నటీనటులు : సుమంత్ కుమార్, అంజు కురియన్, శివాజీ రాజా, సత్య, ప్రియదర్శిని రామ్, ఆదిత్యమీనన్, షఫీ తదితరులు
కెమెరా : బాల్‌రెడ్డి
సంగీతం : శ్రీచరణ్ పాకాల
కో-ప్రొడ్యూసర్ : మురళీకృష్ణ దబ్బుగుడి
నిర్మాతలు : జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీధర్
కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం : అనీల్ శ్రీ కంఠ
కొత్త కథలు, కొత్త క్యారెక్టర్లు సెలక్ట్ చేసుకుంటూ తనకుతానే పరీక్షలు పెట్టుకుంటున్నాడు హీరో సుమంత్. ఇదే ఫార్ములాతో సుమంత్ చేసిన సినిమా ఇదం జగత్. నెగెటివ్ షేడ్స్ ఉండే రిపోర్టర్ పాత్రలో సుమంత్ ఎలా నటించాడు? సినిమా రిజల్టేంటి? జీ ఎక్స్ క్లూజివ్ రివ్యూ

 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కథ :
రాత్రిళ్లు నిద్రపట్టకపోవడం అనే జబ్బుతో బాధపడుతుంటాడు నిషిత్(సుమంత్). అందుకే రాత్రివేళ పనిచేసే జాబ్ చూసుకుంటాడు. అలా నైట్ రిపోర్టర్ గా మారిన హీరో, రాత్రిళ్లు జరిగే క్రైమ్ ఘటనల్ని కెమెరాతో షూట్ చేసి, ఛానెల్ కు అమ్మి డబ్బు సంపాదిస్తుంటాడు. ఈ క్రమంలో విలువలు, మానవత్వం మరిచిపోయి కేవలం డబ్బే లక్ష్యంగా పనిచేస్తుంటాడు.
ఒక రోజు అర్థరాత్రి రోడ్డుపై జరిగిన ఓ హత్యను షూట్ చేస్తాడు హీరో. అందులో కొంత భాగాన్ని మాత్రమే మీడియాకు అమ్ముతాడు. పోలీసులకు కూడా ఇవ్వడు. ఆరోజు రాత్రి చనిపోయిన వ్యక్తి మహతి (అంజు కురియన్) తండ్రి. అతడ్ని ఎందుకు చంపారు, ఎవరు చంపారు అనే యాంగిల్ లో సుమంత్ వర్క్ చేస్తుంటాడు. ఈ క్రమంలో తనకు దొరికిన ప్రతి ఆధారాన్ని మీడియాకు డబ్బుకు అమ్మేస్తుంటాడు.
ఫైనల్ గా అదే కేసు సుమంత్ మెడకు చుట్టుకుంటుంది. విలన్లు ఏకంగా సుమంత్ తో పాటు అతడి స్నేహితుడు ఆనంద్ (సత్య)ను చంపాలని చూస్తారు. ఫైనల్ గా ఈ కేసు నుంచి సుమంత్ ఎలా బయటపడ్డాడు? హీరోయిన్ ప్రేమను ఎలా దక్కించుకున్నాడనేది స్టోరీ.

 


నటీనటుల పనితీరు :
మిక్స్ డ్ షేడ్స్ ఉన్న నిషిత్ అనే నైట్ రిపోర్టర్ పాత్రలో సుమంత్ మెప్పించాడు. ఇతడి యాక్టింగ్ లో చెప్పుకోదగ్గ మెరుపులు లేవు. అలా అని మరీ డిసప్పాయింట్ చేసే యాక్టింగ్ కూడా కాదు. హీరోయిన్ గా అంజు కురియన్ మాత్రం ఫెయిల్. ఆమె లుక్స్ బాగాలేవు. యాక్టింగ్ కూడా అంతంతమాత్రం. హీరో ఫ్రెండ్ పాత్ర పోషించిన సత్యను తెరపై చూసిన వెంటనే నవ్విస్తాడని అంతా ఎక్స్ పెక్ట్ చేశారు. కానీ సత్యది ఇందులో నవ్వించే పాత్ర కాదు, కేవలం నటించే పాత్ర. మిగతా పాత్రలు పోషించిన శివాజీరాజా, ప్రియదర్శిని రామ్, షఫి వాళ్ల పరిథి మేరకు నటించారు.

 


టెక్నీషియన్స్ పనితీరు :
సినిమాకు పనిచేసిన ఏ ఒక్క టెక్నీషియన్ సరైన అవుట్ పుట్ ఇవ్వలేదు. బడ్జెట్ లిమిటేషన్స్ వల్ల అవుట్ పుట్ కూడా అలానే వచ్చింది. గతంలో మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన శ్రీచరణ్ పాకాల ఈసారి డిసప్పాయింట్ చేశాడు. గ్యారీ ఎడిటింగ్ అక్కడక్కడ బాగుంది. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వ విభాగాల్ని డీల్ చేసిన అనీల్ శ్రీకంఠం అంతగా మెప్పించలేకపోయాడు. ఇతడు సెలక్ట్ చేసుకున్న కాన్సెప్ట్ బాగుంది కానీ దాన్ని కథగా మలచడంలో తడబడ్డాడు. క్రైమ్ థ్రిల్లర్ కు ఉండాల్సిన ఆసక్తికరమైన ట్విస్టులు, సస్పెన్స్ ఈ సినిమాలో లోపించాయి. డైలాగ్స్ మరీ పేలవంగా ఉన్నాయి.

 


జీ మూవీ రివ్యూ :
ప్రతి మనిషిలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కానీ హీరోల్ని మాత్రం మంచిగానే చూపించారు. మనిషిలో ఉన్న చెడును హీరోలో చూపించరు. అర్జున్ రెడ్డి నుంచి ఈ స్టయిల్ బాగా మారింది. హీరోను ఎంత చెత్తగా చూపిస్తే అంత గొప్ప. ఇదంజగత్ లో కూడా సుమంత్ ను అలానే చూపించారు. సుమంత్ పోషించిన నిషిత్ పాత్రలో మంచి, చెడు రెండూ కనిపిస్తాయి. కొన్ని చోట్ల మంచిగా, మరికొన్ని చోట్ల నెగెటివ్ షేడ్స్ లో కనిపిస్తాడు సుమంత్. ఈ క్యారెక్టరైజేషనే సినిమాకు మెయిన్ హైలెట్.


ఇది తప్పిస్తే మూవీలో ఇంకేం లేదు. మీడియాలో ఉన్న నెగెటివ్ ఎలిమెంట్స్ ను చూపించాలనుకున్న దర్శకుడు, ప్రస్తుతం న్యూస్ ఛానెల్స్ లో జరుగుతున్న అలాంటి కొన్ని మైనస్ పాయింట్స్ ను బాగానే పిక్ చేసుకున్నాడు. కానీ అందరికీ కనెక్ట్ అయ్యేలా ప్రజెంట్ చేయలేకపోయాడు. ఎమోషన్ ఉంటేనే న్యూస్ అయినా క్లిక్ అవుతుందంటూ హీరోతో తప్పులు చేయించే డైరక్టర్, అదే ఎమోషన్ ను సినిమాలో ఎలివేట్ చేయడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. దీనికి తోడు నటీనటుల హావభావాలు మరింత ఇబ్బందిపెడతాయి. తండ్రి చనిపోయిన సన్నివేశంలో హీరోయిన్ ఏడుస్తుంటే మనకు నవ్వొస్తుంది. ఇంత సీనియారిటీ ఉన్న సుమంత్ కూడా కొన్ని సన్నివేశాల్లో హ్యాండ్సప్ అన్నాడంటే దానికి కారణం దర్శకుడు, టెక్నికల్ టీమ్ మాత్రమే.
 


ప్లాట్ బాగున్నప్పటికీ హాఫ్-బేక్డ్ గా తెరకెక్కింది ఈ సినిమా. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సాంగ్స్, సెట్.. అంతెందుకు చివరికి హీరోకు వేసిన దుస్తుల్లో కూడా లో-బడ్జెట్ కనిపించిందంటే సినిమా అవుట్ పుట్ ఏ రేంజ్ లో ఉందో అర్థంచేసుకోవచ్చు. సినిమాటోగ్రఫీ ఏ ఒక్క యాంగిల్ లో మెప్పించదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పెద్దగా ఎక్కదు. ఫైట్స్ అయితే మరీ నాసిరకం. దీనికితోడు దర్శకత్వ లోపాలు ఉండనే ఉన్నాయి


హీరోను నైట్ రిపోర్టర్ అని చెప్పడం కోసం అతడికి ఏకంగా ఓ జబ్బు ఉన్నట్టు చూపించడం మాత్రం నిజంగా దారుణం. ఎంతోమంది రిపోర్టర్లు ఎలాంటి జబ్బులు లేకుండానే రాత్రిళ్లు పనిచేసి, పగలు పడుకుంటున్నారు.
 


హీరో రోగానికి, సినిమా కథకు అస్సలు సంబంధం ఉండదు. ఆ ఎపిసోడ్ కూడా తీసేసి 2 గంటల సినిమాను ఇంకాస్త ముందే ముగించి ఉంటే బాగుండేది. ఇలాంటి లోపాల్ని పక్కనపెడితే మీడియాలో ఉన్న లొసుగుల్ని, నెగెటివ్ షేడ్స్ ను ఉన్నది ఉన్నట్టు రియలిస్టిక్ గా చూపించిన విధానం బాగుంది. కెమెరా లైటింగ్ కోసం శవాన్ని కూడా కాస్త జరిపి షూట్ చేయడం లాంటి సన్నివేశాలు మెప్పిస్తాయి. ఓవరాల్ గా క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఇదంజగత్ లో క్రైం ఉంది కానీ థ్రిల్ లేదు.


బాటమ్ లైన్ ఇదేం జగత్!
రేటింగ్ 2/5