ఈ విషయంలో మానవత్వాన్ని చాటుకున్న తొలి హీరో.. సంపూర్ణేష్ బాబు
మరోసారి టాలీవుడ్ నటుడు సంపూర్ణేష్ బాబు తన దానగుణం చాటుకున్నారు.
మరోసారి టాలీవుడ్ నటుడు సంపూర్ణేష్ బాబు తన దానగుణం చాటుకున్నారు. శ్రీకాకుళం జిల్లా తిత్లీ తుఫాన్ వల్ల చాలా కోల్పోయిందన్న విషయం తనను కలచివేసిందని.. అందుకే తనవంతు సహాయంగా రూ.50,000 ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి అందిస్తున్నానని ఆయన అన్నారు. అలాగే అందరూ తమ వంతు సహాయాన్ని ఏపీ రాష్ట్రంలో తిత్లీ బాధితులకు అందివ్వాలని ఆయన కోరారు. సిక్కోలు లాంటి ప్రాంతాలు చాలా నష్టపోయాయని.. ఈ విషయాన్ని తన ఉత్తరాంధ్ర మిత్రుల ద్వారా తెలుసుకున్నానని.. అందుకే సహాయం చేయడానికి ముందుకొచ్చానని సంపూర్ణేష్ అన్నారు.
ఈ విషయాన్ని ఆయన తన అభిమానులతో ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. అయితే ఈసారి తిత్లీ తుఫాన్ ఘటన జరిగాక.. తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి స్పందించిన తొలి వ్యక్తి సంపూర్ణేష్ బాబు కావడంతో సోషల్ మీడియాలో తన పై ప్రశంసలు వెల్లువలా కురుస్తున్నాయి. గతంలో కూడా ప్రత్యేక హోదా కోసం జరిగిన ఉద్యమంలో భాగంగా తన మద్దతును ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆయన అందించారు.
హృదయకాలేయం చిత్రంతో టాలీవుడ్‌లో హీరోగా పరిచయమైన సంపూర్ణేష్ బాబు.. ఆ తర్వాత కొబ్బరిమట్ట, వైరస్, సింగమ్ 123 లాంటి చిత్రాలలో నటించారు. పలు చిత్రాలలో సహాయ పాత్రలు కూడా పోషించారు. బిగ్ బాస్ తొలి సీజన్ సందర్భంగా ఆ రియాలిటీ షోకి పార్టిసిపెంట్‌గా కూడా వెళ్లారు. కానీ తర్వాత అదే షో నుండి తప్పుకున్నారు. బర్నింగ్ స్టార్‌గా పాపులర్ అయిన సంపూర్ణేష్ బాబు.. బందిపోటు, కరెంట్ తీగ లాంటి చిత్రాలలో అతిథి పాత్రలు కూడా పోషించారు.