కేసీఆర్ లాంటి హీరోను నేనెక్కడా చూడలేదు : రాంగోపాల్ వర్మ
కేసీఆర్ లాంటి హీరోను నేనెక్కడా చూడలేదు : రాంగోపాల్ వర్మ
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తాను 'కేసీఆర్ టైగర్' అనే బయోపిక్ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించి సంచలనం సృష్టించిన ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ.. తాజాగా ఆ సినిమాకు సంబంధించి మరిన్ని ఆసక్తికరమైన అంశాలను మీడియాకు వెల్లడించారు. తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేసీఆర్ గురించి వర్మ మాట్లాడుతూ.. కేసీఆర్‌లో తనకు జాతిపిత మహాత్మ గాంధీ కనిపించారని అన్నారు. బ్రిటీషర్ల నుంచి దేశానికి విముక్తి కల్పించడం కోసం ఆనాడు ఆ గాంధీ అహింసామార్గాన్ని ఎంచుకున్నట్టుగానే ఈనాడు ఆంధ్రా నుంచి తెలంగాణను వేరు చేసి ప్రత్యేక రాష్ట్రం సాధించుకోవడానికి కేసీఆర్ కూడా అహింసామార్గాన్నే ఎంచుకున్నారని వర్మ అభిప్రాయపడ్డారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ ఉద్యమాన్ని విస్మరించనని, ముఖ్యమైన ఘట్టాలను తప్పకుండా చూపిస్తానని వర్మ చెప్పారు. ఇది అన్ని బయోపిక్ సినిమాలలాగా హీరో ఎక్కడ పుట్టాడు ? ఎక్కడ చదువుకున్నాడని కాకుండా ఆయన గొప్పోడు ఎలా అయ్యాడనే విషయాన్ని కేసీఆర్ బయోపిక్ సినిమాలో చూపిస్తానని వర్మ స్పష్టంచేశాడు. రాజకీయాల్లో కేసీఆర్ లాంటి హీరోను తానెక్కడా చూడలేదని కేసీఆర్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. తనలా కేసీఆర్ బయోపిక్‌ను ఇంకెవ్వరూ తెరకెక్కించలేరని ధీమా వ్యక్తంచేసిన రాంగోపాల్ వర్మ... తాను కేసీఆర్ బయోపిక్ సినిమాను తెరకెక్కిస్తున్న విషయాన్ని కేసీఆర్‌కు చెప్పలేదని చెప్పి మరో బాంబు పేల్చారు.
రాంగోపాల్ వర్మ వెల్లడించిన విషయాల ప్రకారం ఆయన తెరకెక్కిస్తున్న సినిమాకు కేసీఆర్ నుంచి అనుమతి తీసుకోలేదనే అర్థమవుతోంది. మరి తన అనుమతి లేకుండానే తన గురించి ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారని తెలిసిన తర్వాత కేసీఆర్ ఎలా రియాక్ట్ అవుతారోననేది మరింత ఆసక్తికరంగా మారింది.