన కృషి చేశారు. కానీ బ్రిటిష్ పాలన పట్ల మాత్రం కొంత సానుకూల వైఖరితో ఉండేవారు. బ్రిటిష్ ప్రభుత్వం చేపట్టిన సాంఘిక సంస్కరణలు, ఆధునిక విద్యా సంస్థల ఏర్పాటును ప్రశంసించారు. అయితే బ్రిటిష్ ప్రభుత్వం పత్రికల స్వాతంత్య్రంపై పరిమితులు విధించడాన్ని, భారతీయులను ఉన్నత పదవులకు దూరంగా ఉంచడాన్ని వ్యతిరేకించారు. కలకత్తాలో హిందూ కళాశాల స్థాపనకు ప్రయత్నించారు.


రామ్మోహన్ రాయ్‌కు 'రాజా' అనే బిరుదును ఇచ్చిన మొగల్ చక్రవర్తి రెండో అక్బర్ కోరిక మేరకు రాయ్ 1830లో ఇంగ్లండ్ రాజైన నాలుగో విలియం ఆస్థానానికి వెళ్లాడు. బ్రిటిష్‌వారు ఇస్తున్న పింఛన్‌ను పెంచాలని రామ్మోహన్ రాయ్ ద్వారా మొగలు చక్రవర్తి కోరాడు. అక్కడ మూడు సంవత్సరాలు గడిపిన రాయ్ 1833, సెప్టెంబరు 27న బ్రిస్టల్ నగరంలో మృతి చెందారు.


బిరుదులు: రాజా (మొగలు చక్రవర్తి 2వ అక్బర్ ఇచ్చాడు), ఆధునిక భారత దేశ పితామహుడు, పయనీర్ ఆఫ్ ఇండియన్ జర్నలిజం, బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనమునకు పితామహుడు, ఆధినిక భారత నిర్మాత