ఈ మధ్యకాలంలో నకిలీ వార్తలు, తప్పుడు సందేశాలు వాట్సాప్‌లో బాగా ప్రచారం అవుతున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ విషయాన్ని వాట్సాప్ సీరియస్‌గా తీసుకోవాలని.. తొలిసారిగా తప్పుడు వార్త గానీ సందేశం గానీ ఏ మొబైల్ నెంబరు ద్వారా జనరేట్ అయ్యిందో తెలుసుకొని తమకు అందించాలని.. అలాంటి వారిపై తాము చర్యలు తీసుకుంటామని ఐటి శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వాట్సాప్ అధినేత క్రిస్ డేనియల్స్‌తో భేటీ అయిన రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ, భారతదేశంలో డిజిటల్ విప్లవం ఊపందుకోవడంలో వాట్సాప్ ప్రధాన పాత్ర పోషించిందని.. అయితే ఈ వాట్సాప్‌ను వేదికగా చేసుకొని చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారు ఎక్కువయ్యారని.. వీరిని కట్టడి చేయడానికి లోకల్ సిబ్బంది సహాయం కూడా తీసుకోవాలని ఆయన కోరారు. భారతీయ చట్టాలకు వ్యతిరేకంగా వెళ్లే ఏ విషయాలను కూడా ప్రభుత్వం ఉపేక్షించదని రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. వాట్సాప్ ద్వారా భారతదేశంలో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి వాట్సాప్ కూడా సహకరించాలని ఆయన కోరారు. 


"ఇది రాకెట్ సైన్స్ కాదు. తప్పుడు వార్తలు ఎక్కువమందికి చేరకుండా ఆపేందుకు తగ్గ సాంకేతికత మన దగ్గర ఉందని అనుకుంటున్నాను. వాట్సాప్ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలి. పరిస్థితులు చేయి దాటితే మీరే సమాధానం చెప్పాల్సి ఉంటుంది" అని రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ఇటీవలే భారత ప్రభుత్వ హెచ్చరికతో వాట్సాప్ ఫార్వార్డింగ్ మెసేజ్ల సంఖ్యను కేవలం అయిదు నెంబర్లకే పరిమితం చేసింది.


గతంలో వాట్సాప్‌లో వస్తున్న తప్పుడు వార్తల విషయంలో ఆ సంస్థ యాజమాన్యం తక్షణ చర్యలు తీసుకొని..రూమర్స్‌కి స్వస్తి పలికే విషయంలో సాంకేతికతను సమకూర్చుకోవాలని తెలిపింది. ఈ క్రమంలో వాట్సాప్ ప్రతినిధులు మాథ్యు ఇడిమా భారత ప్రభుత్వ అధికారులతో కలిసి మాట్లాడారు. ఈ విషయంలో ఎలాంటి సహకారం కావాలో తమకు సూచించమని తెలిపారు.