రామ్ పోతినేని కథానాయకుడిగా నటించిన ‘హలో గురు ప్రేమ కోసమే’ టీజర్ ఈ రోజే విడుదలైంది. రామ్‌-అనుపమ పరమేశ్వరన్‌ల మధ్య ఈ టీజర్‌లో సాగిన కెమిస్ట్రీకి ఇప్పటికే సినీ లవర్స్ బ్రహ్మరథం పడుతున్నారు. కాస్త చిలిపిగా.. కాస్త హాట్‌గా.. కాస్త వైవిధ్యంగా.. కాస్త రొమాంటిక్‌గా సాగిన ఈ టీజర్‌లో రామ్‌-అనుపమ పరమేశ్వరన్‌ల మధ్య జరిగే సరదా సన్నివేశాలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని  శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. దేవీశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండగా.. విజయ్ కె చక్రవర్తి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. విజే శేఖర్ కొరియోగ్రఫీ అందిస్తుండగా.. కార్తిక్ శ్రీనివాస్ ఎడిటింగ్ బాధ్యతలు స్వీకరించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ చిత్రంలో ప్రణీత, ప్రకాష్ రాజ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. రామ్ 2017లో నటించిన చివరి సినిమా "ఉన్నది ఒక్కటే జిందగీ" సూపర్ హిట్ చిత్రంగా నిలిచిన సంగతి తెలిసిందే. అంతకు ముందు ఆయన నటించిన హైపర్ చిత్రం పెద్దగా ఆడకపోయినా.. "ఉన్నది ఒక్కటే జిందగీ" మంచి చిత్రంగా ప్రేక్షకుల మదిలో స్థానాన్ని సంపాదించుకుంది. ఈ చిత్రంలో కూడా అనుపమ నటించింది. 


అ..ఆ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్, ప్రేమమ్, క్రిష్ణార్జున యుద్ధం, శతమానంభవతి, తేజ్ ఐ లవ్ యు చిత్రాల్లో నటించింది. సక్సెస్ ఫుల్‌గా ఈ హీరోయిన్ దూసుకుపోవడంతో ఈమె కాంబినేషన్‌లో వస్తున్న చిత్రాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంటోంది. అలాగే సినిమా చూపిస్త మావా, నేను లోకల్ లాంటి హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన త్రినాథ్ ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహించడంతో ఇప్పుడు ‘హలో గురు ప్రేమ కోసమే’ సినిమాపై ప్రేక్షకులకు మంచి అంచనాలే ఉన్నాయి.