మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా)లో మరో వివాదం తలెత్తింది. ఇటీవలే 'మా' సిల్వర్‌ జూబ్లీ వేడుకల్లో నిధులు దుర్వినియోగం జరిగాయని ఆరోపణలు రావడం కలకలం రేపింది. దీనిని ‘మా’ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. సోమవారం సమావేశమైన 'మా' కార్యవర్గం.. మీడియాతో మాట్లాడింది. ఈ సమావేశానికి ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా, పరుచూరి వెంకటేశ్వరరావు, శ్రీకాంత్‌ హాజరయ్యారు. ఈ అంశంపై గత శనివారం ఇప్పటికే ఒకసారి సమావేశం నిర్వహించారు. ఆరోపణలపై విచారణ కమిటీ వేయడానికి ప్రతిపాదించగా.. మెజార్టీ సభ్యులు వ్యతిరేకించినట్లు తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సమావేశం అనంతరం శివాజీరాజా, శ్రీకాంత్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘మా’ నిధులు దుర్వినియోగం అయ్యాయంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పారు. అవినీతిని నిరూపిస్తే తన ఆస్తి మొత్తం రాసిస్తానని శివాజీరాజా సవాల్‌ చేశారు. సిల్వర్‌ జూబ్లీ వేడుకలకు ఒప్పందం ప్రకారమే నిధులు వచ్చాయని.. అవినీతికి పాల్పడినట్లు ఎవరైనా రుజువుచేస్తే అసోసియేషన్‌ నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని శ్రీకాంత్‌ అన్నారు. త్వరలో ఎన్నికలు వస్తుండటంతో.. ఇలా అర్థరహిత ఆరోపణలతో ప్రచారం పొందాలని కొందరు భావిస్తున్నారని పాలకవర్గం తెలిపింది. చిరంజీవి అతిథిగా వచ్చిన 'మా' రజతోత్సవానికి కోటి రూపాయలు వచ్చాయని, త్వరలో మహేష్‌తో కార్యక్రమం చేపట్టబోతున్నామని పరుచూరి వెంకటేశ్వరరావు అన్నారు.