న్యూఢిల్లీ: గూగుల్ డూడుల్ మారింది. చిప్కో ఉద్యమం 45వ వార్షికోత్సవం సందర్భంగా గూగుల్ ఈ ప్రత్యేక డూడుల్‌‌ను రూపొందించింది. చిప్కో ఉద్యమం అటవీ పరిరక్షణ కోసం అహింసా ఉద్యమాన్ని సూచిస్తుంది. 1970వ దశకంలో ప్రారంభమైన చిప్కో ఉద్యమం ప్రధాన లక్ష్యం  అడవుల్లో వ్యాపార, వాణిజ్య అవసరాల కోసం చెట్లను నరకకుండా చూడటం. చిప్కో ఉద్యమం శాంతియుత ప్రతిఘటన యొక్క గాంధీతత్వాన్ని అనుసరించడమే కాకుండా జీవావరణ సమతుల్యతను నాశనం చేసే ప్రజలపై తిరుగుబాటు చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చిప్కో ఉద్యమం గురించి ఒక్కమాటలో చెప్పాలంటే పర్యావరణ పరిరక్షణలో భాగంగా చెట్ల నరికివేతను అడ్డుకునే ఉద్యమమే ఈ చిప్కో ఉద్యమం.  చెట్లను కౌగిలించుకొని వాటిమీద పూర్తి హక్కులు మావేనని వ్యాపారస్తుల నుంచి వాటిని కాపాడే ఉద్యమమే చిప్కో ఉద్యమం. అసలు చిప్కో ఉద్యమం 18వ శతాబ్దంలో రాజస్థాన్‌లో మొదలైంది.


దీని చరిత్రను చూస్తే అప్పటి జోధ్‌పూర్ రాజు అభయ్‌సింగ్ పెద్ద నిర్మాణం చేపట్టదలచి బికనీర్‌కు సమీపంలో ఉన్న బిష్ణోయి ప్రాంతంలో ఖేజర్లీ చెట్లు నరుక్కొని తీసుకురమ్మని తన మనుషులకు ఆదేశిస్తాడు. రాజుగారి మనుషులు వచ్చారని తెలిసి అమృతాదేవి అనే సాధారణ గృహిణి, ఆమె పిల్లలు చెట్లను గట్టిగా హత్తుకొని చెట్లు నరకకుండా ఆపుతారు. ఆమెకు అండగా నిలిచిన వందల మంది పౌరులు ఆ చెట్లను కౌగిలించుకుంటారు. సైనికులు చెట్లని, వాటిని కౌగిలించుకుని ఉన్న బిష్ణోయిలతో సహా నరికేశారు. ఈ ఘటనకే ‘ఖేజర్లీ విషాదం’ అని పేరు. ఆ దుర్ఘటన జరిగిన స్థలంలో ఇప్పటికీ యేటా ఆ త్యాగమూర్తులకు నివాళి ఘటించే ఆచారం ఉంది. అప్పట్లో ప్రజలు అందరూ ప్రకృతిలో పశు, పక్ష్యాదులతో పాటు చెట్లను కాపాడటానికి కూడా ప్రాణాలను సైతం లెక్కచేయలేదు. వాటిని రక్షించారు. 


ఆధునిక భారతదేశంలో, చిప్కో ఉద్యమం ఏప్రిల్ 1973లో ఎగువ అలకానంద లోయలో ఉత్తర ప్రదేశ్‌లోని మండల్ గ్రామంలో ప్రారంభమై.. రాష్ట్రంలోని ఇతర హిమాలయ జిల్లాలకు వ్యాపించింది. ఈ చిప్కో ఉద్యమం ఒక స్పోర్ట్స్ వస్తువుల సంస్థకు అటవీ భూమిని కేటాయించాలనే ప్రభుత్వ నిర్ణయంతో ప్రేరేపించబడింది. కోపోద్రిక్తులైన గ్రామస్తులు అహింసా మార్గంలో చెట్లను నరకకుండా వృతాకారంలో ఏర్పడి అడ్డుకున్నారు.  స్థానిక మహిళలు ముందుండి నడిపిన ఈ చిప్కో ఉద్యమం చంద్ చండి ప్రసాద్ భట్ మరియు ఆయన సంస్థ గ్రామ స్వరాజ్య సంఘ్ నేతృత్వంలో జరిగింది.


ఉత్తరప్రదేశ్  ప్రేరణతో, చిప్కో ఉద్యమం దేశంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించింది. చిప్కో ఉద్యమానికి సంబంధించి ముఖ్యమైన వ్యక్తులుగా ధూమ్ సింగ్ నేగి, బచ్ని దేవి, గౌరా దేవి మరియు సుదేశ దేవిలను చెప్పుకోవచ్చు. 


గాంధేయవాది సుందర్లాల్ బహుగుణ చిప్కో ఉద్యమానికి ఒక దిశను ఇచ్చారు. చెట్లను నరకవద్దని, పర్యావరణ సమతుల్యం కాపాడాలని చెబుతూ ”వృక్షాలను కౌగలించుకోండి! వృక్షాలను కాపాడండి” అనే నినాదంతో జనాలలోకి వెళ్లారు. చిప్కో అంటే 'హత్తుకొను/కౌగిలించుకొను' అని అర్థం. ఆయన అప్పటి భారతదేశ ప్రధానమంత్రి ఇందిరా గాంధీకి విజ్ఞప్తి చేసి చెట్లను నరకకుండా కాపాడారు. 


'చిప్కో ఆందోళన్ కూడా ఒక పర్యావరణ-స్త్రీవాద ఉద్యమం వలె నిలుస్తుంది' అని గూగుల్ పేర్కొంది.


నేటి గూగుల్ డూడుల్‌ను స్వభు కోహ్లి మరియు విప్లోవ్ సింగ్‌లు రూపొందించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యావరణ రక్షకుల ధైర్యసాహసాలకు, ప్రయత్నాలకు ధన్యవాదాలు అని గూగుల్ తెలిపింది.