తోటి విద్యార్థుల రక్తం తాగాలనే కోరికతో ప్లాన్ చేశారు.. దొరికిపోయారు..!
హారర్ సినిమాల ప్రభావం పిల్లల మనసు మీద పడితే అది ఎంతటి విపరీతాలకు దారి తీస్తుందో ఈ సంఘటనను చూస్తే అర్థమవుతుంది.
హారర్ సినిమాల ప్రభావం పిల్లల మనసు మీద పడితే అది ఎంతటి విపరీతాలకు దారి తీస్తుందో ఈ సంఘటనను చూస్తే అర్థమవుతుంది. అమెరికాలోని ఫ్లోరిడాలో ఇద్దరు మిడిల్ స్కూల్ అమ్మాయిలు ఈ మధ్యకాలంలో తమ తోటి విద్యార్థులను హతమార్చడానికి ఓ పథకం వేశారు. ఆ పథకంలో భాగంగానే రెండు కత్తులను కూడా కొన్నారు. స్కూలు బాత్ రూమ్‌లో మాటు కూడా వేశారు. అయితే వారి కదలికలు అనుమానాస్పదంగా ఉన్నట్లు స్కూలు వారి సీసీటీవీ కెమెరాలను మెనేజ్ చేసేవారు గమనించడంతో.. వారు యాజమాన్యానికి సమాచారం అందించారు.
అలాగే స్కూలుకు వచ్చిన ఈ విద్యార్థులు కొన్ని పిరియడ్స్‌కి హాజరు కాకపోవడంతో టీచర్లు కూడా ప్రిన్సిపల్ దృష్టికి వారి విషయాన్ని తీసుకెళ్లారు. తర్వాత బాత్ రూమ్ బయట ఈ విద్యార్థినులు కత్తులతో తచ్చాడుతున్నట్లు సీసీటీవీ కెమెరా ద్వారా తెలిసింది. భయాందోళనలకు గురైన స్కూలు యాజమాన్యం వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆ విద్యార్థినులను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు.
పోలీసుల ఎంక్వయరీలో ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. కేవలం 12 సంవత్సరాల వయసున్న ఈ విద్యార్థినులు తమకు హారర్ సినిమాలు చూడడం అంటే ఎంతో ఆసక్తి అని తెలిపారు. ఓ సినిమాలో కథనం ప్రకారం.. విద్యార్థులు తమ తోటి విద్యార్థి గొంతు కోసి రక్తం తాగుతారని.. తాము కూడా అలా చేయాలని ప్రయత్నించామని విద్యార్థినులు తెలిపారు. దీంతో ఆశ్చర్యపోవడం పోలీసుల వంతైంది. వారు విద్యార్థినుల తల్లిదండ్రులను వెంటనే పిలిపించి మాట్లాడారు.
తర్వాత వారిని బెయిల్ మీద విడుదల చేశారు. అయితే వారి ఇంటికి పంపించమని.. కనీసం ఓ నెల వారికి కౌన్సిలింగ్ సెంటర్‌లో ట్రీట్ మెంట్ ఇప్పిస్తామని ఈ కేసును టేకప్ చేసిన బార్టవ్ ప్రాంత పోలీసులు తెలిపారు. ఈ విద్యార్థినులు పాల్క్ కౌంటీ స్కూలు పిల్లలు కాగా.. ఈ విషయాన్ని ఆ పాఠశాల యాజమాన్యం సీరియస్‌గా తీసుకుంది. ఈ వారంలో విద్యార్థుల కోసం ప్రత్యేక గైడెన్స్ సెల్ ప్రారంభిస్తామని అక్కడి మీడియాకి తెలిపింది.