``సీత`` ఇంప్రెస్ చేసిందా ?... మూవీ రివ్యూ మీ కోసం
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్, సోనూసూద్, తణికెళ్ల భరణి,
నటీనటులు: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్, సోనూసూద్, తణికెళ్ల భరణి,
రచన : పరుచూరి బ్రదర్స్ , లక్ష్మి భూపాల
సంగీతం : అనుప్ రుబెన్స్
ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరావు
నిర్మాణం : ఏకే ఎంటర్టైన్మెంట్స్
నిర్మాత : రామబ్రహ్మం సుంకర
కథ -దర్శకత్వం : తేజ
సెన్సార్ : U/A
నిడివి : 2 గంటల 41 నిమిషాలు
రిలీజ్ : మే 24, 2019
తేజ సినిమాలు ఎలా ఉంటాయో మనకు తెలుసు. ఇక బెల్లంకొండ సాయిశ్రీనివాస్ సినిమాలు ఎలా ఉంటాయో కూడా మనకు తెలుసు. ఇలాంటి రెండు డిఫరెంట్ టేస్టులు ఉన్న హీరో-దర్శకుడు కలిశారు. సీతను అందరి దృష్టిలో పడేలా చేసింది ఈ కాంబినేషనే.
స్టోరీలైన్
డబ్బే ముఖ్యం అనుకుంటుంది సీత. డబ్బు కోసం మానవ సంబంధాల్ని కూడా పట్టించుకోదు. తన పొగరు కారణంగా స్థానిక ఎమ్మెల్యే బసవరాజు ఉచ్చులో పడుతుంది. ఓ సెటిల్ మెంట్ కోసం అతడితో నెల రోజులు సహజీవనం చేయడానికి ఒప్పుకుంటుంది. కానీ ఆ తర్వాత బసవకు దూరంగా ఉంటుంది. సరిగ్గా అదే టైమ్ లో సీత తండ్రి చనిపోతాడు. కూతురుకు చెందాల్సిన ఆస్తి మొత్తాన్ని రామ్ పేరిట రాసి మరీ చనిపోతాడు. మరోవైపు బసవ, సీతను అన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతుంటాడు.
ఇలాంటి టైమ్ లో ఆస్తి కోసం బూటాన్ లో ఉన్న రామ్ దగ్గరకు వెళ్తుంది సీత. సమాజానికి దూరంగా కల్మషం లేకుండా, పూర్తి స్వచ్ఛంగా పెరుగుతాడు రామ్. అతడికి అబద్ధం అంటే ఏంటో కూడా తెలీదు. అలాంటి రామ్, సీత బారిన పడతాడు. మరి రామ్, సీతను మార్చగలిగాడా? అసలు రామ్ ఎవరు? సీతను లొంగదీసుకోవడం కోసం బసవ ఏం చేశాడు? ఇది క్లుప్తంగా సీత కథ.
నటీనటుల పనితీరు
సీత అనే టైటిల్ పెట్టారు కాబట్టి హీరోయిన్ గురించి ముందుగా చెప్పుకోవడం లేదిక్కడ. సినిమాలో కాజల్ పెర్ఫార్మెన్స్ ఆ రేంజ్ లో ఉంది కాబట్టి ముందుగా ఇదే ప్రస్తావిస్తున్నాం. అవును.. సీతగా కాజల్ అదరగొట్టింది. ఆమె కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇది. ఈ పాత్ర ముందు రామ్ పాత్ర పోషించిన బెల్లంకొండ తేలిపోయాడు. అలా అని నటించడానికి స్కోప్ లేని పాత్ర కాదది. ఆల్రెడీ అలాంటి అమాయకమైన, స్వాతిముత్యం పాత్రలకు కమల్ హాసన్ ఓ బెంచ్ మార్క్ సెట్ చేసి పెట్టాడు. బెల్లంకొండ ఆ దరిదాపులకు కూడా వెళ్లలేకపోయాడు.
సోనూసూద్ మాత్రం తన యాక్టింగ్ తో మెప్పించాడు. బసవ పాత్రలో అక్కడక్కడ కామెడీ, చాలా చోట్ల విలనీ పండించాడు. చాన్నాళ్ల తర్వాత అతడికి తెలుగులో మంచి పాత్ర పడింది. ఇక ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుందని మేకర్స్ చెప్పిన బిత్తిరి సత్తి కామెడీ పూర్తిగా తేలిపోయింది. ఎక్కడో ఒక చోట కాస్త నవ్విస్తుంది తప్ప ఓవరాల్ గా అతడు ఈ సినిమాకు ప్లస్ అవ్వలేదు.
పాయల్ రాజ్ పుత్ పై తీసిన ఐటెంసాంగ్ కేవలం సినిమా రన్ టైమ్ పెంచడానికి పనికొచ్చింది. ఆమె అందంగా ఉంది తప్ప ఐటెంసాంగ్ కు ఇవ్వాల్సిన ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వలేదు. అలాంటి పాటల్లో వేయాల్సిన స్టెప్పులు వేయలేదు. ఇక సినిమాలో మన్నారా చోప్రాతో పాటు మరెన్నో పాత్రలు ఉన్నాయనే విషయం థియేటర్ నుంచి బయటకొచ్చిన తర్వాత మరిచిపోతాం.
టెక్నీషియన్స్ పనితీరు
ఈసారి తేజకు టెక్నీషియన్స్ నుంచి పెద్దగా సహకారం అందలేదు. అనూప్ రూబెన్స్ ఒక్క పాట మినహా మంచి సాంగ్స్ ఇవ్వలేకపోయాడు. ఇక క్లైమాక్స్ లో వచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో “మనం” సినిమాను మరోసారి గుర్తుకుతెచ్చాడు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, ఫైట్స్ అన్నీ తేజ కనుసన్నల్లోనే నడిచాయి. ఎడిటర్ కు స్వేచ్ఛ ఇవ్వలేదు. అమాయకుడు, చిన్నప్పట్నుంచి బూటాన్ లోని బౌద్ధుల వద్ద పుట్టిపెరిగిన హీరోకు ఓ పాటలో అలాంటి స్టెప్పులు ఎందుకు ఇవ్వాలనిపించిందో కొరియోగ్రాఫర్లకే తెలియాలి.
దర్శకుడు తేజ విషయానికొస్తే ఈసారి ఇతడు కథ కంటే క్యారెక్టరైజేషన్లపై ఎక్కువగా దృష్టిపెట్టినట్టు కనిపిస్తుంది. చాలా చోట్ల తనకు తానే లాక్స్ పెట్టుకోవడంతో కథను ముందుకు నడిపించలేకపోయాడు. పైగా సన్నివేశాలు రాసుకోవడంతో ఇప్పటికీ తను తీసిన ‘జయం’ నాటి ట్రెండ్ వద్దే ఆగిపోయాడు. నిర్మాతలు మాత్రం దర్శకుడిపై నమ్మకంతో ఖర్చుకు వెనకాడలేదు.
రివ్యూ
రామాయణంలో సీత గురించి అందరికీ తెలుసు. కానీ ఇది నేటి సీత కథ. అప్పటి సీతలా సైలెంట్ గా, ఓర్పుగా ఉండే సీత కాదు. ఇలాంటి సీత తన పొగరుబోతుతనంతో ఎలాంటి కష్టాలు కొనితెచ్చుకుంది, చివర్లో ఎలా రియలైజ్ అయిందనేది ఈ సీత కథ. ఈ సీతకు ఓ అమాయకుడైన రాముడ్ని సెట్ చేశాడు దర్శకుడు తేజ. మధ్యలో ఓ విలన్ ను కూడా ఉంచాడు. ఫైనల్ గా ఈ 2 గంటల 41 నిమిషాల హైటెక్ రామాయణం ప్రేక్షకుడికి ఓ మోస్తరుగా మాత్రమే నచ్చుతుంది.
తేజ సినిమాల్లో కథ సాలిడ్ గా ఉంటుంది. ఆ కథకు తగ్గట్టు పాత్రలు కూడా అంతే బలంగా ఉంటాయి. కానీ ఈసారి తేజ క్యారెక్టర్లు రాసుకున్నట్టున్నాడు. ముందుగా అతడికి సీత పాత్ర తట్టి ఉంటుంది. ఆ తర్వాత అమాయకుడైన రామ్ పాత్రను సృష్టించాడు. ఆ వెంటనే విలన్ పాత్ర కోసం “బసవ”ను సృష్టించినట్టున్నాడు. ఇలా ముందుగా పాత్రలు అనుకొని తర్వాత కథ రాయడంతో చాలా చోట్ల సీత నెమ్మదిస్తుంది. పరుగులు పెట్టాల్సిన టైమ్ లో సహనాన్ని పరీక్షిస్తుంది. మరీ ముఖ్యంగా హీరో పాత్రపై సీత ప్రేమ పెంచుకునే కీలకమైన నెరేషన్ ను గాలికి వదిలేశారు.
ఇక తేజ స్టయిల్ ఆఫ్ సన్నివేశాలకు సీతలో కొదవ లేదు. సీరియస్ గా సాగుతున్న సీన్ లో కామెడీ పెట్టడం, హీరోహీరోయిన్లను కాపాడ్డం కోసం ఓ వర్గాన్ని రెడీ చేయడం, క్లైమాక్స్ లో హీరోను చచ్చిపోయేలా కొట్టడం, హీరోహీరోయిన్లను వదిలేసి ఎమోషన్ కోసం సైడ్ క్యారెక్టర్లపై ఆధారపడడం.. ఇలా తేజ మార్క్ టేకింగ్, ఫ్రేమింగ్ మొత్తం సీత సినిమాలో కనిపిస్తుంది. అక్కడక్కడ సినిమా బోర్ కొట్టడానికి ఇది కూడా ఓ కారణం.
ఇవన్నీ పక్కనపెడితే.. రామ్ పాత్రలో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ను చూడ్డం మాత్రం కాస్త ఇబ్బంది అనిపిస్తుంది. పాత్ర పరిచయం నుంచి బెల్లంకొండను తలకు ఎక్కించుకోవడానికి కనీసం 20 నిమిషాలైనా పడుతుంది. ఇరగదీసే యాక్షన్ చేసిన బెల్లంకొండను ఇలాంటి స్వాతిముత్యం పాత్రలో చూడ్డానికి మనసొప్పదు. అలాఅని ఇది సాదాసీదా పాత్ర కాదు, కమల్ హాసన్ రేంజ్ లో పండించాల్సిన పాత్ర. బెల్లంకొండకు ఈ విషయంలో కేవలం పాస్ మార్కులు మాత్రమే పడతాయి. కానీ తనలో నటుడ్ని ప్రూవ్ చేసుకోవడం కోసం, హీరోయిజాన్ని, తన ఇమేజ్ ను సైతం పక్కనపెట్టి, ఇలాంటి పాత్రను సెలక్ట్ చేసుకున్న బెల్లంకొండను కచ్చితంగా అభినందించాల్సిందే.
ఈ పాత్రను పట్టుబట్టి మరీ కాజల్ ఎందుకు చేసిందో సీత సినిమా చూస్తే అర్థమౌతుంది. అవును.. సినిమా మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతుంది. ఆమె పెర్ఫార్మెన్స్ కాస్త తేడాకొట్టినా సినిమా మరింత నాసిరకంగా తయారయ్యేది. కాజల్ మాత్రం డిసప్పాయింట్ చేయలేదు. తేజ దర్శకత్వంలో కష్టపడి నటించింది. టెక్నీషియన్స్ నుంచి పెద్దగా
సహకారం దక్కని సీత సినిమాకు కాజల్ కష్టమే శ్రీరామరక్ష.
ఓవరాల్ గా తేజ మార్క్ టేకింగ్, కథలతో పాటు కాజల్ ను ఇష్టపడేవాళ్లకు సీత నచ్చుతుంది.
రేటింగ్ – 2.75/5
@ జీ సినిమాలు