ముంబై:బాలీవుడ్‌ మహిళాసూపర్‌ శ్రీదేవి(54) భౌతికకాయం స్వగృహానికి చేరుకోవడంతో సినీ ప్రముఖులు, వేలాది మంది అభిమానులు ముంబైకి చేరుకుంటున్నారు. శ్రీదేవి స్వగృహంలో పార్ధీవదేహన్ని ఉంచారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శ్రీదేవి అంతిమయాత్ర బుధవారం మధ్యాహ్నం తర్వాత ప్రారంభమవుతుందని కుటుంబసభ్యులు తెలిపారు. అభిమానుల సందర్శనార్థం భౌతికకాయాన్ని అంధేరి వెస్ట్‌లోని లోఖండ్‌వాలా సెలెబ్రేషన్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఉంచుతామన్నారు. అంతిమ యాత్ర మధ్యాహ్నం 2 తర్వాత ప్రారంభమవుతుందని, అంత్యక్రియలు విలే పార్లె సేవా సమాజ్‌ క్రిమిటోరియంలో సాయంత్రం 3.30 ప్రాంతంలో జరుగుతాయని వెల్లడించింది. 


నివాళులు అర్పించడానికి  మీడియా కూడా రావచ్చని, అయితే కెమెరాలు, ఇతర రికార్డింగ్‌ ఉపకరణాలు బయట వదిలేసి రావాలని విజ్ఞప్తి చేసింది. ఈ విషాద సమయంలో అండగా నిలిచిన మీడియాకు, సినీపరిశ్రమకు, శ్రీదేవి అభిమానులకు ఖుషి, జాన్వి, బోనీ కపూర్‌, కపూర్‌, అయ్యప్పన్‌ కుటుంబాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు పేర్కొంది. 


కాగా, అతిలోక సుందరి అంతిమ యాత్రలో పాల్గొనేందుకు ఇప్పటికే పలువురు ప్రముఖులు, నటీనటులు ముంబైకి చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి తెలుగు సినీ ప్రముఖులు కూడా  ముంబైకి బయల్దేరి వెళ్లారు.