ఝాన్సీ రాణి లక్ష్మీబాయి... 1857లోనే బ్రిటిషర్ల ఈస్ట్ ఇండియా కంపెనీపై తిరుగుబాటు ప్రకటించి, పుట్టిన గడ్డకు స్వేచ్ఛను ప్రసాదించడం కోసం తెల్లవారిపైనే యుద్ధం ప్రకటించిన నారీమణి. గొంతులో ప్రాణం ఉన్నంతవరకు ఎవరికీ తలవంచని గొప్ప చరిత్ర కలిగిన మహారాణి. అందుకే ఆమె జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన ''మణికర్ణిక: ఝాన్సీ రాణి లక్ష్మీ బాయి'' బయోపిక్ సినిమా కూడా అంతే గొప్ప అనుభూతిని కలిగించింది. జనవరి 25న విడుదలైన 'మణికర్ణిక: ఝాన్సీ రాణి లక్ష్మీ బాయి' మూవీకి ఆడియెన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. 1857 సిపాయిల తిరుగుబాటుకు నేతృత్వం వహించిన ఝాన్సి రాణి లక్ష్మీబాయి విషయంలో చాలామందికి తెలియని ఓ కోణం ఈ సినిమా విడుదల తర్వాత ప్రస్తావనకొస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెల్లోళ్లపై తిరుగుబాటు పోరాటంకన్నా మూడేళ్లు ముందుగా ఆస్ట్రేలియాకు చెందిన జాన్ లాంగ్ ఓ ప్రముఖ న్యాయవాది, రచయిత రాణి లక్ష్మీబాయి తరపున ఈస్ట్ ఇండియా కంపెనీపై 1854లో ఓ పిటిషన్ దాఖలు చేశారు. ఆస్ట్రేలియాలో పుట్టి పెరిగిన జాన్ లాంగ్ ఆ తర్వాత భారత్‌లోనే వుంటూ ఈస్ట్ ఇండియా కంపెనీపై తన న్యాయ పోరాటాన్ని సాగించారు. ఈస్ట్ ఇండియా కంపెనీ అరాచకాలకు, అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడే భారతీయులకు అండగా నిలవడంలో జాన్ లాంగ్ ఎప్పుడూ ముందుండే వారు. అలా రాణి లక్ష్మీబాయి సైతం చట్టరీత్యా సాగించిన న్యాయ పోరాటానికి ఒక న్యాయవాదిగా జాన్ లాంగ్ తన సహకారాన్ని అందించారు.


2014 నవంబర్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన సందర్భంలో అక్కడి ప్రధాని టోని అబ్బాట్‌ని కలిశారు. అదే సందర్భంలో 1854లో ఆస్ట్రేలియన్ న్యాయవాది జాన్ లాంగ్ దాఖలు చేసిన ఆ పిటిషన్ కాపీని టోనికి మోదీ అందజేశారు. అంతేకాకుండా ఉత్తరాఖండ్‌లోని ముస్సోరిలో వున్న ఓ చర్చిలో జాన్ లాంగ్ వివాహం చేసుకున్నప్పటి సర్టిఫికెట్, ఫోటోలు వంటి జ్ఞాపకాలను సైతం టోనికి అందించారు.