ప్రధాని నరేంద్ర మోదీ యోగా వీడియోపై ప్రకాష్ రాజ్ సెటైర్లు
మోదీ యోగా వీడియోపై ప్రకాష్ రాజ్ సెటైర్లు
కేంద్రం తీరుపై ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తూ, సోషల్ మీడియా ద్వారా బీజేపీ నేతలను ఎండగట్టడంలో ఎప్పటికపుడు ముందుంటున్న ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి ప్రధాని నరేంద్ర మోదీపై అదే సోషల్ మీడియా ద్వారా విరుచుకుపడ్డారు. ఇటీవల క్రికెటర్ విరాట్ కోహ్లీ చేసిన ఫిట్నెస్ ఛాలెంజ్‌కి స్పందిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ పోస్ట్ చేసిన ఓ యోగా వీడియోపై తనదైన స్టైల్లో స్పందించిన ప్రకాష్ రాజ్.. ముందుగా ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ తీరుపై నిరసన చేస్తోన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మొర వినిపించుకోండి అని ట్వీట్ చేశారు. 'డియర్ సుప్రీం లీడర్.. మీరు మీ ఫిట్నెస్ ఛాలెంజ్, యోగా ఎక్సర్‌సైజెస్‌తో బిజీగా ఉన్నారని మాకు తెలుసు కానీ ఒక్క క్షణంపాటు చుట్టూ ఏం జరుగుతుందో చూసి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కి సహకరించాల్సిందిగా అక్కడి ఐఏఎస్ అధికార యంత్రాగానికి చెప్పగలరా' అని తన ట్వీట్లో పేర్కొన్నారు.
బాగా పనిచేస్తోన్న కేజ్రీవాల్‌కి సహకరించడమే కాకుండా మీ విధులు కూడా మీరు నిర్వర్తిస్తే బాగుంటుంది కదా అంటూ తనదైన స్టైల్లోనే ప్రధాని మోదీపై సెటైర్లు వేశారు ప్రకాష్ రాజ్.