బాహుబలి, ఘాజి చిత్రాలతో బాలీవుడ్‌లోనూ భారీ స్టార్‌డమ్ సంపాదించుకున్న రానా దగ్గుబాటి నటిస్తున్న అప్ కమింగ్ సినిమాల్లో 1945 కూడా ఒకటి. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆగిపోయినట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు తమ వద్ద వున్న డబ్బును వెచ్చించి సినిమా తెరకెక్కించిన నిర్మాతలు ప్రస్తుతం తదుపరి షెడ్యూల్స్ కోసం రుణం వేటలో పడ్డారని, ఆ రుణం అందే వరకు సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు కనిపించడం లేదని మీడియా కథనాలు స్పష్టంచేస్తున్నాయి. వాస్తవానికి 2018 వేసవి సెలవుల్లోనే ఈ సినిమా విడుదలవుతుందనే టాక్ వినిపించినప్పటికీ.. అప్పుడు అలా జరగకపోవడానికి కారణం ఆ సినిమాను వేధిస్తున్న ఆర్థిక ఇబ్బందులే అనేది ఆ కథనాల సారాంశం.


సత్య శివ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో రానా సరసన రెజినా క్యాసండ్రా జంటగా నటిస్తోంది. 1945లో దేశ విభజనకు ముందున్నప్పటి పరిస్థితుల నేపథ్యంతో, ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీలో ఓ సైనికుడి పాత్రలో రానా కనిపించనున్నాడు. తమిళంలో 'మదై తిరంతు' అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో నాజర్, సత్యరాజ్, ఆర్.జే. బాలాజీ వంటి నటులు ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.