Perfume Movie: స్మెల్ బేస్డ్ థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌తో `పర్‌ఫ్యూమ్`.. ఆడియన్స్‌ను మెప్పించిందా..?
Perfume Movie Review and Rating: సరికొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కిన పర్‌ఫ్యూమ్ మూవీ నేడు ఆడియన్స్ ముందుకు వచ్చింది. జేడీ స్వామి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో చేనాగ్, ప్రాచీ థాకర్ హీరోహీరోయిన్స్‌గా నటించారు. ఈ సినిమా ఆడియన్స్‌ను మెప్పించిందా..? రివ్యూ ఎలా ఉందో చూద్దాం..
Perfume Movie Review and Rating: స్మెల్ బేస్డ్ థ్రిల్లింగ్ కాన్సెప్ట్ అనే సరికొత్త కాన్సెప్ట్‌తో శ్రీమాన్ మూవీస్ ప్రజెంట్స్, మిత్రా మూవీ మేకర్స్, ఫరెవర్ ఫ్రెండ్స్ బ్యానర్‌పై తెరకెక్కిన మూవీ పర్‌ఫ్యూమ్. చేనాగ్, ప్రాచీ థాకర్ జంటగా నటించిన ఈ చిత్రానికి జేడీ స్వామి దర్శకత్వం వహించారు. జె.సుధాకర్, శివ.బి, రాజీవ్ కుమార్.బి, లావురి శ్రీనివాస్, రాజేంద్ర కనుకుంట్ల, శ్రీధర్ అక్కినేని (అమెరికా) లు సంయుక్తంగా ఈ "పర్‌ఫ్యూమ్" చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం నేడు (నవంబర్ 24న) గ్రాండ్‌గా విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం పదండి.
కథ ఏంటంటే..?
సిటీలో స్మెల్ అబ్‌సెషన్ వ్యాధితో బాధపడే సైకో వ్యాస్ (చేనాగ్) తిరుగుతుంటాడు. అతనికి అమ్మాయి స్మెల్ తగిలితే చాలు ఓ రకంగా మారిపోతాడు. అమ్మాయిలను వాసన చూస్తూ బాగా ఇబ్బంది పెడుతుంటాడు. సిటీలో ఇలాంటి కేసులు ఎక్కువగా కావడంతో.. వెంటనే ఆ సైకోని పట్టుకోకపోతే ప్రమాదకరమైన కిల్లర్‌గా మారుతాడని ACP దీప్తి (అభినయ) అనుకుంటారు. అదే సమయంలో వ్యాస్ కోసం లీలా (ప్రాచీ థాకర్) వెతుకుతుంటుంది. ఆమెకు ఓ సారి వ్యాస్ కనిపించడంతో వెంటనే లిప్ కిస్ ఇస్తుంది. దీంతో వ్యాస్ ఆమె మైకంలో ముగినిపోతాడు. లీలా వివరాలు తెలుసుకుని వెళ్తాడు. అక్కడ అందరి ముందు ఆమెకు ముద్దు పెడతాడు. దీంతో అక్కడ పెద్ద రచ్చ జరుగుతుంది. వ్యాస్‌ను లీలా అవమానపరుస్తుంది. అవమానం భరించలేక లీలా మీద పగ తీర్చుకోవాలని ఆమెను వ్యాస్ కిడ్నాప్ చేస్తాడు. ఆ తరువాత ఆమెను ఏం చేశాడు..? లీలా బ్యాక్ గ్రౌండ్ ఏంటి..? వ్యాస్ ఎందుకు సైకోలా ప్రవర్తిస్తున్నాడు.. వ్యాస్‌ను పోలీసులు ఎలా పట్టుకున్నారు..? చివరకు వ్యాస్-లీలా కథ ఎలాంటి మలుపులు తిరిగిందో తెలుసుకోవాలంటే పర్‌ఫ్యూమ్ మూవీ చూడాల్సిందే.
ఎవరు ఎలా నటించారంటే..?
వ్యాస్ క్యారెక్టర్‌లో చేనాగ్ పరాయక ప్రవేశం చేశాడు. స్క్రీన్‌పై ఓ కొత్త హీరో అనేలా ఎక్కడా అనిపించకుండా తన నటనతో మెప్పించాడు. ఎలాంటి తడబాటు లేకుండా అవలీలగా నటించేశాడు. అన్ని రకాల ఎమోషన్స్‌ను పండిస్తూ.. సైకోగా పాత్రలో ఒదిగిపోయాడు. యాక్షన్ సీన్స్‌లో నేచురల్‌గా యాక్ట్ చేశాడు. లీలా పాత్రలో ప్రాచీ నటన ఆకట్టుకుంటుంది. అందం, నటనతో ఆడియన్స్‌ను కట్టిపడేస్తుంది. ఇక ACP దీప్తిగా అభినయ తన పాత్ర పరిధి మేరకు నటించింది. బాబా, తాజ్ పాత్రలకు బాగానే ప్రాధాన్యం ఉంది.
విశ్లేషణ విషయానికి వస్తే..
సరికొత్త కాన్సెప్ట్‌తో చిత్రాన్ని రూపొందించినప్పుడు ఆడియన్స్‌కు కనెక్ట్‌లా తీయడం అంతా ఈజీ కాదు. ఆ కాన్సెప్ట్‌కు, చూపించిన ఎమోషన్స్‌కు ప్రేక్షకులకు నచ్చితే హిట్ కొట్టినట్లే. పర్‌ఫ్యూమ్ మూవీ విషయంలో డైరెక్టర్ సక్సెస్ అయినట్టుగా కనిపిస్తుంది. హీరో బాధను ప్రేక్షకులు ఫీలయ్యేలా చూపించడంతో ఎక్కువగా కనెక్ట్ అవుతారు. అయితే చివరి వరకు ఆ ఎమోషన్‌ను బోర్ కొట్టించకుండా తీసుకెళ్లడంతో కాస్త తడబడినట్టుగా అనిపించినా.. బలమైన సన్నివేశాలతో కవర్ అవుతుంది.
ప్రథమార్ధం చూసిన తరువాత సెకండాఫ్‌పై మరింతగా అంచనాలు పెరుగుతాయి. హీరో ఏం చేస్తాడా..? అని అందరిలోనూ ఆసక్తి నెలకొంటుంది. ఎవరూ ఊహించని రీతిలో కథ సాగడంతో థ్రిల్‌కు గురవుతారు. సెకండాఫ్‌లో హీరో క్యారెక్టర్ పూర్తిగా మారిపోతుంది. ఫ్లాష్ బ్యాక్ సీన్ అస్సలు ఊహించని విధంగా ఉంటాయి. హీరోకి ఆ సమస్యకి ఉన్న బ్యాక్‌గ్రౌండ్‌ను తెరపై చక్కగా చూపించారు. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్‌లు నచ్చుతాయి.
సాంకేతిక పరంగా పాటలు ఓకే అనిపిస్తాయి. మాటలు గుర్తుండిపోతాయి. నగ్న సత్యాలు చెప్పినట్టుగా అనిపిస్తాయి. కెమెరావర్క్ బాగుంది. నిడివి సమస్యగా అనిపించదు. సాంకేతిక విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించినట్టుగా కనిపిస్తుంది.
రేటింగ్: 2.75