ఒకే వేదికపై బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్..?
జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘అరవింద సమేత.. వీర రాఘవ` చిత్రం సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో నిర్మాతలు విజయోత్సవ సభను నిర్వహించబోతున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘అరవింద సమేత.. వీర రాఘవ' చిత్రం సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో నిర్మాతలు విజయోత్సవ సభను నిర్వహించబోతున్నారు. అయితే ఈ విజయోత్సవ వేడుకలకు నందమూరి బాలకృష్ణ, కల్యాణ్‌రామ్‌లు రాబోతున్నట్లు సమాచారం. ఇదే నిజమైతే.. బాలయ్య, ఎన్టీఆర్ కలిసి ఒకే వేదికను పంచుకోవడం అనేది టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తుంది అనడంలో సందేహం లేదు. ఎందుకంటే వారిద్దరూ అలా వేదికను పంచుకొని కొన్ని సంవత్సరాలు అవుతోంది. గతంలో బాలయ్య నటించిన ‘సింహా’ సినిమా విడుదల అయినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా వచ్చారు. ఆ తర్వాత వారిద్దరూ వేదికపై కలవడం కుదరలేదు.
ఈ విషయం ఇలా ఉండగా.. ప్రస్తుతం నందమూరి కళ్యాణ్ రామ్.. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో తన తండ్రి హరికృష్ణ పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే చిత్రంలో ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో విద్యా బాలన్ నటిస్తున్నారు. అక్కినేని నాగేశ్వరరావు పాత్రను సుమంత్ పోషిస్తుండగా.. రానా దగ్గుబాటి నారా చంద్రబాబు నాయుడి పాత్రను పోషిస్తున్నారు. అలాగే హెచ్ ఎం రెడ్డి పాత్రలో కైకాల సత్యనారాయణ, శ్రీదేవి పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్, సావిత్రి పాత్రలో నిత్యా మీనన్ నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఇక అరవింద సమేత సినిమా విషయానికి వస్తే.. తొలి వారాంతానికే ఈ సినిమా వంద కోట్ల క్లబ్బులో చేరిపోయింది. దీంతో సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో అయిదు సార్లు వంద కోట్ల క్లబ్బులో చేరిన ఏకైక కథానాయకుడిగా జూనియర్ ఎన్టీఆర్ సరికొత్త రికార్డును నమోదు చేశాడు. హైదరాబాదులోని శిల్పకళావేదికలో ఈ ఆదివారం ఈ చిత్ర విజయోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా ప్లాన్ చేయనున్నట్లు నిర్మాతలు చెబుతున్నారు. హారికా హాసిని క్రియేషన్స్ పతాకంపై నిర్మించిన ‘అరవింద సమేత.. వీర రాఘవ' చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించడం జరిగింది.