లవ్ యూ బాప్‌జీ అంటూ.. షారుక్ భావోద్వేగపు పోస్ట్
భారత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి గురువారం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.
భారత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి గురువారం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సాయంత్రం 5: 05 నిమిషాలకు కన్నుమూశారు. ఆయన మృతిపట్ల సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. అయితే వాజ్‌పేయితో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుక్ ఖాన్ అన్నారు. అందరూ ఆయన్ని వాజ్‌పేయి అంటే నేనుమాత్రం ‘బాప్‌జీ’ బాపూజీ అంటూ ఆప్యాయంగా పిలిచేవాడినని షారుక్ ట్వీట్ చేశారు.
వాజ్‌పేయితో కలిసే భాగ్యం తనకు కలిగిందని.. ఇద్దరం ఎప్పుడు కలిసినా కవిత్వాలు, సినిమాలు, రాజకీయాలు.. గురించి చర్చించుకొనేవాళ్లమని అన్నారు షారుక్. తన చిన్నతనంలో వాజ్‌పేయి ప్రసంగాలను వినేవాడినని.. ఢిల్లీలో వాజ్‌పేయి ఉపన్యాసాలకు తన తండ్రి తీసుకువెళ్లేవారన్నారు. ఆయన రాసిన పద్యాల్లోని నటించే అవకాశం దక్కిందన్న షారుక్.. ఇంట్లో అందరూ ఆయన్ను బాప్‌జీ అని పిలుస్తారన్నారు.
ఈరోజు దేశం ఓ గొప్ప తండ్రిని, నేతను కోల్పోయిందని.. వ్యక్తిగతంగా తనకు ఇది పెద్ద లోటన్నారు. వాజ్ పేయి ప్రభావం తనపై ఎంతో ఉందన్న షారుక్.. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు.. ఆయన కుటుంబీకులకు సంతాపం తెలుపుతున్నాను అంటూ ట్వీట్ చేశారు. లవ్యూ బాప్‌జీ అంటూ.. 'క్యా కోయా.. క్యా పాయా' అనే పాట వీడియో లింక్‌ను ఈ సందర్భంగా పోస్ట్ చేశారు షారుక్. ఇది వాజ్‌పేయి రచన. షారుక్ నటించారు.