ముంబైలో సల్మాన్ ఖాన్‌కి ఘన స్వాగతం! ఫోటోలు
ముంబైలో ఎయిర్ పోర్టు బయట మేనల్లుడు అహిల్‌ని చేతుల్లోకి తీసుకుంటున్న సల్మాన్ ఖాన్
రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ సెంట్రల్ జైలు నుంచి బెయిల్‌పై విడుదలై ముంబైకి చేరుకున్న సల్మాన్ ఖాన్‌కి ముంబైలో విమానాశ్రయం వద్ద, అతడి నివాసం వద్ద అభిమానుల నుంచి ఘన స్వాగతం లభించింది. కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో శనివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో జోధ్‌పూర్ సెంట్రల్ జైలు నుంచి విడుదలైన సల్మాన్ ఖాన్ అక్కడి నుంచి నేరుగా జోధ్‌పూర్ విమానాశ్రయానికి వెళ్లారు.
జోధ్‌పూర్ పోలీసులే భారీ బందోబస్తు మధ్య సల్మాన్‌ని జోధ్‌పూర్ ఎయిర్ పోర్టు వరకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి సల్మాన్ మేనేజర్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చార్టర్డ్ ఫ్లైట్‌లో ముంబైకి చేరుకున్న సల్మాన్ ఖాన్‌కి ఎయిర్ పోర్టు బయట అభిమానుల నుంచి అడుగడుగునా ఘన స్వాగతం లభించింది.
ఎయిర్ పోర్టుకి చేరుకున్న సల్మాన్‌ని రిసీవ్ చేసుకునేందుకు అతడి కుటుంబసభ్యులు విమానాశ్రయానికి వెళ్లారు. ఎయిర్ పోర్టు నుంచి బయటికి వచ్చీ రావడంతోనే తన మేనల్లుడు ( అర్పితా ఖాన్ తనయుడు ) అహిల్‌ని చేతుల్లోకి తీసుకున్న సల్మాన్ ఖాన్ అక్కడి నుంచి తన కారువైపు అడుగులేయడం ఫోటోల్లో చూడవచ్చు.
జోధ్‌పూర్‌కి సమీపంలోని కంకని గ్రామ అటవీ ప్రాంతంలో 1988, అక్టోబర్‌లో కృష్ణ జింకలను వేటాడి చంపిన కేసులో సల్మాన్‌ని ప్రధాన నిందితుడిగా తేల్చిన జోధ్‌పూర్ కోర్టు.. అతడికి ఐదేళ్ల జైలు శిక్ష, రూ.10,000 జరిమానా విధించిన సంగతి తెలిసింది. గురువారం జోధ్‌పూర్ కోర్టు తీర్పు వెల్లడించిన అనంతరం కోర్టు ఆదేశాల మేరకు జోధ్‌పూర్ పోలీసులు సల్మాన్‌ని జోధ్‌పూర్ సెంట్రల్ జైలుకి తరలించారు.
దీంతో గురువారం, శుక్రవారం జోధ్‌పూర్ సెంట్రల్ జైలులోనే వున్న సల్మాన్ ఖాన్‌కి శనివారం జోధ్‌పూర్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సల్మాన్ ఖాన్ నుంచి రూ.50,000 వ్యక్తిగత పూచీకత్తుతోపాటు అతడి తరపున మరో ఇద్దరు బయటి వ్యక్తుల నుంచి చెరో రూ.25,000 పూచీకత్తు సమర్పించాల్సిందిగా షరతు విధిస్తూ కోర్టు ఈ బెయిల్ మంజూరు చేసింది. అంతేకాకుండా కోర్టు అనుమతి లేనిదే సల్మాన్ దేశం విడిచివెళ్లరాదని కోర్టు స్పష్టంచేసింది.